సాక్షి, పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో దారుణం జరిగింది. టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాల్మన్.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.
పిన్నెల్లి గ్రామానికి చెందిన సాల్మన్ మొదటి నుంచి వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊరు వదిలి వెళ్లిపోవాలని సాల్మన్‌కు తెలుగుదేశం నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రాణభయంతో కుటుంబంతో సహా బ్రహ్మణపల్లికి మకాం మార్చాడు. అయితే..
వైఎస్సార్‌సీపీ నేతలు ధైర్యం చెబుతుండడంతో రెండు నెలల కిందట సాల్మన్ కుటుంబం తిరిగి పిన్నెల్లికి వచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు స్థానికుల సాయంతో టీడీపీ నేతలు వాళ్లను అడ్డుకున్నారు. పంచాయితీ తర్వాత చివరకు సాల్మన్ మినహా కుటుంబ సభ్యులను మాత్రమే ఊర్లో ఉండేందుకు అనుమతి ఇచ్చారు. అయితే..
సాల్మన్ భార్య ఈ మధ్య అస్వస్థతకు గురైంది. దీంతో.. ఈనెల 10వ తేదీన పిన్నెల్లి వెళ్లి ఆమెను చూడటానికి సాల్మన్ ప్రయత్నించాడు. రావొద్దన్నా.. ఎందుకు వచ్చావ్ అంటూ టీడీపీ గూండాలు ఆయన్ని చితకబాదారు. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న టైంలోనే కోమాలోకి వెళ్లిన సాల్మన్.. చివరకు నాలుగు రోజుల తర్వాత ఈ ఉదయం కన్నుమూశాడు. ఈ ఘటనపై స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సాల్మన్‌పైనే కేసు!
సాల్మన్ మృతి చెందిన విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ అండతోనే ఈ హత్య జరిగిందని మండిపడ్డారు. ‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి గ్రామానికి చెందిన వందలాది కుటుంబాలు బయటికి వెళ్లిపోయాయి. సాల్మన్ కూడా బయటే బతుకుతున్నాడు. టీడీపీ నేతల చేతిలో తీవ్రంగా గాయపడిన కోమాలోకి వెళ్లిన సాల్మన్‌పైనే కేసు పెట్టారు. ఈ కేసులో సీఐ పనికిమాలిన సెక్షన్స్ పెట్టాడు. రేపు పిన్నెల్లిలోనే సాల్మన్ అంత్యక్రియలు జరిపి తీరుతాం. చంద్రబాబు, లోకేష్‌లు మీడియా ముందు నీతులు చెప్పడం కాదు.. పిన్నెల్లి అంశంపై మాట్లాడండి అంటూ మహేష్ రెడ్డి హితవు పలికారు.


