జగన్‌ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు | No Coercive Action Till AP High Court On YS Jagan Quash Petition | Sakshi
Sakshi News home page

జగన్‌ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Jun 27 2025 12:11 PM | Updated on Jun 27 2025 2:13 PM

No Coercive Action Till AP High Court On YS Jagan Quash Petition

సాక్షి, అమరావతి: రెంటపాళ్ల పర్యటన కేసులో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. కారు ప్రమాదం జరిగితే.. కారులో ఉన్నవాళ్లపై కేసు ఎలా పెడతారు? అంటూ పోలీసులను నిలదీసింది. అలాగే ఈ కేసులో తదుపరి విచారణ జరిగేదాకా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. 

జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెన్నపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త మరణించాడు. జగన్‌ కాన్వాయ్‌ వల్లే అతను మరణించాడని కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు.. నిందితుల జాబితాలో ఆయన పేరును కూడా చేర్చారు. అయితే రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు నమోదు చేశారని, ప్రజల్ని కలవకుండా అడ్డుకునేందుకే ఈ ప్రయత్నమని పేర్కొంటూ వైఎస్‌ జగన్‌ క్వాష్‌ పిటిషన్‌ వేశారు. 

ఈ పిటిషన్‌తో పాటు ఇదే కేసులో వైఎస్సార్‌సీపీ నేతలు వేసిన మరో నాలుగు క్వాష్‌ పిటిషన్లను కలిపి హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ‘‘కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవాళ్లపై ఎలా కేసు పెడతారు?. ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యుల్ని చేస్తారు?. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

ఈ క్రమంలో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ లాయర్‌ మరింత గడువు కోరగా.. తదుపరి విచారణను మంగళవారానికి(జులై 1వ తేదీకి) వాయిదా వేసింది. అప్పటిదాకా నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 

జగన్‌ క్వాష్‌ పిటిషన్‌లో ఏముందంటే..

  • మృతుడి భార్య లూర్థు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్‌ఎస్‌ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్‌ 106(1) (నిర్లక్ష్యం కారణంగా చావుకు కారకులు) ప్రకారం మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎందుకనో.. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 105 (హత్య కిందకు రాని కల్పబుల్‌ హోమిసైడ్‌), 49 (నేరానికి ప్రేరేపించడం) సెక్షన్లుగా మార్చారు.  

  • మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కిందపడి నలిగినట్లు లేదని.. పోలీసుల వాదన నమ్మదగినదిగా లేదు. 

  • ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని మొదట్లో పోలీసులు తెలిపారు. ఆ వాహన యజమానిని, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వాంగ్మూలాలను నమోదు చేసి, పూచీకత్తు తీసుకున్నాక బెయిల్‌పై విడుదల చేశారు.

  • కాన్వాయ్‌లోని గుర్తుతెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ స్వయంగా ప్రకటించారు. 

  • నా పర్యటన(రెంటపాళ్ల) వివరాలను పోలీసులకు ముందుగానే అందజేసినా.. తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. 

  • ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే రాష్ట్రప్రభుత్వం ఈ కేసు పెట్టింది. 

  • పై అంశాలను పరిగణనలోకి తీసుకొని నాపై నమోదుచేసిన కేసును కొట్టేయాలి

Advertisement
 
Advertisement
Advertisement