
భక్తులకు నూతన వసతి సముదాయం
ఉప రాష్ట్రపతితో కలిసి ప్రారంభించిన ముఖ్యమంత్రి
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం వేంకటాద్రి నిలయం అందుబాటులోకి వచ్చింది. రూ.102 కోట్లతో టీటీడీ నిర్మించిన ఈ పిలిగ్రిమ్స్ అమెనిటీస్ సెంటర్ (పీఏసీ)–5ను గురువారం ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ముందస్తు బుకింగ్ లేకుండా వచ్చే వారిలో ఒకేసారి నాలుగువేల మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించేలా ఈ భవనాన్ని నిర్మించారు.
దీన్లో 16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, 24 గంటలు వేడినీటి సదుపాయం, ఒకేసారి 1,400 మంది భక్తులు భోజనం చేసేలా రెండు పెద్ద డైనింగ్ హాళ్లు తదితర సౌకర్యాలు కల్పించారు. ఒకేసారి 80 మంది భక్తులు తలనీలాలు సమర్పించేందుకు వీలుగా కల్యాణకట్టను కూడా పీఏసీ–5 ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.
ఈ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు ఒక భక్తురాలికి వసతి బుకింగ్ టోకెన్‌ను అందజేశారు. అనంతరం తిరుమల పోటులో ఏర్పాటు చేసిన సారి్టంగ్ యంత్రాలను ప్రారంభించారు. ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యర్థాల సేకరణ యంత్రాన్ని ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రి పరిశీలించారు.
టెక్నాలజీతో క్యూలైన్ల నిర్వహణకు ఐసీసీసీ
అనంతరం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. తిరుమల కొండపైకి నిషేధిత వస్తువులు తీసుకురాకుండా అలిపిరి వద్దే నిలువరించేలా ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచే పర్యవేక్షించాలని ఆదేశించారు. అలిపిరి నుంచే రద్దీ హీట్ మ్యాప్‌లను గుర్తించి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీవారి ఏడుకొండలు ఏడురంగులతో గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాలను ఐసీసీసీతో అనుసంధానించాలన్నారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేలా అత్యుత్తమ విధానాన్ని అనుసరించాలని ఆయన సూచించారు. ఏఐ, క్వాంటం రెడీ అనలటిక్స్, మెషిన్ లెర్నింగ్ సాయంతో ఎంతమంది భక్తులు నిరీక్షణలో ఉన్నారో గుర్తించి అందుకనుగుణంగా క్యూలైన్ నిర్వహణ చేపడతామని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, లోకేశ్, సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుపతి జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈవో వి.వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకష్ణ పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి, సీఎం
ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్ద ఉప రాష్ట్రపతికి టీటీడీ అధికారులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ శ్రీవారి లడ్డూప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. ఉప రాష్ట్రపతి, సీఎం ఆలయంలో సుమారు 50 నిమిషాలు ఉన్నారు. ఈ సందర్భంగా సుమారు గంటన్నరపాటు సాధారణ భక్తుల దర్శనాన్ని టీటీడీ నిలిపేసింది. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారినీ దర్శించుకున్నారు.