బాబుకు రెస్ట్‌! నేనే పోటీ చేద్దామని అనుకుంటున్నా: నారా భువనేశ్వరి | I Want To Contest From Kuppam: Nara Bhuvaneshwari Shocking Comments In TDP Meeting At Kuppam - Sakshi
Sakshi News home page

బాబుకు రెస్ట్‌! నేనే పోటీ చేద్దామని అనుకుంటున్నా: నారా భువనేశ్వరి

Published Thu, Feb 22 2024 4:28 AM

Nara Bhuvaneshwari Shocking Comments At Kuppam - Sakshi

(సాక్షి, అమరావతి–తిరుపతి–శాంతిపురం) :‘జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక రోజు వస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టాలంతే!’ అంటారు పెద్దలు.  బహుశా! కుప్పం ప్రజలకు కూడా 35 ఏళ్ల తరవాత ఆ రోజు వచ్చినట్లుంది. దశాబ్దాలుగా తాము గెలిపి­స్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని.. రెండేళ్ల కిందటిదాకా కనీసం సొంతిల్లు కూడా కట్టు కోలేదని వాళ్లకి అర్థమయింది. బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా నీళ్లు తెస్తానని ఇన్నాళ్లూ మోసపు మాటలు చెప్పారే తప్ప.. ఆ పనిని చేసి చూపించింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డేనని వాళ్లకు అనుభవంలోకి వచ్చింది. అందుకే రాబోయే ఎన్నికల్లో బాబుకు బైబై చెప్పేందుకు వాళ్లంతా సిద్ధమవటంతో.. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ నక్కజిత్తుల నారా వారు తనను ఓడించక ముందే ఆ నియోజకవర్గానికి ‘బై’ చెప్పటానికి సిద్ధమయ్యారు.  

‘‘35 ఏళ్లుగా మీరు చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తున్నారు. ఇక ఆయనకు రెస్ట్‌ ఇవ్వాలనిపిస్తోంది. అందుకే ఈ సారి ఇక్కడి నుంచి నేను పోటీ చేయాలనుకుంటున్నాను’’ అంటూ చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరి బుధవారం కుప్పంలో ఓ బహిరంగ సభలో స్పష్టంగా చెప్పారు. స్కిల్‌ కుంభకోణంలో వేల కోట్లు నేరుగా విత్‌డ్రా చేసుకుని మింగేసిన కేసులో ఈ మధ్య చంద్రబాబు నాయుడిని పోలీసులు అరెస్టు చేయటంతో ఆయన జైలుకు వెళ్లటం తెలిసిందే. అది జరిగిన 10–15 రోజుల తరవాత కూడా ఆయన జైలు జీవితాన్ని చూసి తట్టుకోలేక కొందరు మరణించారన్నది టీడీపీ–ఎల్లో మీడియా వ్యాఖ్యానం.

వారందరికీ సాయం చెయ్యడానికి నేరుగా నారా భువనేశ్వరి ఓ యాత్ర చేస్తున్నారు. ఆమేమీ రాజకీయ నాయకురాలు కాదు. దీంతో యాత్రలో భాగంగా ఎక్కడికి వెళ్లాలి? ఎవరెవరిని కలవాలి? ఎవరికి చెక్కులివ్వాలి? ఏమేం మాట్లాడాలి? అనేది మొత్తం స్క్రిప్టు ప్రకారమే చేస్తున్నారు. బుధవారం మాట్లాడిన మాటలు కూడా ఆ స్క్రిప్టులో భాగమే. కళ్లెదుట ఓటమి స్పష్టంగా కనిపిస్తుండడంతో ఏదో ఒక వంకతో అక్కడి నుంచి పోటీ చేయకుండా జారుకోవాలనేది బాబు పన్నాగమని, అందుకే భార్య చేత ఆ మాటలు మాట్లాడించారు తప్ప అవేమీ చమత్కారమో, యథాలాపమో కావని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. 

కుప్పంలో పడిపోయిన బాబు గ్రాఫ్‌... 
కుప్పం బరి నుంచి పక్కకు తప్పుకొని వేరే నియోజకవర్గం చూసుకోవాలని, లేకపోతే ఈ సారి ఎన్నికల్లో పోటీయే చేయకుండా నాన్‌ ప్లేయింగ్‌ కెపె్టన్‌గా వ్యవహరించాలని బాబు ఆలోచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కుప్పంలో బాబు గ్రాఫ్‌ అంతకంతకూ దారుణంగా పడిపోవటం దీనికి మొదటి కారణం. నిజానికి 2019 ఎన్నికల్లోనే ఆయన మెజారిటీ బాగా తగ్గిపోవటం నుంచి ఈ గ్రాఫ్‌ పతనం మొదలయింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు చేతి నుంచి కుప్పం జారిపోయింది.

మున్సిపల్‌ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంది. 25 వార్డుల్లో టీడీపీ కేవలం 7 వార్డుల్లో గెలవగా మిగిలిన 18 వార్డుల్లోనూ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. అంతకుముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89 పంచాయతీలకు గాను 70 పంచాయతీలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. నాలుగు జెడ్‌పీటీసీలు, నాలుగు ఎంపీపీ స్థానాల్లో కూడా టీడీపీ ఓడిపోయింది. ఈ ఫలితాలన్నీ కుప్పంలో చంద్రబాబు పని అయిపోయినట్లేనని స్పష్టంగా చెప్పాయి.  

వాస్తవానికి తనను ఏడుసార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు ఎప్పుడూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆ ప్రాంతానికి మేలు చేయలేదు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా హంద్రీనీవా నీళ్లు తెస్తానని మోసం చేశారే తప్ప పని చేయలేదు. కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా ద్వారా నీళ్లు వచ్చినా, దాన్ని మున్సిపాలిటీగా మార్చినా, రెవెన్యూ డివిజన్‌గా అప్‌గ్రేడ్‌ చేసినా.. అవన్నీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎంగా ఉన్నపుడే జరిగాయి.

ఇక్కడ 20వేల మందికి ఇళ్ల పట్టాలివ్వటంతో పాటు వాటిలో 10వేల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయింది. దాదాపు 90 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. సుదీర్ఘకాలం సీఎంగా ఉన్నా బాబు ఈ స్థానాన్ని పట్టించుకోలేదు సరికదా... కనీసం సొంతిల్లు కూడా కట్టుకోలేదు. వరస పరిణామాలతో కుప్పం తనకు గుడ్‌బై చెప్పబోతోందోని అర్థమై రెండేళ్ల కిందట సొంతిల్లు కట్టారు. అయినా పరిస్థితి మారకపోవటంతో ఓటమిని తప్పించుకోవటానికి కుప్పం నియోజకవర్గానికి గుడ్‌బై చెప్పే ఆలోచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.  

‘సిద్ధం’ సభలతో ఉక్కిరి బిక్కిరి  
చంద్రబాబు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ‘రా... కదలిరా’ పేరిట సభలు నిర్వహించారు. మరోవైపు లోకేశ్‌ ‘శంఖారావం’ పేరుతో సభలు పెట్టారు. ఇక నారా భువనేవ్వరి ‘నిజం గెలవాలి’ అంటూ సమావేశాలు పెడుతున్నారు. వైఎస్పార్‌ సీపీ తరఫున వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక్కరే... ‘సిద్ధం’ అంటూ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో సభలు నిర్వహించారు. బాబు...లోకేశ్‌... భువనేశ్వరి సభలన్నిట్లోనూ కలిపినా... రాప్తాడులో జరిగిన సిద్ధం సభకు వచ్చిన జనాల్లో సగం కూడా రాలేదు.

‘సిద్ధం’ సభలు మూడూ ఒకదాన్ని మించి మరొకటి జనసంద్రాలయ్యాయి. జనం నాడి అర్థమైన చంద్రబాబుకు వణుకు మొదలైంది. అందుకే పొత్తులతోనైనా ఎలాగోలా పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుప్పంలో కూడా తాను ఓడిపోతే పరిస్థితి దయనీయంగా మారుతుందని, పార్టీ చేజారిపోతుందని అర్థమై.. ఈ సారికి వేరే చోట నుంచి పోటీ చెయ్యడమో... లేకపోతే ఎక్కడా పోటీ చేయకుండా నాన్‌ ప్లేయింగ్‌ కెపె్టన్‌లా వ్యవహరించి పరువు నిలుపుకోవటమో చేయాలని చూస్తున్నారన్నది పార్టీ వర్గాల మాట.  
 
 – చంద్రబాబుకి రెస్ట్‌ ఇచ్చి.. తానే పోటీ చేయాలనుందన్న భువనేశ్వరి! 
– కుప్పంలో పర్యటనలో బాబు సతీమణి వ్యాఖ్యలతో టీడీపీలో ఆందోళన 
– ఓటమి భయంతోనే..  బాబు అలా పలికించారనే ప్రచారం 
 
సాక్షి, తిరుపతి/శాంతిపురం: ‘‘కుప్పానికి వచ్చాను. ఇక్కడ నాకొక కోరిక ఉంది. నా మనస్సులో ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది, నేనేమీ మిమ్మల్ని కొట్టను.. తిట్టను.. 35 ఏళ్లుగా చంద్రబాబు గారు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు నాకొక కోరిక ఉంది. ఆయన్ను రెస్ట్‌ తీసుకోమని చెబుతున్నా. నేనే ఇక్కడి నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నా’’  
    (కుప్పం నియోజక వర్గం శాంతిపురం బహిరంగ సభలో నారా భువనేశ్వరి) 
 
నారా భువనేశ్వరి చేసిన కీలకమైన వ్యాఖ్యలు టీడీపీలో దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె సరదాగా చేసిన వ్యాఖ్యలే అనుకుంటే పొరబడ్డట్టేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆమె ఎప్పుడూ బహిరంగ సభలో ప్రసంగించలేదు. చంద్రబాబు అరెస్ట్‌ తరువాత జనంలోకి వచ్చిన నారా భువనేశ్వరి ఏం మాట్లాడాలో స్క్రిప్ట్‌ రాసిస్తారు. ఆ స్క్రిప్‌్టని ఆమె బట్టీ పట్టి సభలో మాట్లాడుతారని టీడీపీలోని ఓ ముఖ్య నేత స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో రెండు రోజులుగా పర్యటిస్తున్న నారా భువనేశ్వరి బుధవారం శాంతిపురంలో ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. ఆమె ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో చర్చ జరుగుతోంది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక.. 35 ఏళ్ల కాలంలో చంద్రబాబు కుప్పానికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారని స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు చేయలేని ఎన్నో అభివృద్ధి పనులు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసి చూపించడంతో పాటు.. కుప్పం వాసుల కలగా మిగిలిన హంద్రీ–నీవాకు కృష్ణా జలాలు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ కేవలం ఐదేళ్ల కాలంలో కాలువ పనులు పరుగెత్తించి నీరు తీసుకురావడంతో కుప్పం వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కుప్పాన్ని మున్సిపాలిటీతో పాటు రెవెన్యూ డివిజన్‌గా చేశారు.

చంద్రబాబు చేయలేని ఎన్నో కార్యక్రమాలు సీఎం వైఎస్‌ జగన్‌ వల్లే కావడంతో కుప్పం వాసుల్లో మార్పు కనిపించింది. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టారు. కుప్పంలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీపీలు, మున్సిపాలిటీని వైఎస్సార్‌సీపీ కైవశం చేసుకుంది. పంచాయతీల్లోనూ అత్యధికంగా వైఎస్సార్‌సీపీ బలపరచిన అభ్యర్థులే విజయం సాధించారు. కుప్పంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పర్యటించిన సమయంలో స్థానికుల నుంచి అనూహ్య స్పందన లభించడం వంటి పరిణామాలు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టించాయి. అప్పటి నుంచి చంద్రబాబు నియోజకవర్గాన్ని మార్చాలని భావించారు. అందులో భాగంగా స్థానిక, జిల్లా, రాష్ట్ర నాయకులతో పలుమార్లు ఈ విషయం గురించి చర్చించారు. 

సతీమణి చేత చెప్పిండం వెనుక మర్మమం అదే 
ఎన్నికలకు సరిగ్గా రెండు నెలలు కూడా లేని సమయంలో నిజం గెలవాలి అనే కార్యక్రమం పేరుతో తన సతీమణి భువనేశ్వరిని కుప్పానికి పంపించారు. కుప్పంలో ఏం మాట్లాడాలో స్క్రిప్ట్‌ రాసి పంపారని, అందులో భాగంగా భార్యతో స్పష్టంగా చెప్పించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారని కోర్టుకు నివేదికలు సమర్పించిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

అనారోగ్యం, ఆపై వయస్సు మీద పడడంతో వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తప్పుకోవడమే మేలని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. కుప్పంలో పోటీచేసి ఓడిపోతే మొదటికే మోసం వస్తుందనే భయంతో భార్యతో చెప్పించారని, ఆ తరువాత పారీ్టతో ప్రకటన చేయించే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. నారా భువనేశ్వరి చేసిన ప్రకటనతో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో అస్త్ర సన్యాసం చేస్తారని సొంత జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement