ధోకా బాబూ..! | Muslim angry against coalition government behavior | Sakshi
Sakshi News home page

ధోకా బాబూ..!

Jun 7 2025 2:45 AM | Updated on Jun 7 2025 2:45 AM

Muslim angry against coalition government behavior

ముస్లింలకు ఇచ్చిన హామీల అమలెప్పుడు?

నూర్‌ బాషా కార్పొరేషన్‌ ఊసేదీ?  

రూ.వంద కోట్ల కేటాయింపెక్కడ? 

50ఏళ్ళకే పెన్షనేదీ? 

మసీదు, ఖబరస్తాన్‌కు స్థలాలెక్కడ?  

ఏడాది పాలనలో ఎదురు చూపులే గతి!  

కూటమి సర్కార్‌ తీరుపై ముస్లింల ధ్వజం  

రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం వివక్ష కొనసాగిస్తోంది. ఒకవైపు వక్ఫ్‌ బోర్డు సవరణకు వత్తాసు పలికిన సర్కారు... మరోవైపు రాష్ట్రంలో వక్ఫ్‌ ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో ముస్లిం మైనార్టీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేయకుండా సాచివేత ధోరణి అవలంబిస్తోంది. 

ఏడాదిగా హామీల అమలు కోసం నిరీక్షించిన ముస్లింలు ఇప్పుడు  హామీల అమలెప్పుడు బాబూ అంటూ గళమెత్తుతున్నారు. ఈ ఏడాది రంజాన్‌ సందర్భంగా తోఫా కూడా అందించని కూటమి సర్కారు తాజాగా బక్రీద్‌(శనివారం) నాటికి కూడా హామీల అమలుకు కార్యాచరణ చేపట్టకపోవడంపై ఆగ్రహం పెల్లుబుకుతోంది.

టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లిం మైనార్టీల కోసం ఇచ్చిన తొమ్మిది ప్రధాన హామీల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటీ అమలు చేయలేదు. గతంలోను ఇదే మాదిరిగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు దగా చేసిన విషయాన్ని ముస్లింలు గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి కూడా మేనిఫెస్టోలో పేర్కొన్నవి, సభల్లో ప్రకటించిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వం కనీసం శ్రద్ధ చూపకపోవడాన్ని వారు తప్పుబడుతున్నారు.  –సాక్షి, అమరావతి

ఏడాదైనా అమలు కాని ముస్లింలకు ఇచ్చిన హామీలివే..
» ముస్లిం మైనార్టీలకు 50ఏళ్లకే పెన్షన్‌
» ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరస్తాన్‌లకు స్థలాలు కేటాయింపు  
» విజయవాడ సమీపంలో హజ్‌హౌస్‌ నిర్మాణం  
» నూర్‌బాషా కార్పొ­రేషన్‌ ఏర్పా­టు, ఏటా రూ.వంద కోట్ల కేటాయింపు   
» మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.5లక్షల వరకు వడ్డీలేని రుణాలు  
» ఇమామ్, మౌజన్‌లకు గౌరవ వేతనం బకాయిలతోసహా పూర్తిగా అందించే చర్యలు  (వీటిని ఏడాదికి చెల్లిస్తున్నట్టు జీఓ ఇచ్చి 9నెలలకు సర్కారు సరిపెట్టింది. ఇంకా ఆరునెలలకు చెల్లించాల్సి ఉంది.)
» అర్హత ఉన్న ఇమామ్‌లు ప్రభుత్వ ఖాజీలుగా నియామకం  
»  మసీదుల నిర్వహణకు ప్రతినెలా రూ.5వేలు ఆర్థిక సాయం  
» హజ్‌ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లింకు రూ.లక్ష    (గత ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులూ 2024 హజ్‌ యాత్రకు వెళ్లిన వారికి చెల్లించకపోగా ఈ ఏడాది వెళ్లిన కూడా ఒక్క పైసా విదల్చలేదు.)

జగన్‌ హయాంలో రూ.20,863కోట్ల లబ్ధి 
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదర్శంగా నిలిచారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన 51,00,771 మందికి రూ.20,863.40కోట్ల లబ్ధి చేకూర్చారు. ఇమామ్‌లకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10వేలకు, మౌజన్లకు రూ.3 వేల నుంచి రూ.5వేలకు గౌరవ వేతనం పెంచి ఆదుకున్నారు. 

ఆదాయంలేని మసీదుకు రూ.5వేలు చొప్పున అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఏడాదైనా దాని ఊసే ఎత్తడం లేదు. వడ్డీలేని రుణాల విషయంలోనూ కూటమి ప్రభుత్వం దగా చేసింది. ఎన్డీఏ కూటమికి ఓట్లేసిన ముస్లింలు మరోసారి మోసపోయామని ఇప్పుడు బాధపడుతున్నారు. –షేక్‌ నాగుల్‌ మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు

మైనారిటీలపై  కూటమి ప్రభుత్వం వివక్ష  
రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతో ఆదరిస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. నామినేటెడ్‌ పోస్టుల్లోనూ ప్రభుత్వం ముస్లింలకు తీరని అన్యాయం చేసింది. రాష్ట్రంలో నూర్‌ బాషా, దూదేకుల కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని, రూ.వంద కోట్లు కేటాయిస్తానని 2014, 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు దగా చేశారు. –షేక్‌ దస్తగిరి, ముస్లిం దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 

మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్యపై కూటమి సర్కారు నిర్లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌లో ఏపీజే అబ్దుల్‌ కలాం ఓవర్సీస్‌  విద్యా పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కూటమి ప్రభుత్వం మైనారిటీ విద్యార్థుల కలల్ని చిదిమేసింది.  2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి కేవలం రూ.20 కోట్లు కేటాయించినా దానిలో ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదు.  జూన్, జూలై, ఆగస్టు నెల నుంచి విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభమవుతున్నా విదేశీ విద్యా పథకానికి నోటిఫికేషన్‌ వెలువడకపోవడం వల్ల విద్యార్థులు అడ్మిషన్, వీసా ప్రక్రియల్ని కొనసాగించలేని దుస్థితిలో ఉన్నారు. –షేక్‌ మునీర్‌ అహ్మద్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌

Advertisement
 
Advertisement
Advertisement