
విజయవాడ లీగల్: ఐక్యరాజ్య సమితి నిర్వహించే జనరల్ అసెంబ్లీ 80వ సెషన్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తరఫున చంద్రగిరి విష్ణువర్ధన్ సోమవారం ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని అభ్యర్ధించారు. ఈ నెల 20 నుంచి వచ్చేనెల 5 వరకు న్యూయార్క్‌లో నిర్వహించే సమావేశాలకు వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీ మిథున్‌రెడ్డికి ఆహా్వనం అందింది. ఇప్పటికే ఈనెల 27 నుంచి 31వరకు అమెరికా పర్యటన నిమిత్తం మిథున్‌రెడ్డి పాస్‌పోర్టును అప్పగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. అయితే ఈనెల 20నుంచి వచ్చేనెల 5వరకు అమెరికా వెళ్లి వచ్చేందుకు అనుమతించాలని మిథున్‌రెడ్డి తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రాసిక్యూషన్‌ను ఆదేశిస్తూ, న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదావేశారు.
విచారణకు సహకరిస్తున్నా రిమాండ్ పొడిగింపు
మద్యం అక్రమ కేసులో రాజ్ కేసిరెడ్డి, చాణక్య, శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీకుమార్ యాదవ్, నవీన్‌కృష్ణ రిమాండ్ సోమవారం ముగిసింది. దీంతో పోలీసులు వారందరినీ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. వీరితోపాటు బెయిల్‌పై ఉన్న మిథున్‌రెడ్డి, పైలా దిలీప్, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి కూడా ఏసీబీ న్యాయస్థానంలో హాజరయ్యారు. నిందితుల తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో రిమాండ్ ముగుస్తున్న ప్రతీసారి ఏవిధమైన మార్పులు లేకుండా ఒకేవిధమైన రిమాండ్ పొడిగింపు నోటీసును న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్నారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు.
ఇప్పటివరకు ఈ కేసులో సిట్ 35 రూపాయలు కూడా స్వా«దీనం చేసుకోలేదన్నారు. నిందితులందరిపై చార్జిషీటు దాఖలుచేసినా 200 రోజుల నుంచి వారందరినీ జైలులోనే ఉంచారన్నారు. వారిని విడుదల చేయాల్సిందిగా న్యాయమూర్తిని అభ్యర్ధించారు. దీనిపై ప్రాసిక్యూషన్ వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కరరావు నిందితులకు ఈ నెల 16 వరకు రిమాండ్‌ను పొడిగించారు.
చెవిరెడ్డి భాస్కరరెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెన్నుపూస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన మంతెన సత్యనారాయణరాజు వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది వాణి ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
సెల్‌ఫోన్ తెరిచేందుకు అనుమతి
మద్యం అక్రమ కేసులో రిమాండ్‌లో ఉన్న చెరుకూరి వెంకటేష్ నాయుడు వద్ద సీజ్ చేసిన సెల్‌ఫోన్‌లో మరిన్ని ఆధారాలున్నాయని పేర్కొంటూ సెల్‌ఫోన్‌ను తెరిచేందుకు బయోమెట్రిక్‌కు అనుమతించాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం దీనికి అనుమతిస్తూ సోమవారం ఆదేశాలు జారీచేసింది.
ఐపీఎస్ సంజయ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
అగ్నిమాపకశాఖ డీజీగా ఉన్న కాలంలో నిధుల అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై రిమాండ్‌లో ఉన్న ఐపీఎస్ సంజయ్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ న్యాయస్థానం తిరస్కరించింది.