
రాజమహేంద్రవరంలో బట్టబయలైన అధికార పార్టీ మద్యం సిండికేట్
టీడీపీ నగర అధ్యక్షుడి ఆధ్వర్యంలో సిండికేట్ చర్చలు
ఎక్సైజ్ అధికారులనూ భాగస్వాముల్ని చేస్తున్న నేతలు
సూత్రధారి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే వాసు
చిత్తశుద్ధి ఉంటే పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి
మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత మార్గాని భరత్‌రామ్ డిమాండ్
రాజమహేంద్రవరం రూరల్: ఒకవైపు నకిలీ మద్యం, మరోవైపు లిక్కర్ సిండికేట్‌తో అధికార పార్టీ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తోందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ మండిపడ్డారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ పరిధిలోని 39 మద్యం షాపుల సిండికేట్‌కు సంబంధించిన ఆడియో సాక్షిగా అధికార పార్టీ నేతల అక్రమాలను భరత్ బయటపెట్టారు.
రేట్ల పెంపు, బెల్టు షాపుల ఏర్పాటుతో పాటు ఎక్సైజ్ అధికారుల మామూళ్ల గురించి నిస్సిగ్గుగా చర్చిస్తున్న టీడీపీ రాజమహేంద్రవరం నగర పట్టణ అధ్యక్షుడు మజ్జి రాంబాబుతో పాటు ఆయన వెనకున్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేను కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని భరత్‌రామ్ డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
అక్రమాలకు వేదికగా రాజమహేంద్రవరం
టీడీపీ ప్రభుత్వంలో రాజమహేంద్రవరం అక్రమాలకు వేదికగా మారింది. రాజమండ్రి సిటీ ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో రాజమహేంద్రవరం నగరం, మరో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నియోజకవర్గం రాజమండ్రి రూరల్‌లోని 39 మద్యం దుకాణాల సిండికేట్ మీటింగ్ పెట్టారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రధాన అనుచరుడైన టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఫోన్ సంభాషణ ద్వారా అధికార పార్టీ నేతల సిగ్గులేని తనం బయటపడింది.
రూ.100 బాండ్ పేపరు మీద సంతకాలు చేద్దామంటూ నిస్సిగ్గుగా ప్రతిపాదించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలి. ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 37ఏ, 39/1, 2 సెక్షన్ల ప్రకారం వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలి. మజ్జి రాంబాబు వెనుక ఉన్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేయాలి. ఆయన్ని చంద్రబాబు బర్తరఫ్ చేయాలి. దీంతో పాటు ప్రభుత్వ అధికారులకు లంచాలిద్దామంటూ నేరుగా చెబుతున్నారు. దీనిపై బీఎన్‌ఎస్ 274, 276 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తాం.
ఎమ్మెల్యే అండతోనే సిండికేట్ మంతనాలు
ఎక్సైజ్ అధికారులు ఎవరి మీద కేసు పెట్టాలో కూడా డ్రా తీసి వీళ్లే నిర్ణయిస్తామని చెబుతున్నారు. కేసు పెట్టిన షాపు కట్టాల్సిన ఫైన్ సిండికేట్ మొత్తం భరించేలా ఒప్పందం చేసుకుంటున్నారు. రెండుసార్లు కేసులు వస్తే.. ఆ షాపు క్లోజ్ అవుతుంది కాబట్టి వంతుల వారీగా ఏ షాపు మీద కేసు పెట్టాలో కూడా సిండికేటే నిర్ణయిస్తుంది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అండ లేకుండా ఇలా అధికారులను సైతం ప్రభావితం చేయడం సాధ్యమా? లేని లిక్కర్ కేసులో మా పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డిని, ఇతర నేతలను అరెస్టు చేశారు. ఇవాళ మీ పార్టీ నేతలు బహిరంగంగా దొరికిపోయారు.
రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీలో చంద్రబాబుకు సైతం భాగస్వామ్యం ఉంది. కూటమి నేతలు ఇంత విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నా కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఇంత పెద్ద ఎత్తున స్కామ్‌కు పాల్పడుతున్న వీళ్లందరినీ అండమాన్ లేదా తీహార్ జైలుకు పంపించాలి.
కూటమి నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఆ బురదను ప్రతిపక్షంపై చల్లుతున్నారు. మద్యం షాపుల్లో అమ్మే మందు అసలా, నకిలీయా తేల్చాల్సింది ప్రభుత్వం. ఒకవైపు నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తూ.. కొనే ముందు ఫోనులో స్కాన్ చేసి అది అసలా.. నకిలీయా టెస్ట్ చేయమంటున్నారు. రూ.100కు చీప్ లిక్కర్ కొనే వారి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుందా?
వైఎస్ జగన్ హయాంలోనే డేటా సెంటర్
విశాఖలో ఏర్పాటు చేస్తున్నది గూగుల్ అదానీ ఎయిర్ టెల్ డేటా సెంటర్. దీనితో పాటు ఐటీ పార్కు, స్కిల్ యూనివర్సిటీ తీసుకురావాలని వైఎస్ జగన్ విశాఖలో 130 ఎకరాల స్థలం ఇచ్చి ఎంఓయూ చేసుకున్నారు. 2021లో రూ.23 వేల కోట్ల పెట్టుబడులతో 25 వేల ఉద్యోగాలతో విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఎక్స్‌పోలో అదానీ డేటా సెంటర్‌తో ఎంఓయూ చేసుకుని, 2023 మే నెలలో శంకుస్థాపన కూడా చేశారు. వైఎస్ జగన్ హయాంలో చేసిన అభివృద్ధినే చంద్రబాబు ఇప్పుడు చెప్పుకుంటున్నారు.