ఈఫిల్‌ కన్నా ఎత్తైన వంతెనపై.. తెలుగుతేజం | Madhavilatha played a key role in the construction of the railway arch bridge over the Chenab River | Sakshi
Sakshi News home page

ఈఫిల్‌ కన్నా ఎత్తైన వంతెనపై.. తెలుగుతేజం

Jun 8 2025 3:06 AM | Updated on Jun 8 2025 3:06 AM

Madhavilatha played a key role in the construction of the railway arch bridge over the Chenab River

చినాబ్‌ నదిపై రైల్వే ఆర్చి బ్రిడ్జ్‌  నిర్మాణంలో మాధవీలత కీలకపాత్ర 

సాక్షితో సంతోషాన్ని పంచుకున్న ప్రొఫెసర్‌  

తెనాలి: దేశానికి గర్వ కారణంగా నిలిచిన చినాబ్‌ రైల్వే వంతెన నిర్మాణంలో రాష్ట్రానికి చెందిన మహిళా ఇంజనీర్, ప్రొఫెసర్‌ మాధవీలత కీలక పాత్ర పోషించారు. ఈఫిల్‌ టవర్‌కన్నా 35 మీటర్ల ఎత్తైన ఈ ఇంజనీరింగ్‌ అద్భుత ‘వంతెన’ను ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆర్చి బ్రిడ్జిగా చరిత్రకెక్కిన ఈ అద్భుత నిర్మాణంలో తన పాత్ర ఉండడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని ప్రొఫెసర్‌ మాధవీలత  పేర్కొన్నారు. 

వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఉపకరించే ప్రాజెక్టులో 17 ఏళ్లపాటు తన భాగస్వామ్యం ఉండటం సంతృప్తికరంగా ఉందని అన్నారు. ఆమె శనివారం ఫోన్‌లో తన సంతోషాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే..  

అవకాశం ఇలా వచ్చింది... 
రీసీ జిల్లా బాక్కల్‌ దగ్గర చినాబ్‌ నదిపై నిర్మించిన ఆర్చి బ్రిడ్జి నిర్మాణ పనులను కొంకణ్‌  రైల్వేస్‌ ‘ఆఫ్కాన్స్‌’ సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ జియో టెక్నికల్‌ కన్సల్టెంటుగా నాకు, ఈ వంతెన నిర్మాణంలో భాగం పంచుకునే అవకాశం లభించింది.  2004లో ఈ ప్రాజెక్టుకు అంకు­రా­ర్పణ చేసినప్పటి నుంచి ఇదే ప్రాజెక్టులో ఉన్నా.  బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) ప్రొఫెసర్‌గా పనిచేశాను. 

అక్కడే సెంటర్‌ ఫర్‌ సస్టె­యినబుల్‌ టెక్నాలజీస్‌ విభాగానికి చైర్‌పర్సన్‌గా సైన్స్‌­ను, టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి చేరువ చేసే ప్రాజెక్టులకు నాయకత్వం వహించాను.  ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ చేశాక, బెంగళూరులోని ఐఐఎస్‌సీలో ప్రొఫె­సర్‌ సీతారాం ఆధ్వర్యంలో రాక్‌ మెకానిక్స్‌­లో పోస్ట్‌ డా­క్టోరల్‌ కొనసాగించాను. రాక్‌ మెకానిక్స్‌లో ఉన్న అనుభవమే నన్ను ఈ ప్రాజెక్టులో భాగస్వామిని చేసింది.  

కష్టాన్ని సవాలుగా తీసుకుని... 
నిజానికి చినాబ్‌ నదిపై బ్రిడ్జిని రెండు కొండల మధ్య నిర్మించటానికి ఇంజినీరింగ్‌ డిజైన్‌ పెద్ద సవాలుగా మారింది. అక్కడి రాళ్లను పరిశోధించి, అధ్యయనం చే­శాం. పటిష్టమైన వాలు స్థిరీకరణ ప్రణాళికను రూ­పొందించి, అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చా­ను. నేను చేసిన విశ్లేషణ, సంకేతాలను విదేశీ నిపుణులు తనిఖీలు చేసి ఆమోదించటంతో బ్రిడ్జి నిర్మాణం కొనసాగింది. 

ఈ రైలు మార్గంలో నిర్మించిన కొన్ని సొరంగాల ప­ను­­ల్లోనూ పాల్గొన్నాను. మొదట్లో ఒక కొండ నుంచి మ­రో కొండకు వెళ్లటానికి మార్గం కూడా లేదు. పడవలో ప్ర­యాణించాల్సి వచ్చింది. 17 ఏళ్లు నిరంతర శ్రమ, పట్టుదలతో ప్రపంచ అద్భుతం ఆవిష్కృతమైంది. 

సాధారణ రైతు కుటుంబం నేపథ్యం 
ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు నా సొంతూరు. సాధారణ రైతు కుటుంబం. తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, వెంకారెడ్డి. కాకినాడలో ఇంజినీరింగ్‌ చేశాను.  మా ఊరు నుంచి ‘తొలి ఇంజినీరు’ అని అనిపించుకున్నాను. బాపట్ల జిల్లా మోదుకూరు గ్రామానికి చెందిన హరిప్రసాద్‌రెడ్డితో వివాహమైంది. 

స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా భారత ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్,  మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో జాతీయస్థాయిలో అత్యుత్తమ సేవలందించిన 75 మంది మహిళల వివరాలతో తీసుకొచి్చన ‘షి ఈజ్‌ 75’ పుస్తకంలో నాకు కూడా స్థానం కల్పించారు. ఈ ప్రాజెక్టుతో అందిన ప్రతిష్టాత్మక గౌరవం ఇది.

Advertisement
 
Advertisement
Advertisement