
పోలీసు టార్చర్‌తో వ్యక్తి మృతి.. గోప్యంగా ఉంచుతున్న పోలీసులు
సీఎం మెప్పు కోసం జిల్లా పోలీసు ఉన్నతాధికారి నిర్వాకం
విషయం బయటకు చెప్పొద్దని బాధిత కుటుంబానికి బెదిరింపు
వారినెవరూ కలువకుండా ఇంటి వద్ద నిఘా
గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసుల అరాచకాలు పరాకాష్టకు చేరాయి. టీడీపీ వీర విధేయుడిగా ముద్రపడిన ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి కనుసన్నల్లో సాగిన ‘పోలీసు మార్కు’ విచారణతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అత్యంత గోప్యంగా ఉంచిన ఈ లాకప్ డెత్ వ్యవహారం ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని ఏప్రిల్‌లో ప్రత్యర్థులు హత్య చేశారు. రియల్ ఎస్టేట్, మద్యం సిండికేట్ విభేదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
టీడీపీలోని వీరయ్య చౌదరి వైరి వర్గం వారే ఈ హత్యకు పాల్పడ్డారని కూడా గుర్తించినట్టు సమాచారం. ఆయన అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హాజరయ్యారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు పలువురు అనుమానితులను కొన్ని రోజులుగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కానీ కేసు దర్యాప్తు కొలిక్కి రాలేదు. మరోవైపు ఈ కేసును త్వరగా ఛేదించాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వస్తోంది. దాంతో ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఎలాగైనా దోషులను గుర్తించి త్వరగా కేసు క్లోజ్ చేయాలని పంతం పట్టారు. ఆ మేరకు అనుమానితులుగా భావిస్తున్న వారిని పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొడుతూ నేరాన్ని ఒప్పుకోవాల్సిందిగా వేధిస్తున్నారు.
దెబ్బలు తట్టుకోలేకే..
ఇటీవల కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌లో కాకుండా ఒంగోలులోని పోలీసు శాఖకు చెందిన శిక్షణ కార్యాలయం ప్రాంగణంలో రహస్యంగా ఉంచి విచారించినట్టు సమాచారం. కొన్ని రోజులుగా ఆ అనుమానితులను అక్రమంగా నిర్బంధించి విచారణ పేరిట పోలీసులు తమదైన శైలిలో తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసు దెబ్బలకు తీవ్రంగా గాయపడిన ఓ అనుమానితుడు మృతి చెందాడు. దాంతో ఆందోళన చెందిన పోలీసులు ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ముగించాలని భావించారు.
మృతుని కుటుంబ సభ్యులను పిలిచి తీవ్రంగా బెదిరించారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే వారిని కూడా ఈ కేసులో ఇరికిస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి కూడా ఆ మృతుని కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరించినట్టు తెలుస్తోంది. వారికి కొంత మొత్తం ముట్టచెప్పి గుట్టు చప్పుడు కాకుండా మృతునికి అంత్యక్రియలు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా జరిపించేసినట్లు సమాచారం. ఏకంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారే బెదిరించడంతో బాధిత కుటుంబం హడలిపోతోంది. కుటుంబ సభ్యులు ఎవర్ని కలుస్తున్నారు, వారి ఇంటికి ఎవరు వస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వారి నివాసం వద్ద పోలీసు నిఘా కూడా పెట్టడం గమనార్హం. ప్రభుత్వ ముఖ్య నేత మద్దతుతోనే ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి అంతగా చెలరేగిపోతున్నారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.