రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో 2,344.12 ఎకరాల సమీకరణ
తాడికొండ మండలం మోతడకలో భూ సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
రాజధాని కోసం 2015లో 29 గ్రామాల పరిధిలో 53,748 ఎకరాల సమీకరణ
ఇందులో రాజధాని పూర్తవడానికే వందేళ్లు పడుతుందని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు చెప్పిన బాబు సర్కార్
స్పోర్ట్స్ సిటీ పేరుతో 7 గ్రామాల్లో 20,494 ఎకరాల సమీకరణకు ఇప్పటికే నోటిఫికేషన్
గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్మార్ట్ ఇండస్ట్రీస్, భవిష్యత్ అవసరాల కోసం మరో 43 గ్రామాల్లో 1.54 లక్షల ఎకరాల సమీకరణకు సంకేతాలు
ఆ మేరకు మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యత సింగపూర్ సంస్థకు కట్టబెట్టిన సర్కార్
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో చంద్రబాబు సర్కారు భూసమీకరణకు అంతే లేకుండా పోతోంది. అమరావతి రాజధానిలో రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం తాడికొండ మండలం మోతడకలో 2,344.12 ఎకరాల సమీకరణకు కేబినెట్ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే అందుకు తార్కాణం. ఇప్పటికే 2015లో 53,748 ఎకరాలు(217.23 చదరపు కిలోమీటర్లు) సమీకరించిన బాబు సర్కార్.. స్పోర్ట్స్ సిటీ నిర్మాణం పేరుతో 20,494 ఎకరాల (82.9 చ.కి.మీ.) సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేసి ఆ ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పుడు రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో 2,344.12 ఎకరాల సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇంతటితో ఈ భూసమీకరణ ప్రక్రియ ఆగదని ఇప్పటికే ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. కొత్తగా సమీకరిస్తున్న మోతడక ప్రాంతంతోపాటు.. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్మార్ట్ ఇండస్ట్రీస్, భవిష్యత్ అవసరాల కోసం గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని మండలాలు, తాడికొండ, పల్నాడు జిల్లాలో అమరావతి, యడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లో 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలకు (626.67 చదరపు కిలోమీటర్లు) రాజధాని విస్తరణకు అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించే బాధ్యతను సింగపూర్‌కు చెందిన సుర్బానా–జురాంగ్ సంస్థకు రూ.45.14 కోట్లకు అప్పగించింది. అంటే.. మొత్తం 2,29,095 ఎకరాలలో (926.8 చ.కి.మీ.) రాజధాని నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
స్కాముల కోసం..!
నిజానికి 29 గ్రామాల్లో 53,748 ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తవడానికే వందేళ్ల సమయం పడుతుందని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఇటీవల చంద్రబాబు సర్కారు తేల్చి చెప్పింది. ఈ లెక్కన 2.29 లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తవడానికి ఇంకెన్ని శతాబ్దాలు పడుతుందన్నది అంచనా వేయలేని పరిస్థితి. ఇక చంద్రబాబు సర్కార్ కేంద్రానికి సమర్పించిన డీపీఆర్‌ల ప్రకారమే రాజధాని నిర్మాణంలో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఒక ఎకరానికి సగటున రూ.2 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొంది.
ఈ లెక్కన 2.29 లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి రూ.4.58 లక్షల కోట్లు అవసరం అవుతాయి. ఆ అప్పు, వడ్డీతో కలిసి ఇంకెన్ని లక్షల కోట్లు అవుతుందో..! దీన్ని బట్టి చూస్తే స్కాముల కోసం రాష్ట్రానికి రాజధాని లేకుండా సీఎం చంద్రబాబు చేస్తున్నారంటూ విద్యార్థులు, ఆర్థికవేత్తలు, మేధావులు మండిపడుతున్నారు.


