మృతుడు శ్రీనాథ్ (ఫైల్), నిందితుడు ప్రభాకర్
అప్పు అడిగినందుకు అంతమొందించాడు
బెంగళూరు వాసిని కుప్పం రప్పించి హత్య చేసిన వైనం
కర్ణాటక పోలీసుల విచారణలో బయటపడ్డ దారుణం
ఆంధ్ర, కర్ణాటక పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో శవం వెలికితీత
కుప్పం జగనన్న కాలనీలో మిన్నంటిన ఆర్తనాదాలు
నిందితుడు మృతుడికి వరుసకు అన్నయ్యే
కుప్పంరూరల్ : అప్పు అడిగినందుకు తమ్ముడు అని చూడకుండా అతి కిరాతకంగా హత్య చేసి ఓ ఇంట్లో పూడ్చిపెట్టిన వైనం కుప్పం పట్టణానికి సమీపంలోని జగనన్న కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. కుప్పం మండలం, దళవాయికొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీనాథ్ (37) కుటుంబం కొద్ది సంవత్సరాల కిందట బతుకు తెరువు కోసం బెంగళూరు వెళ్లి అత్తిబెల్లి వద్ద స్థిర పడ్డారు. శ్రీనాథ్‌కు వరుసకు అన్నయ్య అయిన ప్రభాకర్‌కు ఆర్థిక లావాదేవీలు నడిచేవి. ఈ క్రమంలో ప్రభాకర్‌కు దాదాపు 40 లక్షల వరకు అప్పు ఇచ్చాడు. తీరా అప్పు తీర్చమని అడిగితే ఇదిగో... అదిగో అంటూ కాలం వెలిబుచ్చేవాడు.
శ్రీనాథ్ నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ప్రభాకర్ ఎలాగైనా శ్రీనాథ్‌ను కడతేర్చాలని కొంత కాలంగా కుట్ర పన్నాడు. గత 27న 10 లక్షల అప్పు తిరిగి ఇస్తానని శ్రీనాథ్‌ను నమ్మబలికిన ప్రభాకర్... ఒంటరిగా సెల్‌ఫోన్ లేకుండా కుప్పం రావాలని కోరాడు. ప్రభాకర్ మాటలు నమ్మని శ్రీనాథ్ సెల్‌ఫోన్ లేకుండా తలపై టోపి, ముఖానికి మాస్కు ధరించి వచ్చాడు. ప్రభాకర్, అతడి స్నేహితుడు జగీష్ లతో కలిసి శ్రీనాథ్ కుప్పం పట్టణంలోని జగనన్న కాలనీలోని ప్రభాకర్ ఇంటికి చేరుకున్నారు. శ్రీనాథ్‌ను అతికిరాతకంగా సుత్తితో కొట్టి అక్కడే పూడ్చిపెట్టి ఏమి తెలియనట్లు వచ్చేశాడు. శ్రీనాథ్ రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు బెంగళూరులోని అత్తిబెలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బెంగళూరు పోలీసులు పలుమార్లు కుప్పం వచ్చి దర్యాప్తు చేపట్టిన ఎలాంటి ఆచూకీ దొరలేదు. ప్రభాకర్ మాత్రం తనకేమి తెలియనట్లు దర్జాగా తిరుగుతూనే ఉన్నాడు. చివరకు శ్రీనాథ్ మొబైల్ కాల్ హిస్టరీ పరిశీలించగా, ప్రభాకర్‌కు పలుమార్లు ఫోన్లు చేసినట్లు గుర్తించారు. వెంటనే ప్రభాకర్‌ను బెంగళూరు తీసుకుపోయి విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. తానే శ్రీనాథ్‌ను హత్య చేసి కుప్పంలో పూడ్చి పెట్టినట్లు ఒప్పుకున్నాడు.
ఆదివారం బెంగళూరు పోలీసులు కుప్పం వారితో కలిసి శ్రీనాథ్ మృతదేహాన్ని పూడ్చి పెట్టిన ఇంటి నుంచి శవాన్ని బయటకు తీశారు. శ్రీనాథ్ కుటుంబ సభ్యుల రోదనలతో జగనన్న కాలనీ దుఃఖసాగరంలో నిండింది. కాగా ప్రభాకర్ శ్రీనాథ్‌కు స్వయన పెద్దనాన్న కొడుకు. అన్నయ్య అవుతాడని స్థానికులు చెప్పారు. ప్రభాకర్ ఇప్పటికే ఓ హత్య కేసులో జీవిత కాలం శిక్ష అనుభవించి వచ్చినట్లు స్థానికులు చెప్పారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు.


