తిరుమలలో కార్తీక దీపోత్సవం  | Sakshi
Sakshi News home page

తిరుమలలో కార్తీక దీపోత్సవం 

Published Mon, Nov 27 2023 4:46 AM

Kartika Deepotsavam in Tirumala - Sakshi

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్త­య్యాక ఈ దీపోత్సవాన్ని కన్నుల పండువగా చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు దీపోత్సవం ప్రారంభమైంది. మొదట శ్రీయోగనరసింహస్వామి ఆలయం పక్కన ఉన్న పరిమళం అర దగ్గర 100 కొత్త మూకుళ్లలో నేతి ఒత్తులతో దీపాలు వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు.

ఆ తర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభేరా, తాళ్లపాక వారి అర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా 100 నేతి జ్యోతులను మంగళవాయిద్యాల నడుమ ఏర్పాటు చేశారు. ఈ కార్తీక దీపోత్సవంలో తిరుమల పెద్దజీయర్‌ స్వామి, ఈవో ఏవీ.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement