ఉద్యోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి కనికరమే లేదు | Kakarla Venkata Rami Reddy fires on govt | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి కనికరమే లేదు

Jun 15 2026 2:28 AM | Updated on Jun 15 2026 2:28 AM

Kakarla Venkata Rami Reddy fires on govt

గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి  

సాక్షి, అమరావతి: ‘వారం కిందట కర్నూల్లో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య.. మొన్న గుంటూరులో ఉద్యోగికి బ్రెయిన్‌ స్ట్రోక్‌.., రెండు రోజుల కిందట అనకాపల్లి జిల్లాలో పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య... పని ఒత్తిడి భరించలేక ఉద్యోగుల ప్రాణాలు గాల్లో కలిసి­పోతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి ఏ మాత్రం కనికరం కలగడం లేదు’ అని గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మకమైన సచివాలయ వ్యవస్థ, ప్రస్తుత ప్రభుత్వ మితిమీరిన ఒత్తిడి, వేధింపులతో ఉద్యోగుల పాలిట యమపాశంగా మారుతోందని తప్పుపట్టారు. 

వారం రోజుల్లో జరిగిన ఈ మూడు సంఘటనలు ఇందుకు నిదర్శనమని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొ­న్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ ఉద్యోగులకు ఒక టైమింగ్‌ లేదు, ఒక సెలవు లేదు, ఒక పండగ లేదని పేర్కొన్నారు.  సచివాలయ వ్యవస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోగా.. సచివాలయం ఉద్యోగులకు పని లేదంటూ వేల మందిని డిప్యుటేషన్‌ పేరుతో బదిలీ చేసి మిగిలిన ఉద్యోగులకు ఇన్‌చార్జి పేరుతో పనిభారం వేసిందని పేర్కొన్నారు. దీంతో సచివాలయ ఉద్యోగులు తమ పనే కాకుండా అదనపు పనితో పాటు వలంటీర్ల పని కూడా చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. 

‘ఇంకా ఎంత మంది చనిపోతే సీఎం స్పందిస్తారు. వంద మంది ప్రాణాలు పోయినా మీకు కని­కరం కలగడం లేదా? సచివాలయ ఉద్యోగుల మీద ఎందుకు ఇంత కక్ష? ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారే, ఇదేనా అనుకూల వాతావరణం? ఉద్యోగులకు గుండెపోటు తెప్పించడమేనా అనుకూల పనివాతావరణం? ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునే స్థాయికి వేధించడమేనా అనుకూల పని వాతావరణం?’అని ప్రశ్నించారు.  

ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు సక్రమంగా ఇవ్వండి
నిరంతరం ఇంటింటి సర్వేలతో పాటు యోగాంధ్ర, అక్షరాంధ్ర కార్యక్రమాలు  ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసే కార్యక్రమాలను సచివాలయ ఉద్యోగులకు అప్పగిస్తున్న ప్రభుత్వం.. అన్ని పనులు ఒకే సారి చెప్పి ఒత్తిడి చేయడం ఆపాలని డిమాండ్‌ చేశారు. సచివాలయ ఉద్యోగులకు వారి జాబ్‌ చార్ట్‌ ప్రకారం పనులు అప్పగించాలని, వారికి న్యాయబద్ధంగా రావాల్సిన ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు సక్రమంగా ఇవ్వాలని కోరారు. ‘సచివాలయ ఉద్యోగ మిత్రులారా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. ధైర్యంగా నిలబడండి. మీకు ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ తోడుగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement