'రేయ్.. నేను రెడీగున్నా! అరెస్ట్ చెయ్‌రా.. చెయ్‌!' | Sakshi
Sakshi News home page

'రేయ్.. నేను రెడీగున్నా! అరెస్ట్ చెయ్‌రా.. చెయ్‌!'

Published Thu, Dec 28 2023 8:35 AM

JC Prabhakar Reddy Abuses The Police - Sakshi

తాడిపత్రి అర్బన్, సాక్షి:  టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్లీ రెచ్చిపోయారు. 'రేయ్.. అరెస్టు చెయ్.. నీయమ్మా.. ఖాకీ డ్రెస్సులేసుకుని సిగ్గులేదు.. రేయ్ నేను రెడీగున్నా.. అరెస్ట్ చెయ్.. చెయ్ రా చెయ్' అంటూ పోలీసులను దుర్భాషలాడారు. రోడ్డుపై పడుకుని హంగామా సృష్టించారు.

రెండు రోజుల కిందట జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టణ సుందరీకరణ పేరుతో సీబీ రోడ్డులోని విద్యుత్ స్తంభాలకు డెకరేషన్ బల్బులను ఏర్పాటు చేసేందుకు మునిసిపల్ కమిషనర్ జి.రవిని అనుమతి కోరారు. తర్వాత మునిసిపల్ సిబ్బందితో కలసి దగ్గరుండి డెకరేషన్ లైట్లు వేయించడానికి బయలుదేరారు. అయితే స్తంభాలకు ఉన్న వైఎస్సార్‌సీపీ జెండాలను పనిగట్టుకుని తొలగిస్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని జేసీ ప్రభాకర్.. తన అనుచరులతో కలిసి నడిరోడ్డుపై బైఠాయించి నానా హంగామా సృష్టించాడు.

ట్రైనీ డీఎస్సీ హేమంత్ కుమార్, ఎస్ఐలు రామకృష్ణ, గౌస్‌మ‌హ్మ‌ద్‌లు అక్కడికి చేరుకుని మునిసిపల్ కమిషనర్‌తో మాట్లాడి జెండాలను తొలగింపజేస్తామంటూ హామీ ఇవ్వడంతో జేసీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ బుధవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆర్డీవో వెంకటేష్‌ను టీడీపీ కౌన్సిలర్లు కలసి సీబీ రోడ్డులోని విద్యుత్ స్తంభాలకు ఉన్న వైఎస్సార్‌సీపీ జెండాలు తొలగించాలంటూ వినతిపత్రం ఇవ్వడమే కాకుండా.. అక్కడే బైఠాయించారు. ఇది తన పరిధిలోని అంశం కాదని, అనవసరంగా రాద్దాంతం చేయకుండా మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఆర్జీవో స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. బుధవారం సాయంత్రం జేసీ జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలసి అర్బన్ పోలీస్ స్టేషన్ వద్దకొచ్చారు. వచ్చీ రాగానే గట్టిగా కేకలు వేస్తూ నానా హంగామా సృష్టించాడు. ఎస్పీ ధరణీబాబు, రామకృష్ణ, గురుప్రసాద్‌రెడ్డి వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. వారిపై తిట్ల దండకాన్ని అందుకున్నారు. పోలీసులు సంయమనం పాటిస్తూ నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా వినలేదు. చివరకు ఆయనను అరెస్ట్ చేసేందుకు జీపును తీసుకొచ్చేందుకు పోలీసులు సిద్ధమవగా నడిరోడ్డుపై పడుకుండిపోయాడు. పోలీసులు అతన్ని జీవులోకి ఎక్కించుకుని స్థానిక పుట్లూరు రోడ్డులో వదిలేయడంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు.

జేసీపై కేసు నమోదు
పోలీసులతో అనుచిత ప్రవర్తకు గానూ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 30 ప్రకారం.. విధులకు ఆటంకం కలిగించడం, దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించడంపై జేసీతో పాటు ఆయన ముగ్గురి అనుచరులపై కేసు నమోదు చేశారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement