
భారత్–పాక్ యుద్ధంలో జవాన్ మురళీ నాయక్ వీర మరణం
జమ్మూ కశ్మీర్‌లో విధి నిర్వహణలో ప్రాణాలొదిలిన యువ తేజం
స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండా
కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్‌లో పరామర్శ
13న కల్లితండాలో కుటుంబాన్ని ఓదార్చనున్న వైఎస్ జగన్
నేడు గ్రామానికి చేరనున్న భౌతికకాయం
సాక్షి, న్యూఢిల్లీ/గోరంట్ల/కర్నూలు(సెంట్రల్)/సాక్షి, అమరావతి: భారత్ – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందాడు. దేశ రక్షణలో శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో దాయాది బుల్లెట్‌కు బలయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స నిమిత్తం విమానంలో ఢిల్లీకి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే తనువు చాలించాడు. దేశ భద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టిన మురళీ నాయక్ త్యాగం మన దేశం ఎప్పటికీ మరువలేనిదని కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు నివాళులర్పించారు. యావత్ భారత ప్రజానీకం ఈ వీర జవాన్‌కు సెల్యూట్ కొడుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
ఏకైక సంతానం.. దేశ సేవకు అంకితం
జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ దంపతులకు మురళీ నాయక్ ఏకైక సంతానం. వీరిది నిరుపేద కుటుంబం. ఈ దంపతులు 30 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ముంబయికి వెళ్లారు. ఇద్దరూ అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయిన చెరువు తండాలో అమ్మమ్మ శాంతి బాయి వద్ద ఉంటూ సోమందేపల్లిలోని విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ అనంతపురంలోని సాయి జూనియర్ కళాశాలలో పూర్తి చేశాడు.
అక్కడే డిగ్రీ చదువుతూ 2022 నవంబర్‌లో భారత సైన్యంలో చేరాడు. మహారాష్ట్రలో శిక్షణ పొందాక అసోం బార్డర్‌లో కొంతకాలం పనిచేశాడు. తర్వాత జమ్మూ కశ్మీర్‌కు బదిలీ అయ్యాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో మిలటరీలో చేరొద్దని తాము ప్రాధేయపడినా, దేశ సేవ చేయాలన్న తలంపుతో ముందుకు సాగాడని తల్లిదండ్రులు తెలిపారు. మురళీ నాయక్ ఇక లేడన్న సమాచారాన్ని భారత సైనికాధికారులు శుక్రవారం ఉదయం 9 గంటలకు తండ్రి శ్రీరాం నాయక్‌కు తెలియజేశారు. భౌతికకాయాన్ని శనివారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు సమాచారమిచ్చారు.
అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు
మురళీ నాయక్ తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని చెప్పారు. శుక్రవారం అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని కర్నూలు ఎయిర్‌పోర్టుకు వర్పింన ఆయన.. అక్కడే మురళీ నాయక్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెళ్లారు. కాగా, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శుక్రవారం కల్లి తండాకు చేరుకుని మురళీ నాయక్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు.
వీర సైనికుడి త్యాగాన్ని దేశం మరచిపోదు
‘సైనికుడు మురళీనాయక్ అమరుడవ్వడం చాలా బాధగా ఉంది. వీరోచిత పోరాటంలో తనువు చాలించిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. నాయక్ త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలు పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరచిపోదని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వేర్వేరు ప్రకటనల్లో కొనియాడారు. మురళీ నాయక్ భారతమాత నుదుటిన అద్దిన సింధూరమని ఏపీ ట్రైకార్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
మిలటరీ దుస్తుల్లో చనిపోవాలనేవాడు
మురళీ నాయక్ చిట్టచివరిగా తల్లిదండ్రులకు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ఫోన్ చేసి మాట్లాడాడు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో బుధవారం రాత్రి నైట్ డ్యూటీ చేశానని, నిద్ర వస్తోందని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని మురళీకి సూచించారు. అంతలోనే ఇలా ఘోరం జరిగిందంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు.

దేశానికి సేవ చేయాలన్న సంకల్పం మురళీ నాయక్‌కు చిన్నప్పటి నుంచే బలంగా ఉండేది. ఒక్క రోజైనా భారత సైన్యంలో పనిచేసి.. మిలటరీ దుస్తులతో చనిపోవాలన్నదే తన లక్ష్యమని చెబుతుండేవాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. అదే పట్టుదలతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడని, అనుకున్నట్టే యూనిఫాంతోనే వీర మరణం పొందాడని ఆవేదన వ్యక్తం చేశారు.
నీ త్యాగాన్ని మరువలేంవైఎస్
జగన్ దిగ్భ్రాంతి
యుద్ధ భూమిలో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌లో తెలుగు జవాన్ వీర మరణం చెందడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శోకతప్తులైన మురళి కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గిరిజన బిడ్డ దేశ భద్రతలో తన ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి.. పిన్న వయసులోనే అశువులు బాయడం బా«ధాకరం అన్నారు.
ఈ అమర వీరుడి త్యాగాన్ని భారతజాతి మరువదని, మురళీనాయక్ కుటుంబీకులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు. మనోధైర్యంతో ఉండాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌తో పాటు పలువురు నేతలు కల్లి తండాకు చేరుకొని మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
13న కల్లితండాకు వైఎస్ జగన్
జమ్మూకశ్మీర్‌లో వీరమరణం చెందిన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అందుకోసం ఈనెల 13న ఆయన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండా వెళ్లనున్నారు.