అలా వచ్చి ఇలా వెళ్లినందుకు రూ.కోట్లు దోచిపెడుతున్న బాబు సర్కారు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదంటూ రూ.50 వేల బిల్లు కూడా చెల్లించకుండా గుత్తేదారులను ముప్పుతిప్పలు పెడుతూ వారిని హైకోర్టుకొచ్చేలా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రాకు మాత్రం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఫీజుల రూపంలో దోచిపెడుతోంది. ఆన్‌లైన్ లేదా భౌతికంగా కోర్టుకు అలా వచ్చి ఇలా వెళ్తే చాలు లూథ్రాకు కోట్లకు కోట్లు ఫీజుగా చెల్లిస్తోంది. వాదనలతో సంబంధంలేకుండా కోర్టుకు హాజరైతే చాలు కోట్లకొద్ది ప్రజాధనం ఆయన ఖాతాలో ఫీజుల రూపంలో జమ అవుతోంది. ఇలా ఇప్పటికే లూథ్రాకు రూ.8.62 కోట్లు చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా ఆయనకు మరో రూ.1.92 కోట్లు చెల్లించింది. తద్వారా ఆయనకు ఇప్పటివరకు రూ.10.54 కోట్లు చెల్లించినట్లయింది. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా పెట్టిన కేసులకు చంద్రబాబు ప్రభుత్వం ఇలా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా చంద్రబాబు తన ఆస్థాన న్యాయవాది లూథ్రాకు ఫీజుల చెల్లింపుల్లో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు.
ఒక్కరోజు వాదనలకు రూ.10 లక్షలు..
ఇక మద్యం అక్రమ కేసుల్లో సీఐడీ సిట్ తరఫున సిద్దార్థ లూథ్రా హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. మద్యం కేసులో ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ (సీఆర్‌ఎల్‌పీ 11425/2025)లో గత ఏడాది నవంబరు 25న ఒక్కరోజు వాదనలు వినిపించినందుకు లూథ్రాకు రూ.10 లక్షలను చంద్రబాబు ప్రభుత్వం ఫీజుగా చెల్లించింది. అలాగే, రిట్ పిటిషన్ నెంబర్ 32915/2025లో నవంబర్ 26, 27 తేదీల్లో వాదనలు వినిపించినందుకు రోజుకు రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలు చెల్లించింది.
సంబంధంలేని కేసులో రూ.20 లక్షలు చెల్లింపు..
రిట్ పిటిషన్ నెంబర్ 12190/2025లో నవంబరు 28న వాదనలు వినిపించినందుకు రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలు చెల్లించింది. వాస్తవానికి.. ఈ పిటిషన్ మద్యం కేసుకు సంబంధించింది కాదు. ఇది ఓ ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన కేసు. ఈ కేసుతో సీఐడీకి ఎలాంటి సంబంధంలేదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్దార్థ లూథ్రాకు రూ.20 లక్షలు చెల్లించడం విశేషం. మద్యం కేసులో నిందితుడు ముప్పిడి అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ (సీఆర్‌ఎల్‌పీ 10012/2025)లో సీఐడీ తరఫున వాదనలు డిసెంబరు 2న హాజరైనందుకు రూ.20 లక్షలు చెల్లించింది. ఇలా మొత్తం ఆయనకు రూ.70 లక్షలు చెల్లించింది. ఈ రూ.70 లక్షలకు 10 శాతం క్లర్కేజీ అంటే రూ.7 లక్షలు కలిపి మొత్తంగా రూ.77 లక్షలను లూథ్రాకు ధారబోసింది. ఆ మేరకు ప్రభుత్వం జీఓ ఆర్‌టీ–102 జారీచేసింది.

ఐదు కేసులకు రూ.1.10 కోట్లు చెల్లింపు..
మద్యం కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ (సీఆర్‌ఎల్‌పీ 6892/2025)లో సెప్టెంబరు 19న సీఐడీ తరఫున హాజరైనందుకు బాబు సర్కారు లూథ్రాకు రూ.10 లక్షలు చెల్లించింది. ఇదే కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డికి ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ (సీఆర్‌ఎల్‌పీ 9365/2025)లో సెప్టెంబరు 23న హాజరైనందుకు రూ.10 లక్షలు.. ముప్పిడి అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ (సీఆర్‌ఎల్‌పీ 10012/2025)లో సెప్టెంబరు 24న హాజరైనందుకు రూ.50 లక్షలు.. చాణక్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ (సీఆర్‌ఎల్‌పీ 9369/2025)లో సెప్టెంబరు 26న హాజరైనందుకు రూ.20 లక్షలు.. బాపనపాడు మైనింగ్ కేసులో పోలీసుల తరఫున సెప్టెంబరు 22న వాదనలు వినిపించినందుకు రూ.10 లక్షలు చెల్లించింది. ఇలా లూథ్రాకు రూ.కోటి చెల్లించింది. దీనికి 10 శాతం క్లర్కేజీ కలిపి రూ.1.10 కోట్లు చెల్లించింది. ఆ మేర జీఓ–104 జారీచేసింది. అదే రీతిలో కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌లో సీఐడీ తరఫున నవంబరు 18న వాదనలు వినిపించినందుకు రూ.5 లక్షలు చెల్లించింది. ఆ మొత్తానికి 10 శాతం క్లర్కేజీ రూ.50 వేలు కలిపి మొత్తంగా రూ.5.50 లక్షలు చెల్లిస్తూ జీఓ–103 జారీచేసింది.


