తోటల్లో ఏటా తగ్గుతున్న దిగుబడులు
నియామకాలు లేక తగ్గిన సిబ్బంది
పర్యవేక్షణ లేక పెరుగుతున్నదొంగతనాలు
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీఎఫ్‌డీసీ
అగ్రగామి సంస్థగా ఉన్న ఏపీఎఫ్‌డీసీ నష్టాలబాట పట్టింది. విశాఖ రీజియన్ పరిధిలో ఈ సంస్థకు 4,010 హెక్టార్ల విస్తీర్ణంలో కాఫీ తోటలున్నాయి. పర్యవేక్షణ లోపం, ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడం తదితర కారణాలతో
గడ్డుపరిస్థితులు ఏర్పడ్డాయి. ఏటా కొన్ని వేలాదిమందికి ఉపాధి కల్పించే ఈ సంస్థకు 2006 నుంచి కష్టాలు మొదలయ్యాయి.
గూడెంకొత్తవీధి: కాఫీ పేరు చెబితే ఒకప్పుడు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అభివృద్థి సంస్థ( ఏపీఎఫ్‌డీసీ) గుర్తుకు వచ్చేది. సుమారు నాలుగువేల హెక్టార్ల విస్తీర్ణంలో కాఫీ తోటలు.. అంతర పంటగా మిరియాలు, వేలాదిమందికి తోటల్లో ఉపాధి..ఆరులక్షల పనిదినాలు.. రూ.20కోట్లకు పైగా లావాదేవీలు ఇలా కళకళలాడుతూ ఉండే సంస్థ గత కొన్నేళ్లుగా గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటోంది.
కార్పొరేషన్‌గా ఉన్న ఈ సంస్థకు ప్రభుత్వం తరఫునుంచి సాయం అందడం లేదు. సిబ్బంది నియామకాలు లేకపోవడం, తోటలపై పర్యవేక్షణ లోపం, తోటల్లో దొంగతనాలు పెరిగిపోవడం, దిగుబడులు తగ్గడం వంటి అనేక కారణాలు సంస్థ మనుగడను ప్రశ్నార్థకంగా చేశాయి.
2006 నుంచి తిరోగమనం
గతంలో ఒక వెలుగువెలిగిన ఏపీఎఫ్‌డీసీకి 2006నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఆ సమయంలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండటంతో వారు అల్లూరి జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో ఏపీఎఫ్‌డీసీ ఆ«దీనంలో ఉన్న కాఫీ తోటలను స్వా«దీనం చేసుకుని గిరిజనులకు పంచిపెట్టారు. సంస్థకు చెందిన పల్పింగ్ యూనిట్లు, యార్డులు, గోదాములు వంటివాటిని పేల్చివేశారు. సంస్థకు చెందిన ఒక రేంజి అధికారిని కాల్చి చంపారు. ఈఘటనలన్నీ సంస్థకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఆ తరువాత కాలంలో హుద్‌హుద్ తుపాను సంస్థను నిండాముంచింది. తోటల్లో అనేక చెట్లు నేలకూలడంతో సంస్థ దిగుబడులను పూర్తిగా కోల్పోయింది.
తగ్గుతున్న దిగుబడులు
సంస్థకు చెందిన తోటల్లో దిగుబడులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. 2022–23లో 200 మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా, 2023–24లో 140 మెట్రిక్ టన్నుల దిగుబడులే వచ్చాయి. 2024–25లో 190 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఈఏడాది ఇది మరింత తగ్గి 170 మెట్రిక్ టన్నులకు మించి దిగుబడులు వచ్చే అవకాశం కనిపించడం లేదని సంస్థ అధికారులే చెబుతున్నారు.
పెరుగుతున్న దొంగతనాలు
అల్లూరి జిల్లా వ్యాప్తంగా సుమారు 2.50 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు సాగులో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరో లక్ష ఎకరాల్లో తోటల విస్తరణకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈనేపథ్యంలో రైతుల తోటల విస్తీర్ణం పెరగడం వల్ల ఆ పక్కనే ఉన్న సంస్థకు చెందిన తోటల్లో ఫలసాయం దొంగలపాలవుతోంది. తోటల పర్యవేక్షణకు సిబ్బంది ఉండటం లేదు. పదవీ విరమణ పొందడంతో సంస్థలో ఉద్యోగాలన్నీ ఖాళీ అయ్యాయి.క్షేత్రస్థాయి సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం వల్ల తోటలపై పర్యవేక్షణ కరవై దొంగతనాలను నియంత్రించ లేకపోతున్నారు.
ధరల పెరుగుదలతో కాస్త ఊరట
ఏపీఎఫ్‌డీసీ సంస్థ దిగుబడుల విషయంలో వెనకబడినా నాణ్యత, ధరల విషయంలో ముందుంటోంది. సంస్థకు చెందిన కాఫీకి అంతర్జాతీయ మార్కెట్‌లో కిలోకు సగటున రూ.600 వరకూ ధర లభిస్తోంది. దీనివల్ల కొంతమేర ఆర్థిక కష్టాలనుంచి గట్టెక్కుతోంది. ఈసంస్థకు నర్సీపట్నంలో కాఫీ శుద్ధికర్మాగారం ఉంది. రాజమహేంద్రవరం, నెల్లూరు ప్రాంతాల్లో జీడిమామిడి, వెదురు, యూకలిప్టస్ తోటలున్నాయి. వాటితో వచ్చిన లాభాలతో సంస్థ మనుగడ సాగిస్తోంది.
నెరవేరని హామీలు
ఇటీవల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కాఫీ కారి్మకులు కొద్దిరోజులపాటు విధులను బహిష్కరించారు. సంస్థ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు. ఆఖరికి సంస్థ ఎండీ కారి్మకుల సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కారానికి హామీ ఇవ్వడంతో తోటల్లో మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. అయితే సంస్థ యాజమాన్యం ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని కాఫీకారి్మకసంఘం నాయకులు అంటున్నారు. ఒకప్పుడు వేలాదిమందికి ఉపాధి కల్పించిన ఏపీఎఫ్‌డీసీ సంస్థ నేడు వెలవెలబోతూ కనిపిస్తోంది.
ఏపీఎఫ్‌డీసీ తోటల్లో పనులు లేవు
గతంలో ఏపీఎఫ్‌డీసీకి చెందిన కాఫీతోటల్లో ఏడాది పొడువునా కూలీ పనులు ఉండేవి. ఇప్పుడు పనులు లేకపోవడం వల్ల ఉపాధికి కరవైంది. దీంతో సొంత కాఫీతోటల్లో పనులపైనే ఆధారపడాల్సి వస్తోంది. – చెడ్డా రాజు, గొందిపల్లి గిరిజన రైతు
సంస్థను నిర్వీర్యం చేస్తున్నారు
ఏపీఎఫ్‌డీసీని నిర్వీర్యం చేస్తున్నారు.ఉద్యోగాలను భర్తీ చేయలేదు. ఉన్న తోటలనై నా పర్యవేక్షించుకోలేని పరి స్థితి ఉంది. తోటల్లో దొంగ తనా లు పెరగడం సంస్థ నష్టపోతోంది. సంస్థ పురోభివృధ్థికి అధికారులు దృష్టిసారించాలి –సత్యనారాయణ, సీఐటీయూ మండల కార్యదర్శి
దిగుబడులు తగ్గాయి
ఈఏడాది సంస్థకు చెందిన కాఫీతోటల ద్వారా 200 మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని అంచనా ఉంది. కనీసం 170 టన్నుల లక్ష్యాన్ని అయినా సాధించాలనుకుంటున్నాం. గతంతో పోల్చితే ఏపీఎఫ్‌డీసీ తోటల్లో దిగుబడులు బాగా తగ్గాయి. – సత్యం, డీఎం, నర్సీపట్నం కాఫీ క్యూరింగ్ కేంద్రం


