శాప్‌లో అర్ధరాత్రి హైడ్రామా!
24 గంటలూ కార్యాలయంలోనే ఉద్యోగులు
షిప్టులు వేసి మరీ కార్యాలయ పని వేళల కంటే ముందుగా రప్పించిన అధికారులు
చెప్పిన పని చేయకపోతే సస్పెన్షన్లు , బదిలీ చేస్తామని శాప్ చైర్మన్ బెదిరింపులు
మంగళవారం రాత్రి వరకు ఇదే తంతు
సాక్షి, అమరావతి: క్రీడా కోటా డీఎస్సీ పోస్టుల భర్తీలో అక్రమాలు చోటుచేసుకోవడంతో అర్ధరాత్రి వేళ శాప్‌లో హైడ్రామా నడిచింది. సోమవారం ఉదయం విధులకు హాజరైన ఉద్యోగులు (సెక్షన్ ఆఫీసర్లు) మురుసటి రోజు మంగళవారం ఉదయం 7 గంటల తర్వాతే ఇళ్లకు వెళ్లారు. శాప్ ఉన్నతాధికారి సైతం సోమవారం అర్ధరాత్రి 3 గంటల తర్వాత కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లగా.. తిరిగి ఉదయం 7 గంటలకే కార్యాలయానికి తిరిగి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉద్యోగులకు షిప్టులు వేసి మరీ కార్యాలయం పని వేళల కంటే ముందుగా రప్పించి.. అర్ధరాత్రి వరకు పని చేయించడం గమనార్హం.
తాము చెప్పిన సమయానికి రాకపోతే.. చెప్పిన పని చేయకపోతే సస్పెషన్ వేటు వేయడంతోపాటు బదిలీ చేస్తామని సాక్షాత్తూ శాప్ చైర్మన్ బెదిరింపులకు పాల్పడినట్టు ఉద్యోగులు వాపోతున్నారు. మంగళవారం రాత్రి వరకూ ఇదే తంతు నడిచింది. డీఎస్సీ ముగిసి 8 నెలల దాటిన తర్వాత ఇప్పుడు శాప్‌లో కూర్చుని డేటాను తయారు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
జాబితా ఎందుకు మారింది?
రాత్రంతా క్రీడా కోటా డీఎస్సీలో అభ్యర్థుల డేటాపై మల్లగుల్లాలు పడినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల ఫోన్లు సైతం సదరు అధికారి వద్దనే పెట్టుకుని పని చేయించడం చర్చనీయాంశమైంది. డీఎస్సీలో రాత పరీక్ష లేకుండా పోస్టులు పొందిన 382 మంది జాబితాను మంగళవారం ఉదయానికి ఓ ప్రత్యేక లింక్ ద్వారా విడుదల చేశారు. దీంతో కొద్ది గంటల్లోనే ఆ లింక్‌లోని డేటాలో మార్పులు కనిపించాయి. 382 మంది సెలక్షన్ లిస్టులో తొలుత ట్రయథ్లాన్‌లో ముగ్గురు క్రీడాకారులు ఉద్యోగాలకు ఎంపికైనట్టు చూపించారు.
ఇందులో జరుబుల రాము అనే వ్యక్తి పేరును సవరించిన జాబితా నుంచి తొలగించారు. అతనికి ఉద్యోగం రాలేదా? ఒకవేళ వచ్చి ఉంటే ఎందుకు తొలగించారు? ఉద్యోగం రాకపోతే ఎందుకు జాబితాలోకి పేరు చేరింది? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో విచిత్రం ఏమంటే.. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో స్కూల్ అసిస్టెంట్ పీఈటీగా పని చేస్తున్న వ్యక్తి పేరు ముందుగా అప్‌లోడ్ చేసిన జాబితాలో లేకపోవడం గమనార్హం. సదరు క్రీడాకారిణి ఏషియన్ ఉమెన్ చాంపియన్ షిప్‌లో పతకం సాధించారు.
నియామక సమయంలో తొలుత ఆమెకు పోస్టు ఇవ్వడానికి నిరాకరిస్తే ఏకంగా హైకోర్టులో కేసు వేసి ఆధారాలతో సహా సమర్పించగా కోర్టు ఆదేశాలతో పోస్టింగ్ ఇచ్చారు. ఇలా జాతీయ స్థాయిలో రాణించి క్రీడా కోటాలో ఉద్యోగం దక్కని అర్హులైన ఎందరో క్రీడాకారులు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. కానీ, 382 మంది జాబితా చూస్తే క్రీడల్లో పతకాలు సాధించిన వారి కంటే పార్టిసిపేషన్, ఇంటర్ డిస్ట్రిక్, స్టేట్ చాంపియన్ షిప్‌లో పాల్గొన్న వ్యక్తులకు మాత్రమే పోస్టులు రావడంపై క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తామంతా పాదర్శకంగా చేశామని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వంలో అర్ధరాత్రి హడావుడి పడుతూ డేటాను మార్చాల్సిన అవసరం ఏమిటని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. ముందుగా పబ్లిక్ డొమైన్‌లో జాబితాలు పెట్టకుండా ఇప్పుడు ఉరుకుల పరుగులపై విడుదల చేయడాన్ని వారంతా తప్పుపడుతున్నారు. ఇక్కడ ఎంపిక జాబితా ఇచ్చారే తప్ప 1:5 నిష్పత్తిలో ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపిక చేసిన 2వేల మంది క్రీడాకారుల జాబితాను ఎందుకు ప్రదర్శించడం లేదని ఉద్యోగాలు దక్కని అర్హులైన క్రీడాకారులు నిలదీస్తున్నారు.


