కాకినాడ: ఇటీవల కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యుల్ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం(జూలై 20వ తేదీ) పరామర్శించారు. దీనిలో భాగంగా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు సజ్జల. ఈ క్రమంలోనే ముద్రగడ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు.
అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ‘ ముద్రగడ తన జీవిత కాలం పేదల కోసం... తాను నమ్మిన సిద్దాంతల కోసం పని చేశారు. రాజకీయాల్లో ఉన్నత పదవులు ఎప్పుడు ఆశించ లేదు. వైఎస్ జగన్ ఆశయాలు నచ్చి 2024 లో ముద్రగడ వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్ జగన్ చేతిలో రాష్ట్రం బాగుంటుంది... ప్రజల జీవితాలు బాగుంటాయి అని భావించారు.
మరోసారి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చెయ్యాలని ముద్రగడ పని చేశారు. కాపునాడు- కాపు ఉద్యమంలో ఎంతో మంది ఆయన వెనుక వచ్చారు. కాపు ఉద్యమంలోను వెనుక బాటు తనం ఉందని ముద్రగడ నమ్మారు. ఆ లక్ష్యసాధన కోసం పని చేసేవారికి ముద్రగడ ఆదర్శంగా ఉంటారు’ అని పేర్కొన్నారు.


