‘చెత్త’లోనూ నీకింత.. నాకింత! | Irregularities in the establishment of waste to energy centers | Sakshi
Sakshi News home page

‘చెత్త’లోనూ నీకింత.. నాకింత!

Jun 29 2025 5:35 AM | Updated on Jun 29 2025 10:37 AM

Irregularities in the establishment of waste to energy centers

వేస్ట్‌ టు ఎనర్జీ కేంద్రాల ఏర్పాటు మాటున అక్రమాలు 

10 మెగావాట్ల సామర్థ్యంతో కర్నూలు, కడపలో ఏర్పాటుకు ఏపీ ఎన్‌ఆర్‌ఈడీసీ టెండర్లు 

రూ.200 కోట్ల చొప్పున అంచనా వ్యయంతో గత నెల 21న మధ్యాహ్నం 12 గంటలకు డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ 

కాసేపటి తర్వాత ఆ రెండు డాక్యుమెంట్లు రద్దు.. సాయంత్రం 4.20 గంటలకు రూ.264 కోట్ల చొప్పున తిరిగి అప్‌లోడ్‌ 

ఆ నాలుగు గంటల వ్యవధిలో ముఖ్య నేతతో బేరసారాలు  

ఆయా సంస్థలకే ఆ కేంద్రాల పనులు కట్టబెట్టేలా స్కెచ్‌ 

‘నీకింత–నాకింత’పై అవగాహనతోనే అంచనాలు పెంపు 

రెండింటిపై ఏకంగా రూ.128 కోట్లు పెంచేసిన ఏపీ ఎన్‌ఆర్‌ఈడీసీ 

10, 12 మెగావాట్ల సామర్థ్యంతో నెల్లూరు, రాజమండ్రి కేంద్రాల వ్యయం రూ.200 కోట్లే 

తద్వారా ఇది పక్కా స్కామ్‌ అంటున్న అధికార వర్గాలు   

సాక్షి, అమరావతి: ఏదైనా ఒక ప్రాజెక్టు పనుల్లో ఏళ్ల తరబడి జాప్యం చోటుచేసుకుంటే.. స్టీలు, సిమెంట్, పెట్రోల్, డీజిల్, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల అంచనా వ్యయం పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ.. కేవలం నాలుగు గంటలు కూడా గడవక ముందే ఏపీ ఎన్‌ఆర్‌ఈడీసీ (సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ) ఒక్కో డబ్ల్యూటీఈ (వేస్ట్‌ టు ఎనర్జీ – చెత్తతో విద్యుదుత్పత్తి) కేంద్రం అంచనా వ్యయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.264 కోట్లకు పెంచేసింది. మొత్తంగా రెండు కేంద్రాలకు కలిపి రూ.128 కోట్లు అదనంగా పెంచేసింది. 

గంటల వ్యవధిలో బేరాలు మాట్లాడుకుని.. అయిన వారికి పనులు కట్టబెట్టి.. నీకింత.. నాకింత అని పంచుకునేందుకే అంచనా వ్యయాన్ని ఇలా పెంచేసేలా ఎన్‌ఆర్‌ఈడీసీ అధికారులపై ముఖ్య నేత ఒత్తిడి తెచ్చారని సమాచారం. వైఎస్సార్‌ కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో రోజుకు 781 టన్నుల చెత్త వస్తుందని ఎన్‌ఆర్‌ఈడీసీ అంచనా వేసింది. దీంతో కడపకు సమీపంలో కొలుములపల్లె వద్ద 10 మెగావాట్ల సామర్థ్యంతో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో డబ్ల్యూటీఈకి గత నెల 21న మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో టెండర్‌ డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేసింది. 

అదే రీతిలో కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కార్పొరేషన్‌లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో రోజుకు 763 టన్నుల చెత్త వస్తుందని అంచనా వేసిన ఎన్‌ఆర్‌ఈడీసీ.. కర్నూలుకు సమీపంలో గార్గేయపురం వద్ద 10 మెగావాట్ల సామర్థ్యంతో మరో డబ్ల్యూటీఈకి రూ.200 కోట్ల అంచనా వ్యయంతో అదే రోజున అదే సమయానికి టెండర్లు పిలిచింది. అయితే ఆ వెంటనే ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌ నుంచి ఆ రెండు డబ్ల్యూటీఈల టెండర్‌ డాక్యుమెంట్లను తొలగించింది. 

ఆ తర్వాత అదే రోజు (గత నెల 21)సాయంత్రం 4.20 గంటలకు అంచనా వ్యయాన్ని రూ.264 కోట్లకు పెంచేస్తూ.. రెండు డబ్ల్యూటీఈలకు వేరువేరుగా టెండర్లు పిలుస్తూ ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్లో డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేసింది. అంటే.. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఒక్కో డబ్ల్యూటీఈ అంచనా వ్యయాన్ని రూ.64 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. 

కర్నూలు క్లస్టర్, కడప క్లస్టర్‌ డబ్ల్యూటీఈల నిర్మాణానికి మే 21న తొలుత రూ.200 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచి.. ఆ వెంటనే రద్దు చేసి.. అంచనా వ్యయాన్ని రూ.264 కోట్లకు పెంచేసి టెండర్లు పిలిచారనడానికి ఇదిగో ఆధారం  

ఒక్కో డబ్ల్యూటీఈకి ఒక్కో ధరా? 
నెల్లూరులో డీబీఎఫ్‌వోటీ (డిజైన్‌ బిల్డ్‌ ఫైనాన్స్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌పర్‌) పద్ధతిలో 10 మెగావాట్ల సామర్థ్యంతో డబ్ల్యూటీఈ కేంద్రాన్ని నిర్మించే పనులకు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో ఫిబ్రవరి 25న ఎన్‌ఆర్‌ఈడీసీ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. యూనిట్‌ విద్యుత్‌ రూ.7.80తో డిస్కమ్‌లకు సరఫరా చేస్తామని కోట్‌ చేసిన జేఐటీఎఫ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ ఆ పనులు దక్కించుకుంది. రాజమండ్రిలో డీబీఎఫ్‌వోటీ పద్ధతిలో 12 మెగావాట్ల సామర్థ్యంతో డబ్ల్యూటీఈ కేంద్రాన్ని నిర్మించే పనుల వ్యయాన్ని రూ.200 కోట్లుగా నిర్ణయిస్తూ మార్చి 17న ఎన్‌ఆర్‌ఈడీసీ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

ఆ టెండరు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. నెల్లూరు పది మెగావాట్ల సామర్థ్యం, రాజమండ్రిలో 12 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన డబ్ల్యూటీఈల నిర్మాణ వ్యయం రూ.200 కోట్లే. ఇదే తరహాలో కడప క్లస్టర్, కర్నూలు క్లస్టర్‌ల డబ్ల్యూటీఈల నిర్మాణ వ్యయాన్ని రూ.200 కోట్లుగా నిర్ణయిస్తూ మే 21న ఎన్‌ఆర్‌ఈడీసీ తొలుత టెండర్లు పిలవడం గమనార్హం. కానీ.. కొన్ని గంటల వ్యవధిలో వాటిని రద్దు చేసి.. అదే రోజున అంచనా వ్యయాన్ని రూ.264 కోట్లకు పెంచేసి మళ్లీ టెండర్లు పిలవడాన్ని బట్టి చూస్తే.. అంచనా వ్యయాన్ని పెంచేయడంలో భారీగా అక్రమాలు జరిగినట్లు స్పష్టమవుతోందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  

అంచనాల్లో ఘరానా మోసం  
» కడప, కర్నూలు క్లస్టర్‌లలో డబ్ల్యూటీఈల నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఈడీసీ జారీ చేసిన టెండర్‌ డాక్యుమెంట్‌లో.. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌(సీఈఆర్‌సీ) ప్రకారం డబ్ల్యూటీఈ నిర్మాణ వ్యయం ఒక మెగావాట్‌కు రూ.22 కోట్లుగా పేర్కొంది. ఈ లెక్కన చూసుకున్నా ఒక్కో డబ్ల్యూటీఈ నిర్మాణ వ్యయం రూ.220 కోట్లే. కానీ.. రూ.264 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచేయడం గమనార్హం. అంటే.. సీఈఆర్‌సీ నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో డబ్ల్యూటీఈ వ్యయాన్ని రూ.44 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఆ మేరకు కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చడానికి సిద్ధమయ్యారన్నది ఇట్టే తెలుస్తోంది.   

» ఏదైనా ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో వీజీఎఫ్‌ (వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌) 20 శాతం మించకూడదన్నది నీతి ఆయోగ్‌ నిబంధన. కానీ.. కడప క్లస్టర్, కర్నూలు క్లస్టర్‌ డబ్ల్యూటీఈలకు వీజీఎఫ్‌ను గరిష్టంగా 30 శాతంగా నిర్ణయించడం గమనార్హం. ఒక్కో డబ్ల్యూటీఈ నిర్మాణ వ్యయంలో రూ.79.2 కోట్లను ప్రభుత్వం వీజీఎఫ్‌ కింద కాంట్రాక్టర్‌కు అందిస్తుంది. అంటే.. వీజీఎఫ్‌ రూపంలో రూ.79.2 కోట్లు, అంచనా వ్యయాన్ని రూ.64 కోట్లు పెంచేయడం ద్వారా కాంట్రాక్టర్‌కు రూ.143.2 కోట్లు ప్రయోజనం చేకూర్చుతున్నారన్నది స్పష్టమవుతోంది. ఇక కాంట్రాక్టర్‌ పెట్టుబడి పెట్టేది కేవలం రూ.120.8 కోట్లే.  

»  ఇక ఈ రెండు డబ్ల్యూటీఈల ఏర్పాటుకు కారుచౌకగా ప్రభుత్వమే భూమి ఇస్తుంది. ఉచితంగా చెత్తను సరఫరా చేస్తుంది. కానీ, ఆ పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయమూ రాదు. ఆ కేంద్రాన్ని 25 ఏళ్లపాటు నిర్వహించి.. ఉత్పత్తయ్యే విద్యుత్‌ను డిస్కంలకు అమ్ముకోవడం, బూడిదతో తయారు చేసే ఇటుకలను విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయం డబ్ల్యూటీఈలు దక్కించుకున్న వారి జేబులోకే వెళ్తుంది. 25 ఏళ్ల తర్వాత ఆయా సంస్థలు వాటిని ప్రభుత్వానికి అప్పగిస్తాయి.  

Advertisement
 
Advertisement
Advertisement