breaking news
waste to energy plant
-
‘చెత్త’లోనూ నీకింత.. నాకింత!
సాక్షి, అమరావతి: ఏదైనా ఒక ప్రాజెక్టు పనుల్లో ఏళ్ల తరబడి జాప్యం చోటుచేసుకుంటే.. స్టీలు, సిమెంట్, పెట్రోల్, డీజిల్, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల అంచనా వ్యయం పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ.. కేవలం నాలుగు గంటలు కూడా గడవక ముందే ఏపీ ఎన్‌ఆర్‌ఈడీసీ (సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ) ఒక్కో డబ్ల్యూటీఈ (వేస్ట్ టు ఎనర్జీ – చెత్తతో విద్యుదుత్పత్తి) కేంద్రం అంచనా వ్యయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.264 కోట్లకు పెంచేసింది. మొత్తంగా రెండు కేంద్రాలకు కలిపి రూ.128 కోట్లు అదనంగా పెంచేసింది. గంటల వ్యవధిలో బేరాలు మాట్లాడుకుని.. అయిన వారికి పనులు కట్టబెట్టి.. నీకింత.. నాకింత అని పంచుకునేందుకే అంచనా వ్యయాన్ని ఇలా పెంచేసేలా ఎన్‌ఆర్‌ఈడీసీ అధికారులపై ముఖ్య నేత ఒత్తిడి తెచ్చారని సమాచారం. వైఎస్సార్ కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో రోజుకు 781 టన్నుల చెత్త వస్తుందని ఎన్‌ఆర్‌ఈడీసీ అంచనా వేసింది. దీంతో కడపకు సమీపంలో కొలుములపల్లె వద్ద 10 మెగావాట్ల సామర్థ్యంతో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో డబ్ల్యూటీఈకి గత నెల 21న మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో టెండర్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేసింది. అదే రీతిలో కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో రోజుకు 763 టన్నుల చెత్త వస్తుందని అంచనా వేసిన ఎన్‌ఆర్‌ఈడీసీ.. కర్నూలుకు సమీపంలో గార్గేయపురం వద్ద 10 మెగావాట్ల సామర్థ్యంతో మరో డబ్ల్యూటీఈకి రూ.200 కోట్ల అంచనా వ్యయంతో అదే రోజున అదే సమయానికి టెండర్లు పిలిచింది. అయితే ఆ వెంటనే ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ నుంచి ఆ రెండు డబ్ల్యూటీఈల టెండర్ డాక్యుమెంట్లను తొలగించింది. ఆ తర్వాత అదే రోజు (గత నెల 21)సాయంత్రం 4.20 గంటలకు అంచనా వ్యయాన్ని రూ.264 కోట్లకు పెంచేస్తూ.. రెండు డబ్ల్యూటీఈలకు వేరువేరుగా టెండర్లు పిలుస్తూ ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేసింది. అంటే.. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఒక్కో డబ్ల్యూటీఈ అంచనా వ్యయాన్ని రూ.64 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. కర్నూలు క్లస్టర్, కడప క్లస్టర్ డబ్ల్యూటీఈల నిర్మాణానికి మే 21న తొలుత రూ.200 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచి.. ఆ వెంటనే రద్దు చేసి.. అంచనా వ్యయాన్ని రూ.264 కోట్లకు పెంచేసి టెండర్లు పిలిచారనడానికి ఇదిగో ఆధారం ఒక్కో డబ్ల్యూటీఈకి ఒక్కో ధరా? నెల్లూరులో డీబీఎఫ్‌వోటీ (డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్పర్) పద్ధతిలో 10 మెగావాట్ల సామర్థ్యంతో డబ్ల్యూటీఈ కేంద్రాన్ని నిర్మించే పనులకు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో ఫిబ్రవరి 25న ఎన్‌ఆర్‌ఈడీసీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. యూనిట్ విద్యుత్ రూ.7.80తో డిస్కమ్‌లకు సరఫరా చేస్తామని కోట్ చేసిన జేఐటీఎఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ ఆ పనులు దక్కించుకుంది. రాజమండ్రిలో డీబీఎఫ్‌వోటీ పద్ధతిలో 12 మెగావాట్ల సామర్థ్యంతో డబ్ల్యూటీఈ కేంద్రాన్ని నిర్మించే పనుల వ్యయాన్ని రూ.200 కోట్లుగా నిర్ణయిస్తూ మార్చి 17న ఎన్‌ఆర్‌ఈడీసీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ టెండరు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. నెల్లూరు పది మెగావాట్ల సామర్థ్యం, రాజమండ్రిలో 12 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన డబ్ల్యూటీఈల నిర్మాణ వ్యయం రూ.200 కోట్లే. ఇదే తరహాలో కడప క్లస్టర్, కర్నూలు క్లస్టర్ల డబ్ల్యూటీఈల నిర్మాణ వ్యయాన్ని రూ.200 కోట్లుగా నిర్ణయిస్తూ మే 21న ఎన్‌ఆర్‌ఈడీసీ తొలుత టెండర్లు పిలవడం గమనార్హం. కానీ.. కొన్ని గంటల వ్యవధిలో వాటిని రద్దు చేసి.. అదే రోజున అంచనా వ్యయాన్ని రూ.264 కోట్లకు పెంచేసి మళ్లీ టెండర్లు పిలవడాన్ని బట్టి చూస్తే.. అంచనా వ్యయాన్ని పెంచేయడంలో భారీగా అక్రమాలు జరిగినట్లు స్పష్టమవుతోందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అంచనాల్లో ఘరానా మోసం » కడప, కర్నూలు క్లస్టర్లలో డబ్ల్యూటీఈల నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఈడీసీ జారీ చేసిన టెండర్ డాక్యుమెంట్లో.. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(సీఈఆర్సీ) ప్రకారం డబ్ల్యూటీఈ నిర్మాణ వ్యయం ఒక మెగావాట్‌కు రూ.22 కోట్లుగా పేర్కొంది. ఈ లెక్కన చూసుకున్నా ఒక్కో డబ్ల్యూటీఈ నిర్మాణ వ్యయం రూ.220 కోట్లే. కానీ.. రూ.264 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచేయడం గమనార్హం. అంటే.. సీఈఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో డబ్ల్యూటీఈ వ్యయాన్ని రూ.44 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఆ మేరకు కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చడానికి సిద్ధమయ్యారన్నది ఇట్టే తెలుస్తోంది. » ఏదైనా ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో వీజీఎఫ్ (వయబులిటీ గ్యాప్ ఫండ్) 20 శాతం మించకూడదన్నది నీతి ఆయోగ్ నిబంధన. కానీ.. కడప క్లస్టర్, కర్నూలు క్లస్టర్ డబ్ల్యూటీఈలకు వీజీఎఫ్‌ను గరిష్టంగా 30 శాతంగా నిర్ణయించడం గమనార్హం. ఒక్కో డబ్ల్యూటీఈ నిర్మాణ వ్యయంలో రూ.79.2 కోట్లను ప్రభుత్వం వీజీఎఫ్ కింద కాంట్రాక్టర్‌కు అందిస్తుంది. అంటే.. వీజీఎఫ్ రూపంలో రూ.79.2 కోట్లు, అంచనా వ్యయాన్ని రూ.64 కోట్లు పెంచేయడం ద్వారా కాంట్రాక్టర్‌కు రూ.143.2 కోట్లు ప్రయోజనం చేకూర్చుతున్నారన్నది స్పష్టమవుతోంది. ఇక కాంట్రాక్టర్ పెట్టుబడి పెట్టేది కేవలం రూ.120.8 కోట్లే. » ఇక ఈ రెండు డబ్ల్యూటీఈల ఏర్పాటుకు కారుచౌకగా ప్రభుత్వమే భూమి ఇస్తుంది. ఉచితంగా చెత్తను సరఫరా చేస్తుంది. కానీ, ఆ పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయమూ రాదు. ఆ కేంద్రాన్ని 25 ఏళ్లపాటు నిర్వహించి.. ఉత్పత్తయ్యే విద్యుత్‌ను డిస్కంలకు అమ్ముకోవడం, బూడిదతో తయారు చేసే ఇటుకలను విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయం డబ్ల్యూటీఈలు దక్కించుకున్న వారి జేబులోకే వెళ్తుంది. 25 ఏళ్ల తర్వాత ఆయా సంస్థలు వాటిని ప్రభుత్వానికి అప్పగిస్తాయి. -
Live Blog: 'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం జగన్
-
వేస్ట్ టు ఎనర్జీ వైపు అడుగులు
– చంద్రగిరిలో 16.22 ఎకరాలు అప్పగింత – రిజల్యూషన్ కోసం కౌన్సిల్‌కు పంపిన కార్పొరేషన్ – ప్లాంట్ ఏర్పాటుకు వీడనున్న గ్రహణం తిరుపతి తుడా: వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్(వ్యర్థాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ) ఏర్పాటుకు ఎట్టకేలకు గ్రహణం వీడింది. ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు బుధవారం చంద్రగిరి గ్రామ పరిధిలో 16.22 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ శాఖ అధికారులు కార్పొరేషన్‌కు అప్పగించారు. గురువారం కౌన్సిల్ అనుమతులు కోసం రిజల్యూషన్ దస్త్రాలను పంపారు. ప్రత్యేక అనుమతులు వచ్చిన వెంటనే జిందాల్ కంపెనీ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను నిర్మాణ పనులను చేపట్టనుంది. వ్యర్థాల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రత్యేక ప్లాంట్‌ను తిరుపతిలో ఏర్పాటు చేయాలని గత ఏడాది ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో జిందాల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలుత రామచంద్రాపురం మండలం రామాపురం వద్ద, చంద్రగిరి మండలం రాయలపురం పంచాయతీ పరిధిలో స్థలపరిశీలన చేశారు. ప్లాంట్ ఏర్పాటుకు ఇవేవీ అనుకూలంగా లేకపోవడంతో 8 నెలలుగా పనులు ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు చంద్రగిరి గ్రామ పంచాయతీ పరిధిలో ప్లాంట్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని గుర్తించారు. భారీ యంత్రాల ఏర్పాటుకు అనువుగా ఉండడంతో జిందాల్ కంపెనీ స్థలం తీసుకోవడానికి అంగీకరించింది. దీంతో బుధవారం కార్పొరేషన్ అధికారులకు స్థలాన్ని అప్పగించారు. ఒక్కరోజు వ్యవధిలోనే కార్పొరేషన్ కౌన్సిల్ తీర్మానం కోసం ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలను హుటాహుటిన కౌన్సిల్‌కు అందజేశారు. కౌన్సిల్ నుంచి అనుమతులు పొందాక నిర్మాణ పనులు చేపట్టనున్నారు. చెత్త నుంచి విద్యుత్ తిరుపతిలో నిత్యం 200 టన్నుల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నాయి. వివిధ రూపాల్లో చెత్తను సేకరిస్తున్న కార్పొరేషన్ ఇటీవల రామాపురం వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మిగిలిన వాటిని తగులబెడుతున్నారు. తడి, పొడిచెత్తను వృథా చేయకుండా తద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయించారు. 3 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. భారీ ప్రాజెక్ట్ కావడంతో కనీసం 25 సంవత్సరాల లీజ్తో స్థలం కేటాయించాలని జిందాల్ కంపెనీ కోరింది. ఈ మేరకు కార్పొరేషన్ కౌన్సిల్‌కు ప్రతిపాదనలు చేసింది. ఇతర ప్రాంతాల నుంచి చెత్త సేకరణ తిరుపతి నుంచి సేకరించే 200 మెట్రిక్ టన్నుల వ్యర్థాలతో పాటు శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల నుంచి చెత్తను సేకరించనున్నారు.100 మెట్రిక్ టన్నుల వ్యర్థాల నుంచి 1 మెగావాట్ సామర్థ్యం కల్గిన విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేయవచ్చు. తిరుపతిలో 200 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు మాత్రమే వస్తుండడంతో మరో 100 మెట్రిక్ టన్నుల చెత్తను పక్కమున్సిపాలిటీల నుంచి సేకరించనున్నారు.