350 శాతం వృద్ధితో తొలిస్థానంలో నిలిచిన కెనడా
విదేశీ విద్య కోసం మారుతున్న భారతీయ విద్యార్థుల ఎంపిక
2024–25లో రెండో స్థానానికి దిగజారిన అమెరికా
ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి మూడో స్థానంలోకి యూకే
2016–2024 మధ్య అవుట్ బౌండ్ విద్యార్థుల వార్షిక వృద్ధి 8.84 శాతం నమోదు
సాక్షి, అమరావతి: విదేశీ విద్యలో భారతీయ విద్యార్థుల ఎంపిక మారుతోంది. దశాబ్దాలపాటు తొలి స్థానంలో నిలిచిన అగ్రరాజ్యం అమెరికాను కాదని పక్కనే ఉన్న కెనడాకు క్యూ కడుతున్నారు. ఫలితంగా విదేశీ విద్యా గమ్యస్థానాల్లో యూఎస్ రెండో స్థానానికి దిగజారిపోయింది. 2024–25 విద్యా సంవత్సరంలో కెనడా అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఆస్ట్రేలియాను అధిగమించి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మూడో స్థానానికి ఎగబాకింది.
ప్రపంచీకరణ, నాణ్యమైన ఉన్నత విద్య కోసం భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఫలితంగా విదేశాల బాటపడుతున్న వారి సంఖ్య అధికం అవుతోంది. అయితే అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 2016లో 4.24 లక్షలు ఉండగా... 2024 నాటికి 3.38 లక్షలకు పడిపోయింది. ఈ క్రమంలోనే భారత విద్యార్థుల దృష్టి అమెరికాను ఆనుకుని ఉన్న కెనడా వైపు మళ్లుతోంది. అతి తక్కువ కాలంలోనే ఇక్కడ విద్యార్థుల చేరికల్లో భారత్ ఏకంగా 350 శాతం వృద్ధిని కనబరిచింది. 2020లో 1.79 లక్షల నుంచి 2024కు 4.27 లక్షలకు దూసుకెళ్లింది. దీంతో కెనడా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

నాణ్యమైన విద్యకే ప్రాధాన్యం
ప్రపంచంలోనే అతి పెద్ద అంతర్జాతీయ మార్కెట్ కలిగిన భారత్ అవుట్ బౌండ్ విద్యార్థుల్లో 2016–2024 మధ్య ఏకంగా 8.84 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు కావడం విశేషం. భారతీయ విద్యార్థులు వైద్యం, సాంకేతిక రంగాల్లో నాణ్యమైన విద్యను అందించే దేశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఫలితంగా భారతీయ విద్యార్థుల విదేశీ విద్య ఎంపికలో ఆస్ట్రేలియా నాలుగేళ్లు (2016–2020) మూడో స్థానంలో స్థిరంగా ఉంది. ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనయ్యింది. అయితే 2024లో 1.22 లక్షల విద్యార్థుల స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ నాలుగో స్థానానికి దిగజారింది.
ఆస్ట్రేలియాను వెనక్కి నెడుతూ యూకే మూడో స్థానంలోకి వచ్చింది. ఈ దేశంలో 2016లో విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థుల సంఖ్య 16,559 నుంచి 2020లో 90,300కి చేరుకోగా 2024 నాటికి ఏకంగా 1.85 లక్షలకు పెరిగింది. దీంతోపాటు యూఏఈ, మధ్య ఆసియా ప్రాంతమైన కిర్గిస్తాన్ కూడా భారతీయ విద్యార్థుల ఎంపిక జాబితాలో చేరాయి. రష్యా, జార్జియా, ఫిలిప్పీన్స్ 2020 నుంచి టాప్–10లో నిలుస్తున్నాయి.


