కొండెక్కిన కూరగాయల ధరలు
సామాన్య, మధ్యతరగతి ప్రజలు విలవిల
ధరలు పెరిగిపోతున్నా పట్టించుకోని పాలకులు
వంకాయలు కిలో రూ.80 నుంచి రూ.100
చిక్కుడు కాయలు రూ.100 నుంచి రూ.160
దొండ, బెండకాయలు రూ.70 నుంచి రూ.80
టమాటా రూ.60 నుంచి రూ.70
ఒక్కో మునక్కాయ రూ.20
సాక్షి, అమరావతి: కూరగాయల ధరలు కొండెక్కాయి. కార్తీక మాసం చివరికి వచ్చినా ధరల మోత తగ్గలేదు. మోంథా తుపాను సాకుతో రైతుబజార్లతోపాటు బహిరంగ మార్కెట్‌లోనూ రేట్లు భారీగా పెంచేశారు. దళారులు ఆడిందే ఆట.. నిర్ణయించిందే రేటుగా సాగుతోంది. కార్తీక మాసం ఆరంభానికి ముందు రైతు బజారులో కిలో కూరగాయలు రూ.20 నుంచి రూ.30కి లభించేవి. మార్కెట్‌లోనూ రూ.40 నుంచి రూ.50కి దొరికేవి. ప్రస్తుతం రైతుబజారులో కూడా ధరలు భారీగా పెరిగిపోయాయి. బయటి మార్కెట్‌లో డబుల్ చేశారు.
వీటి ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందనంత ఎత్తులో ఉన్నాయి. దినసరి కూలీలు, చిరుద్యోగులు మార్కెట్ వైపు చూడాలంటే హడలిపోతున్నారు. మోంథా తుపాను వల్ల పంట నష్టం వాటిల్లి దిగుబడులు కొంత తగ్గాయి. దీనికి తోడు భవానీ భక్తులు, అయ్యప్ప మాలధారులు, కార్తీక మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండేవారిని దృష్టిలో పెట్టుకుని దళారులు చెలరేగిపోతున్నారు. వారికి నచ్చినట్టు ధరలు నిర్ణయిస్తున్నారు. తామేమీ తక్కువ కాదన్నట్టు బయట వ్యాపారులు సైతం సిండికేట్ అయి ధరలు పెంచి విక్రయిస్తున్నారు.
పట్టించుకోండి బాబూ!
కూరగాయల ధరలు మండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ధరల నియంత్రణ తమ పని కాదన్నట్టు వ్యవహరిస్తోంది. ఫలితంగా వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. పిల్లల్ని పస్తులు ఉంచలేక వ్యాపారులు చెప్పిన ధరలకే కొద్దోగొప్పో కూరగాయల్ని కొనుగోలు చేస్తూ వారి కడుపునింపుతున్నారు. ధరల పెరుగుదల మూడు నెలలుగా కొనసాగుతున్నా ప్రభుత్వం కనీసం నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని వినియోగదారులు మండిపడుతున్నారు. మరోవైపు పెరిగిన ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తుపానుకు పంటలు దెబ్బతిన్నాయని, ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు దిగుబడి వచ్చే సరికి డిసెంబర్ ఆఖరు అవుతుందని రైతులు చెబుతున్నారు. అప్పటివరకు కొంచెం ఇటు అటుగా ఇవే ధరలు కొనసాగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
రైతుకు దక్కేది అరకొరే
మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా పెరిగినా వాటిని పండించే రైతులకు మాత్రం ప్రయోజనం లేకుండాపోయింది. రైతులకు పాత ధరలే చెల్లిస్తూ దళారులు, హోల్‌సేల్ వ్యాపారులు లాభాలు దండుకుంటున్నారు. కాగా.. ధరలు భారీగా పెరగడంతో కూరగాయలు కొనేందుకు ప్రజలు జంకుతున్నారని, దీనివల్ల తాము తెచ్చిన కూరగాయలు అమ్ముడుపోవడం లేదని విజయవాడ జీఎస్ రోడ్డులో కూరగాయలు విక్రయించే రిటైల్ వ్యాపారి కొలుసు సత్యవతి చెప్పారు. సరుకు తక్కువగానే తెచ్చినా అమ్ముడవకపోవడంతో పాడైపోతున్నాయని తెలిపారు. హోల్‌సేల్ మార్కెట్‌లో ధరలు పెరిగిపోవడంతో తాము పెంచకతప్పడం లేదని సత్యవతి వాపోయారు.
ఏమీ కొనలేని పరిస్థితి
కార్తీక మాసం ఆరంభం నుంచి కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ కూరగాయ కొనాలన్నా కనీసం రూ.80 వెచ్చించాల్సి వస్తోంది. వంకాయలు కిలో రూ.100 చెబుతున్నారు. ఏమీ తినలేక పోతున్నాం. ఇలా అయితే ఎలా బతకాలి. – మీసాల దమయంతి. వంగపల్లిపేట, చీపురుపల్లి, విజయనగరం జిల్లా
అందనంత ఎత్తులో కూరగాయలు ధరలు
మార్కెట్‌లో కిలో వంకాయలు రూ.80 వరకు పలుకుతున్నాయి. బెండకాయలు, దొండకాయల ధరలు ఇందుకు భిన్నంగా ఏం లేవు. బీరకాయలు కిలో రూ.40 నుంచి రూ.80 వరకూ పలుకుతున్నాయి. రైతుబజారుల్లో ధరలు ఇలా ఉంటే బహిరంగ మార్కెట్‌లో మరీ దారుణం. – తంగుడు నాగమణి, మండలవీధి, గృహిణి, శ్రీకాకుళం నగరం.
రూ.500 తీసుకెళ్లినా..
చిన్న ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. గతంలో రూ.200 తీసుకెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ.500 తీసుకెళ్లినా సగం సంచి కూడా నిండటం లేదు. కిలో కొనాల్సిన చోట అరకిలోతో సరిపెట్టుకుంటున్నాం. – కెల్లి పూర్ణమ్మ, పాత్రునివలస, జగనన్నకాలనీ, శ్రీకాకుళం.


