
కింది కోర్టు ఇచ్చింది తదుపరి దర్యాప్తు ఉత్తర్వులే
ఎమ్మెల్సీ అనంతబాబు పిటిషన్‌పై హైకోర్టు
సాక్షి, అమరావతి: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తదుపరి దర్యాప్తునకు అనుమతినిస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఈ నెల 22న ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని స్పష్టంచేసింది. కింది కోర్టు ఇచ్చింది తదుపరి దర్యాప్తు ఉత్తర్వులు మాత్రమేనని గుర్తుచేసింది. దీనివల్ల అనంతబాబు ఏ రకంగానూ ప్రభావితం కారని తెలిపింది. పునర్ దర్యాప్తు కాకుండా తదుపరి దర్యాప్తు విషయంలో స్పష్టతనిస్తూ తగిన ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించింది.
ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో తదుపరి దర్యాప్తునకు అనుమతినిస్తూ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ ఎమ్మెల్సీ అనంతబాబు గురువారం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్ లక్ష్మణరావు శుక్రవారం విచారణ జరిపారు.
తదుపరి దర్యాప్తు అక్కర్లేదు..
అనంతబాబు తరఫున సీనియర్ న్యాయవాది చిత్తరవు రఘు వాదనలు వినిపించారు. ఈ కేసులో 2022లో పోలీసులు దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేశారని, ఆ తరువాత 2023లో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారని ఆయన తెలిపారు. కోర్టు దానిని విచారణ నిమిత్తం పరిగణనలోకి సైతం తీసుకుందన్నారు. పిటిషనర్ గన్‌మెన్లను సైతం విచారించారన్నారు. కొత్త ఆధారాలు ఏమీ లభ్యంకాలేదని, అందువల్ల తదుపరి దర్యాప్తు అవసరంలేదన్నారు.
తదుపరి దర్యాప్తు పేరుతో అమాయకులను నిందితులుగా చేర్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే విచారించిన సాక్షులను మళ్లీ పిలుస్తారేమోనని, ఇదే జరిగితే ప్రభుత్వం మారినప్పుడల్లా పాత కేసులను తదుపరి దర్యాప్తు పేరుతో తిరగదోడుతారన్నారు. అనంతరం పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.