దశాబ్దానికి దక్కిన న్యాయం

High Court judge Justice Ravinath Tilhari judgement on disabled person - Sakshi

ప్రమాదంలో వికలాంగుడిగా మారిన కండక్టర్‌కు హైకోర్టు అండ

2001 నుంచి 2007 వరకు వేతన బకాయిలన్నీ చెల్లించాలి

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ తీర్పు

సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో ప్రమాదానికి గురై వికలాంగుడిగా మారిన ఓ కండక్టర్‌ తనకు రావాల్సిన వేతన బకాయిల కోసం దశాబ్దం కాలంగా చేస్తున్న న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఆ కండక్టర్‌కు 2001 నుంచి 2007 వరకు వేతన బకాయిలను, ఇతర ఉద్యోగులు (కండక్టర్లు)తో సమానంగా అన్ని ఇంక్రిమెంట్లను కలిపి ఆరు శాతం సాధారణ వార్షిక వడ్డీతో సహా రెండు నెలల్లో చెల్లించాలని ఏపీఎస్‌ ఆర్టీసీని హైకోర్టు ఆదేశించింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ తీర్పు చెప్పారు. వైకల్యం బారిన పడిన ఉద్యోగిని వదిలేయకుండా అతనికి గతంలో నిర్వహించిన పోస్టుకు సమానమైన ప్రత్యామ్నాయ పోస్టును, అదే జీతం, సర్వీసు ప్రయోజనాలతో సహా కల్పించాల్సిన బాధ్యత యజమానిగా ఆర్టీసీపై ఉందని స్పష్టంచేశారు.

అధికారులు పట్టించుకోలేదు...
కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన సీహెచ్‌ రాజేశ్వరరావు ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తూ ప్రమాదానికి గురవడంతో ఆయన వెన్నెముకకు వైద్యులు శస్త్రచికిత్స చేసి రెండు డిస్క్‌లను తొలగించారు. వైకల్యం కారణంగా రాజేశ్వరరావును ఆర్టీసీ యాజమాన్యం 2001లో రిటైర్‌ చేసింది. దీంతో రాజేశ్వరరావు 2005లో డిజేబుల్డ్‌ కమిషనర్‌ వద్ద కేసు దాఖలు చేశారు.

విచారణ చేసిన కమిషనర్, అంగవైకల్య చట్ట నిబంధనల ప్రకారం పిటిషనర్‌ వినతిని పరిగణనలోకి తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను 2006లో ఆదేశించారు. దీంతో 2007లో ఆర్టీసీ అధికారులు రాజేశ్వరరావును తిరిగి సర్వీస్‌లో చేర్చుకున్నారు. బస్‌స్టేషన్‌లో ఆయన సర్వీసులను ఉపయోగించున్నారు.

తనను రిటైర్‌ చేసిన 2001 నుంచి 2007 మధ్య కాలానికి సంబంధించిన బకాయిలన్నింటినీ చెల్లించడంతోపాటు కండక్టర్‌ కేడర్‌లో తనకు పే ఖరారు చేయాలని రాజేశ్వరరావు పలుమార్లు కోరారు. ఆర్టీసీ అధికారులు స్పందించకపోవడంతో ఆయన 2011లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ తుది విచారణ జరిపారు.

‘అంగవైకల్య చట్టంలోని సెక్షన్‌ 47(1) ప్రకారం సర్వీసులో ఉండగా ప్రమాదానికి గురైన ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించడం గానీ, ర్యాంకును తగ్గించడం గానీ చేయకూడదు. ఆ ఉద్యోగి గతంలో నిర్వహించిన పోస్టుకు çసమానమైన పోస్టు లేకపోతే తగిన పోస్టు ఇచ్చేంత వరకు ఆ ఉద్యోగి కోసం సూపర్‌ న్యూమరరీ పోస్టు సృష్టించి అందులో కొనసాగించాలి.

వైకల్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ కేసులో హైకోర్టు తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తోంది. పిటిషనర్‌కు 2001 నుంచి 2007 వరకు వేతన బకాయిలు, ఇంక్రిమెంట్లతోపాటు ఆరు శాతం సాధారణ వార్షిక వడ్డీ కలిపి రెండు నెలల్లో చెల్లించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top