
సాక్షి, విజయవాడ: ఏపీలో(Ap Rains) వర్షాలు దంచికొడుతున్నాయి. విజయవాడలో శనివారం అర్థరాత్రి ఎడతెరిపిలేని భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షానికి విజయవాడ బస్టాండ్ వద్ద రైల్వే ట్రాక్ క్రింద వరద నీరు చేరుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది బస్సులో ప్రయాణిస్తున్న వారిని సురక్షితంగా కాపాడారు.
ఇదిలా ఉండగా.. ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో, తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఏపీ బుధవారం నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
Crazy Rain yesterday night in #Vijayawada.
IGMS Stadium is completely inundated in water. pic.twitter.com/Rdr3xyr3PO— Raghu (@RaghuB_) October 19, 2025
ఇక, ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు చెట్ల కింద నిల్చోవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గురువారం నాటికి దక్షిణమధ్య,పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు.బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. pic.twitter.com/F8MfeYLfvr
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 18, 2025