అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలం నూతన కాలువ గ్రామంలో ఎండిపోయిన వేరుశనగ
మొక్కుబడిగా పంట నష్టం అంచనాలు
కేవలం పొలంలో ఉన్న పంటల పరిశీలనకే పరిమితం
12 లోపు పూర్తి చేయాలని బాబు సర్కారు ఆదేశాలు
తీవ్ర వర్షాభావంతో వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయిన రైతన్నలు
ఎండిపోయిన, తొలగించిన, దున్నేసిన, మేతకు వదిలేసిన పంటల దుస్థితి పట్టించుకోని వైనం
కరువుపై ముందే మేలుకుని రైతులకు అండగా నిలుస్తున్న కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటక లో 217 తాలూకాలు కరువు బారిన పడినట్లు గుర్తింపు..
రూ.60 వేల కోట్ల నష్టం అంచనా.. రూ 11 వేల కోట్లు తక్షణ సాయం కోసం కేంద్రానికి బృందాలు
కర్ణాటక సర్కారు సొంతంగా రూ.1,250 కోట్లు విడుదల.. తొలి విడతగా ఒక్కోరైతు ఖాతాలో రూ.2,500 జమ
ఏపీలో ఇందుకు విరుద్ధంగా రైతులను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కార్
కరువు సాయం ప్రకటన ఊసెత్తని కూటమి ప్రభుత్వం
తాజాగా బాబు ఢిల్లీ పర్యటనలో ప్రధానిని కలిసినా రైతులకు ఒరిగింది శూన్యం
సాక్షి, అమరావతి: కరువు విలయంపై ముందుగానే సమాచారం ఉన్నా కప్పిపుచ్చి రైతన్నలను దారుణంగా వంచించిన చంద్రబాబు సర్కారు మొక్కుబడిగా పంట నష్టం అంచనాలకు సిద్ధమైంది. వేలాది ఎకరాల్లో పంటలు తీవ్రంగా నష్టపోగా కేవలం పొలాల్లో ఉన్న పంటల నష్టం పరిశీలనకే ఉపక్రమించింది. మిగతా రైతులను గాలికి వదిలేసింది. చంద్రబాబు పుణ్యమాని ఈ ఏడాది రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తోంది.
లక్షలాది ఎకరాలు ఖాళీగా నెర్రలు చాస్తున్నాయి. సాగైన చోట తీవ్రమైన వర్షాభావంతో పంటలు ఎండిపోయాయి. రూ.వేల కోట్ల పెట్టుబడులు నేలపాలయ్యాయి. అప్పులు మాత్రం మిగిలాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతన్నలకు అండగా నిలవాలి. యుద్ధప్రాతిపదికన నష్టాన్ని లెక్కించి పరిహారం అందించి మేమున్నామనే భరోసా కల్పించాలి. కానీ రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కరువు మండలాలను ప్రకటించడంతోనే తమ బాధ్యత పూర్తయినట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుపై రైతులు మండిపడుతున్నారు.
కర్ణాటకను చూసి సిగ్గు తెచ్చుకోవాలి
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో కర్నాటకలో 30 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా ఏపీలో ఏకంగా 53.4 శాతంగా నమోదైంది. జాతీయస్థాయిలో చూస్తే మిజోరాం 58 శాతం లోటుతో ప్రథమ స్థానంలో ఉండగా ఏపీ రెండో స్థానంలో ఉంది. వాత్సవానికి ఏపీతో పోలిస్తే కర్ణాటక రాష్ట్రంలో కరువు ప్రభావం తక్కువనే చెప్పాలి. అయినా అక్కడి ప్రభుత్వం కరువుతో అల్లాడుతున్న రైతులకు అండగా నిలిచేందుకు స్పందిస్తున్న తీరు ఆదర్శంగా నిలుస్తోంది. ఏపీ కంటే ముందుగానే కర్ణాటకలో 217 తాలూకాలను కరువు ప్రాంతాలుగా గుర్తించి ప్రకటన చేశారు. మరో 1,520 తాలూకాలను కరువు జాబితాలో చేర్చే అవకాశం ఉందని ప్రకటించింది.
ప్రాథమికంగా దాదాపు రూ.60 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేసింది. ఎన్డీఆర్‌ఎఫ్ నిబంధనల మేరకు కనీసం రూ.11 వేల కోట్ల తక్షణ సాయం ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. కర్ణాటక ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటిస్తున్నాయి. ముఖ్యమంత్రి నేతృత్వంలో అఖిలపక్ష బృందంతో ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని సాయం కోరేందుకు సిద్ధమవుతున్నారు. మరొక వైపు కేంద్ర సాయం కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.1,250 కోట్లను తొలివిడత సాయంగా కర్ణాటక విడుదల చేసింది. అర్హులైన రైతులకు రూ.2,500 చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. తాగునీటి కోసం రూ.306 కోట్లు, అత్యవసర ఖర్చుల కోసం కలెక్టర్లకు రూ.329 కోట్లు, పశుగ్రాసం కోసం రూ.25 కోట్లు విడుదల చేసింది.
ఢిల్లీ పర్యటనలో రైతుల కష్టాలు పట్టని బాబు
చంద్రబాబు నిర్వాకం వల్ల కరువు తీవ్రత అధికంగా ఉన్న ఏపీలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. సీజన్ ఆరంభం నుంచి సమీక్షలకు ఇస్తున్న ప్రాధాన్యత రైతులను ఆదుకునే విషయంలో ఇవ్వడం లేదు. ఏపీలో సాధారణం కంటే ఈ ఏడాది దాదాపు 12 లక్షల ఎకరాల్లో సేద్యమే చేయలేదు. 13.15% మేర వరి నాట్లు పడలేదు. గతేడాదితో పోలిస్తే 29.7% ధాన్యం ఉత్పత్తి తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే మొక్కజొన్న 61.9%, జొన్న 69.2 %, చిరుధాన్యాలు 37.8% మేర ఉత్పత్తి తగ్గుతుందని లెక్క తేల్చారు. తొలుత రాష్ట్రంలోని 688 మండలాల్లో 550 మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయని ప్రభుత్వమే ప్రకటించింది. చివర కు సీజన్ ముగిసిన తర్వాత 388 మండలాలకు పరిమితం చేసింది. 283 మండలాల్లో తీవ్ర కరువు, 105 మండలాల్లో మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించారు.
కానీ కరువు సాయం ఊసెత్తడం లేదు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడంలేదు. కరువు తీవ్రతను కేంద్రానికి వివరించి ఎన్డీఆర్‌ఎఫ్ నిధులు రాబట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ ఢిల్లీలోనే మకాం వేసిన సీఎం చంద్రబాబు బృందం ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తున్నప్పటికీ ఆ ఊసే మరిచి సొంత ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతులను ఆదుకునేందుకు కరువు నిధులను రాబట్టే దిశగా కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. కనీసం రాష్ట్రంలో జరిగిన పంట నష్టం గురించి ప్రాథమికంగా వివరించే ప్రయత్నం చేసిన దాఖలాలే లేవు.
కాకి లెక్కలతో సరి!
కరువు మండలాల ప్రకటన తర్వాత ప్రభుత్వం చేయాల్సిన అసలు పని మొదలవుతుంది. ప్రతి గ్రామంలో పంట నష్టాన్ని శాస్త్రీయంగా నమోదు చేయాలి. రైతువారీగా వివరాలు సేకరించాలి. సాగు పెట్టుబడి నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. తక్షణ ఆర్థిక సాయం అందించాలి. పశుగ్రాసం, తాగునీటి ఏర్పాట్లు చేయాలి. రుణాల విషయంలో ఉపశమనం కల్పించాలి. ఇవేమీ చేయకుండా కరువు మండలాల జాబితా ప్రకటించి చేతులు దులుపుకొంటే కాకి లెక్కలుగానే మిగులుతాయని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
సవాలక్ష షరతులతో అంచనాలు
సీజన్ ముగిసిన తర్వాత మొక్కుబడిగా పంట నష్టం అంచనాలకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది. పైగా బుధవారం (7వ తేదీ) రాత్రి ఆదేశాలిచ్చి.. 12వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ జాబితా ప్రకారం కేంద్రానికి నష్టం అంచనాలు పంíపిస్తామని చెబుతున్నారు. వాస్తవంగా తుపానులు, వరదలు, భారీ వర్షాలు లాంటి వైపరీత్యాల సందర్భంలో దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తారు. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. ఈ ఏడాది వర్షాలు పడలేదు. పంటలు సాగవ్వ లేదు. సాగైన చోట వర్షాభావంతో ఎండిపోయాయి. ఆరు తడులకు నీళ్లులేక, పెట్టుబడులు పెట్టలేక పంటను మేత కొదిలేయగా మరికొంతమంది దున్నేశారు.
ఇవేమీ పట్టించు కోకుండా ప్రభుత్వం ఎప్పటిలాగే ఇన్‌పుట్ సబ్సిడీ కోసం పొలంలో ఉన్న పంటను మాత్రమే అదీ కూడా 33 శాతానికిపైగా దెబ్బతిన్న పంట నష్టాన్ని మాత్రమే జాబితాలో చేర్చాలని ఆదేశించడంపై రైతులు మండిపడుతున్నారు. పైగా పంట నష్టం ఒక్కో రైతుకు గరిష్టంగా ఐదెకరాలకు మించకూడదని షరతు విధించడం గమనార్హం. ఇలాంటి తీవ్ర కరువు పరిస్థితుల్లో ఉదారంగా స్పందించాల్సింది పోయి ఇలా ఆంక్షలు పెట్టడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఖాళీగా ఉన్న పొలాలు, ఎండిపోయిన, దున్నేసిన పొలాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. పంట ఉన్న పొలాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే తమ గతేమిటని తీవ్రంగా నష్టపోయిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం పైసా సాయం చేయలేదు
5 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశా. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంట మొత్తం ఎండిపోయింది. ఎకరానికి రూ. 20 వేల వరకు ఖర్చు చేశా. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం పైసా కూడా సాయం చేయలేదు. – శ్రీనివాసులు, నక్కలదిన్నెవడ్డిపల్లె, అన్నమయ్య జిల్లా
పశువులకు మేతగా వదిలేశా
ఐదెకరాల్లో పత్తి సాగు చేశా. ఎకరాకు రూ. 20 వేలు పెట్టుబడి పెట్టా. చేసేదేమీ లేక పంటను మేతగా పశువులకు వదిలేశా. 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా.. ఇలాంటి నష్టం ఎప్పుడూ జరగలేదు. – గాదిలింగ, నిత్రపట్టి, కర్నూలు జిల్లా
ఎకరాకు కనీసం రూ.25 వేలివ్వాలి
చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువు, కాటకాలు సాధారణం. రైతులను ఉదారంగా ఆదుకోవడంలో దారుణంగా విఫలం. లోటు వర్షపాతంలో దేశంలోనే నెం.2లో ఉన్న ఏపీలో దాదాపు 550 మండలాల్లో కరువు ఉన్నట్టు తేలినా ప్రభుత్వం చివరికి 388 మండలాలకు కుదించింది. కనీసం కరువు ప్యాకేజీ అయినా ప్రకటించిందా అంటే అదీ లేదు. కరువు తీవ్రత పెద్దగా లేని కర్నాటకలో తక్షణ కరువు సాయం ప్రకటిస్తే ఏపీలో మాత్రం ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎకరాకు రూ.25 వేలకు తక్కువ కాకుండా సాయం అందించాలి. – వి.కృష్ణయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం
వ్యవసాయ ఎమర్జెన్సీగా ప్రకటించాలి
చరిత్రలో ముందెన్నడూలేని రీతిలో తీవ్ర దుర్భిక్షంలో రాష్ట్ర వ్యవసాయ రంగం ఉంది. రాష్ట్రంలోని రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఇంతటి సంక్షోభంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక రైతులు గగ్గోలు పెడుతున్నారు. వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలి. రైతులకు ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీని ప్రకటించాలి – ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్


