విష ప్రచారం దుర్మార్గం.. మేం రైతులం కాదా | Farmers agitation on Seed Access Road | Sakshi
Sakshi News home page

విష ప్రచారం దుర్మార్గం.. మేం రైతులం కాదా

Jun 8 2026 4:30 AM | Updated on Jun 8 2026 8:32 AM

Farmers agitation on Seed Access Road

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై ఉండవల్లి రైతుల ఆందోళన 

టీడీపీ తీరుపై నిప్పులు చెరిగిన అన్నదాతలు

జగన్‌ను కలిసిన రైతులపై అసభ్య పదజాలంతో ట్రోలింగ్‌ సరికాదు 

టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచే దుష్ప్రచారం కుట్ర అమలు 

150 యూట్యూబ్‌ చానళ్ల ద్వారా తప్పుడు ప్రచారం

న్యాయం చేయండని అడిగితే అభివృద్ధికి అడ్డంకులంటారా? 

సీఎం చంద్రబాబు, లోకేశ్‌లను కలవాలని ఎంతగానో ప్రయత్నించాం 

ఆ అవకాశమే ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు 

అందువల్లే వైఎస్‌ జగన్‌ను కలిసి మా గోడు వెళ్లబోసుకున్నాం

రాజధానిలో భూములన్నింటినీ ఒకేగాటిన కట్టొద్దు 

ఉండవల్లిలో ఎకరం డబ్బుతో తుళ్లూరులో 20–30 ఎకరాలు కొనొచ్చు 

భూసేకరణ నుంచి ఉండవల్లిని మినహాయించాలని డిమాండ్‌

తాడేపల్లి రూరల్‌: రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లి రైతులపై సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తామంతా నిజమై­న రైతులమేనని ఆదివారం వారు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలు చేత పట్టుకుని సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్న విధంగా తాము దోషులం, దుండగులం కాదని నినదించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పంట పొలాలకు రాజధాని ప్రకటించకముందే కోట్ల రూపాయల విలువ ఉందని చెప్పారు. తుళ్లూరులో రూ.5 లక్షలు ఉంటే ఉండవల్లిలో అప్పట్లోనే ఎకరం రూ.కోట్లు పలికిందని తెలిపారు. ‘అక్కడ 2 ఎకరాల నుండి 10 ఎకరాలున్న రైతులు ఎక్కువ మంది ఉంటే, ఈ ప్రాంతంలో 10 సెంట్ల నుంచి 25 సెంట్ల వరకు ఉన్న రైతులు ఎక్కువగా ఉన్నారు. 

వారికి కౌలు సంవత్సరానికి రూ.లక్షల్లో వస్తుంది. మాకు వేలల్లో కూడా రాదు. ఆ కౌలుతో మేము ఎలా బతకాలి? రాజధాని ప్రకటించినప్పటి నుంచి మేము ఆందోళన చేస్తూనే ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వచ్చినప్పటి నుంచి రాజధానిలో నివాసముండే కొంత మంది టీడీపీ నాయకులు మాపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. టీడీపీ సెంట్రల్‌ కార్యాలయం నుంచే ఈ కుట్ర అమలవుతోంది. ఫలితంగా 150 పైచిలుకు యూట్యూబ్‌ చానల్స్‌లో మాలో ప్రతి ఒక్కరి గురించి వేర్వేరుగా మాటల్లో చెప్పడానికి వీలులేని విధంగా విష ప్రచారం చేస్తున్నారు. కులం పేరుతో దూషిస్తు­న్నారు. ఇలా దుర్మార్గంగా దుష్ప్రచారం చేయడం చాలా బాధేస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు ఇంకా ఏమన్నారంటే.. 

దుష్ప్రచారం చేయడం సరికాదు
ఉండవల్లిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మించడానికి 99 శాతం మంది రైతులు కులాలు, మతాలతో సంబంధం లేకుండా భూములను అందజేశాం. 20–25 సెంట్లు ఉన్న రైతులకు ఇదే జీవనాధారం కాబట్టి లాండ్‌ పూలింగ్‌ నుంచి, ఇతర అంశాల నుంచి మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దీన్ని వేరేవిధంగా స్క్రోలింగ్‌ చేయడం, ప్రచారం చేయడం సబబు కాదు. తుళ్లూరులో 2015కు ముందు ఎకరం రూ.5 లక్షలు ఉంటే, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో రూ.4 కోట్లు ఉండేది. 2014కు ముందు ఉండవల్లి, పెనుమాకలో ఎకరం భూమి అమ్మి తుళ్లూరులో 10–20 ఎకరాలు కొనొచ్చు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ అన్నయ్య, సినీ హీరో చిరంజీవి 2010కి ముందు ఇక్కడ ఎంతకు పొలం కొన్నారో విచారించండి. 

అప్పుడు మేము అడిగేది న్యాయమా.. కాదా.. అని మీకే తెలుస్తుంది. కిరణ్‌ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండవల్లి గుహల ముందు టౌన్‌ ప్లానింగ్‌ అభివృద్ధికి 400 ఎకరాల పొలం తీసుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడును హైదరాబాద్‌ వెళ్లి కలసి మా సమస్య విన్నవించుకున్నాం. నాలుగు పంటలు పండే భూములు ఎలా తీసుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ 20–25 సెంట్ల పొలాల్లో రెండు మూడు పంటలను ఒకేసారి పండిస్తున్నాం. తుళ్లూరు.. ఆ చుట్టు పక్కల వర్షం పడితేనే పంటలు పండు­తాయి. వారికి ఆ భూము­లు ఇవ్వడం వల్ల ఎటువంటి నష్టం లేదు. మాకు మా కుటుంబాలకు ఈ భూములే జీవనాధారం.  

మా భూములను మాకు వదిలేయండి..
మేము అభివృద్ధికి అడ్డంటూ టీడీపీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మా సమస్యలను విన్నవించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అపాయింట్‌మెంట్‌కు ప్రయత్నించినా ఇవ్వలేదు. మా భూములను రక్షించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిశాము. ఇందులో భాగంగానే వైఎస్‌ జగన్‌ను కలసి మా గోడు వెళ్లబోసుకున్నాం. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోండి. మా భూములను మాకు వదిలేయండి. భూ సమీకరణ/భూ సేకరణ నుంచి ఉండవల్లిని మినహాయించండి. లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం’ అని రైతులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలు ఈశ్వర్‌రెడ్డి, ఈశ్వరరావు, ఉండవల్లి అశ్వనికుమార్, భాస్కరరావు, మున్నంగి శ్రీధర్‌రెడ్డి, గుంటక నరేష్‌రెడ్డి, చందు చిన్న బసవయ్య, గోపాలం ప్రభాకరరావు, అశోక్‌రెడ్డి, గుర్రాల శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ కళ్లం సంజీవరెడ్డి, ఈశ్వరయ్య, తెన్నేరు కోటేశ్వరరావు, తెన్నేరు నాగభూషణం, సందు సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement