seed access road
-
విష ప్రచారం దుర్మార్గం.. మేం రైతులం కాదా
తాడేపల్లి రూరల్: రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లి రైతులపై సీడ్ యాక్సెస్ రోడ్డు విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తామంతా నిజమైన రైతులమేనని ఆదివారం వారు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు చేత పట్టుకుని సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్న విధంగా తాము దోషులం, దుండగులం కాదని నినదించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పంట పొలాలకు రాజధాని ప్రకటించకముందే కోట్ల రూపాయల విలువ ఉందని చెప్పారు. తుళ్లూరులో రూ.5 లక్షలు ఉంటే ఉండవల్లిలో అప్పట్లోనే ఎకరం రూ.కోట్లు పలికిందని తెలిపారు. ‘అక్కడ 2 ఎకరాల నుండి 10 ఎకరాలున్న రైతులు ఎక్కువ మంది ఉంటే, ఈ ప్రాంతంలో 10 సెంట్ల నుంచి 25 సెంట్ల వరకు ఉన్న రైతులు ఎక్కువగా ఉన్నారు. వారికి కౌలు సంవత్సరానికి రూ.లక్షల్లో వస్తుంది. మాకు వేలల్లో కూడా రాదు. ఆ కౌలుతో మేము ఎలా బతకాలి? రాజధాని ప్రకటించినప్పటి నుంచి మేము ఆందోళన చేస్తూనే ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వచ్చినప్పటి నుంచి రాజధానిలో నివాసముండే కొంత మంది టీడీపీ నాయకులు మాపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. టీడీపీ సెంట్రల్ కార్యాలయం నుంచే ఈ కుట్ర అమలవుతోంది. ఫలితంగా 150 పైచిలుకు యూట్యూబ్ చానల్స్‌లో మాలో ప్రతి ఒక్కరి గురించి వేర్వేరుగా మాటల్లో చెప్పడానికి వీలులేని విధంగా విష ప్రచారం చేస్తున్నారు. కులం పేరుతో దూషిస్తున్నారు. ఇలా దుర్మార్గంగా దుష్ప్రచారం చేయడం చాలా బాధేస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు ఇంకా ఏమన్నారంటే.. దుష్ప్రచారం చేయడం సరికాదుఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మించడానికి 99 శాతం మంది రైతులు కులాలు, మతాలతో సంబంధం లేకుండా భూములను అందజేశాం. 20–25 సెంట్లు ఉన్న రైతులకు ఇదే జీవనాధారం కాబట్టి లాండ్ పూలింగ్ నుంచి, ఇతర అంశాల నుంచి మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దీన్ని వేరేవిధంగా స్క్రోలింగ్ చేయడం, ప్రచారం చేయడం సబబు కాదు. తుళ్లూరులో 2015కు ముందు ఎకరం రూ.5 లక్షలు ఉంటే, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో రూ.4 కోట్లు ఉండేది. 2014కు ముందు ఉండవల్లి, పెనుమాకలో ఎకరం భూమి అమ్మి తుళ్లూరులో 10–20 ఎకరాలు కొనొచ్చు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అన్నయ్య, సినీ హీరో చిరంజీవి 2010కి ముందు ఇక్కడ ఎంతకు పొలం కొన్నారో విచారించండి. అప్పుడు మేము అడిగేది న్యాయమా.. కాదా.. అని మీకే తెలుస్తుంది. కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండవల్లి గుహల ముందు టౌన్ ప్లానింగ్ అభివృద్ధికి 400 ఎకరాల పొలం తీసుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడును హైదరాబాద్ వెళ్లి కలసి మా సమస్య విన్నవించుకున్నాం. నాలుగు పంటలు పండే భూములు ఎలా తీసుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ 20–25 సెంట్ల పొలాల్లో రెండు మూడు పంటలను ఒకేసారి పండిస్తున్నాం. తుళ్లూరు.. ఆ చుట్టు పక్కల వర్షం పడితేనే పంటలు పండుతాయి. వారికి ఆ భూములు ఇవ్వడం వల్ల ఎటువంటి నష్టం లేదు. మాకు మా కుటుంబాలకు ఈ భూములే జీవనాధారం. మా భూములను మాకు వదిలేయండి..మేము అభివృద్ధికి అడ్డంటూ టీడీపీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మా సమస్యలను విన్నవించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్కు ప్రయత్నించినా ఇవ్వలేదు. మా భూములను రక్షించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిశాము. ఇందులో భాగంగానే వైఎస్ జగన్‌ను కలసి మా గోడు వెళ్లబోసుకున్నాం. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోండి. మా భూములను మాకు వదిలేయండి. భూ సమీకరణ/భూ సేకరణ నుంచి ఉండవల్లిని మినహాయించండి. లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం’ అని రైతులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలు ఈశ్వర్‌రెడ్డి, ఈశ్వరరావు, ఉండవల్లి అశ్వనికుమార్, భాస్కరరావు, మున్నంగి శ్రీధర్‌రెడ్డి, గుంటక నరేష్‌రెడ్డి, చందు చిన్న బసవయ్య, గోపాలం ప్రభాకరరావు, అశోక్‌రెడ్డి, గుర్రాల శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ కళ్లం సంజీవరెడ్డి, ఈశ్వరయ్య, తెన్నేరు కోటేశ్వరరావు, తెన్నేరు నాగభూషణం, సందు సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
కిలోమీటర్‌కు రూ.174.43 కోట్లు
సాక్షి, అమరావతి: అంచనా వ్యయం, కాంట్రాక్టు విలువలను అమాంతం పెంచేసి... రాజధానిలో భవనాలు, రోడ్ల నిర్మాణ పనుల్లో సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), ఏడీసీఎల్ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్–ఏడీసీఎల్) సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. దీన్నిచూసి భవనాలు, రోడ్లను బంగారంతో ఏమైనా నిరి్మస్తున్నారా? అంటూ ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీడ్ యాక్సిస్ (ఈ3) రోడ్డును ఎన్‌హెచ్–16 (కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారి)తో అనుసంధానించే మూడో దశ పనులకు ఏడీసీఎల్ కిలోమీటరుకు రూ.174.43 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించడంపై నివ్వెరపోతున్నారు. జాతీయ రహదారులు, అందులోభాగంగా నిరి్మంచే భారీ ఫ్లైఓవర్ల కాంట్రాక్టు విలువను ప్రస్తావిస్తూ సీడ్ యాక్సిస్ రోడ్డును తారు, కాంక్రీట్‌తో కాకుండా బంగారపు పూతతో వేస్తున్నారా? అంటూ చలోక్తులు విసురుతున్నారు. ⇒ సీడ్ యాక్సిస్ రోడ్డును ఎన్‌హెచ్–16తో అనుసంధానం చేసే పనుల్లో భాగంగా మూడో దశలో కొండవీటి వాగు నుంచి రైల్వే ట్రాక్‌పైన మణిపాల్ ఆస్పత్రి మీదుగా వారధి వరకు 3.5 కి.మీ. పొడవు (18.270 కి.మీ. నుంచి 21.770 కి.మీ. వరకు), 60 మీటర్ల వెడల్పుతో ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌ను నిరి్మంచడానికి రూ.511.84 కోట్ల కాంట్రాక్టు విలువతో సోమవారం ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. లంప్సమ్ విధానంలో రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని నిర్దేశించింది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.98.66 కోట్లను తిరిగి చెల్లిస్తామని (రీయింబర్స్) పేర్కొంది. అంటే, కాంట్రాక్టు విలువ రూ.610.5 కోట్లకు చేరుతుంది. ⇒ ఈ రహదారిలో 2.464 కి.మీ. పొడవునా ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) ఎలివేటెడ్ కారిడార్‌ను నిరి్మంచాలి. 99.6 మీటర్ల పొడవునా ఆర్వోబీ, రెండు అండర్‌పాస్‌లు, ఒక ఇంటర్చేంజ్ (ట్రంపెట్), ఒక మైనర్ బ్రిడ్జి కమ్ పప్, మూడు ర్యాంప్‌లు (విజయవాడ–అమరావతి 232 మీటర్లు, గుంటూరు–అమరావతి 280 మీటర్లు, విజయవాడ–అమరావతి 115 మీటర్లు పొడవు) నిర్మించాలి. ఈ లెక్కన కి.మీ. రోడ్డు, ఆర్వోబీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.174.43 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టినా.. దేశంలో జాతీయ రహదారులను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తోంది. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–65)లో అంతర్భాగంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేలా అత్యద్భుత డిజైన్‌తో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ను 2.6 కి.మీ. మేర ఆరు వరుసలు, రూ.282.4 కోట్లతో 2020లో పూర్తిచేసింది. కి.మీ.కు రూ.108.61 కోట్లు వ్యయం అయిందన్నమాట. కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారిలో అంతర్భాగంగా విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు బెంజ్ సర్కిల్ వద్ద 2020 నాటికి 2.35 కి.మీ. మేర మొదటి ఫ్లైఓవర్‌ను రూ.80 కోట్లతో నిరి్మంచింది. అంటే, కి.మీ.కు 34.04 కోట్లు వ్యయం. ఇక 2.47 కి.మీ. పొడవునా రెండో ఫ్లైఓవర్‌ను 2021లో రూ.88 కోట్లతో నిరి్మంచింది. ఇందులో కి.మీ.కు రూ.35.62 కోట్లు వ్యయమైంది. కాగా, అప్పటితో పోలిస్తే ఇప్పుడు స్టీల్, సిమెంట్, పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పులేదని ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. నీకింత.. నాకింత పంచుకోవడానికేజాతీయ రహదారులు.. విజయవాడలో కనకదుర్గమ్మ, బెంజ్ సర్కిల్ ప్లై ఓవర్ల నిర్మాణ వ్యయాలతో సీడ్ యాక్సిస్ రోడ్డును ఎన్‌హెచ్–16తో అనుసంధానం చేసే రహదారి పనుల కాంట్రాక్టు విలువను పోల్చిచూస్తూ ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు విలువను భారీగా పెంచేయడం వెనుక.. పెంచేసిన అంచనా వ్యయాన్ని కాంట్రాక్టరుతో కలిసి నీకింత నాకింత అంటూ ముఖ్య నేత పంచుకు తినడానికే అని ఆరోపిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు), కేఎఫ్‌డబ్ల్యూ (జర్మనీ), హడ్కో వంటి ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను దోచుకు తింటూ రాష్ట్ర ప్రజలపై తీవ్ర ఆరి్థక భారం మోపుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అమరావతి ఎలా ఉంటుంది?
రెండేళ్లుగా తేలని ప్రభుత్వ కాంప్లెక్స్ డిజైన్ల వ్యవహారం టెండర్లు ఖరారైనా మొదలుకాని సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు హడావుడి నిర్ణయాలు, ప్రణాళికా లోపమే కారణం పూర్తిస్థాయి డిజైన్లు సిద్ధమయ్యేదెన్నడో? సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరిట రెండున్నరేళ్లుగా హడావుడి కొనసాగుతున్నా ఇంతవరకూ ఒక్క ప్రాజెక్టయినా పురుడు పోసుకోలేదు. శాశ్వత నిర్మాణాలకు ఇంకా డిజైన్లే ఖరారు కాలేదు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవన సముదాయం సైతం ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. తొందరపాటు నిర్ణయాలు, ప్రణాళికా లోపం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. 2014 సెప్టెంబర్ 3న రాజధాని ప్రాంతాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత మూడు నెలలకు సీఆర్డీఏ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించింది. 2015 జనవరిలో భూ సమీకరణ తంతును ప్రారంభించింది. 33 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించినట్లు ప్రకటించింది. అదే సంవత్సరం అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోదీlచేతుల మీదుగా గుంటూరు జిల్లా ఉద్ధండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరగ్గా డిసెంబర్ 26న రాజధాని మాస్టర్ ప్లాన్లను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, తాత్కాలిక సచివాలయం మినహా క్షేత్రస్థాయిలో ఇంతవరకూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ భవనాలుండే అత్యంత కీలకమైన ప్రభుత్వ కాంప్లెక్స్ డిజైన్లు ఖరారు చేయడానికి ప్రభుత్వం సంవత్సరం నుంచి ఆపసోపాలు పడుతోంది. విదేశీ ఆర్కిటెక్ట్లతోపాటు ఇక్కడి విద్యార్థులను కూడా డిజైన్ల రూపకల్పనలో భాగస్వాముల్ని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. ఈ డిజైన్లు ఖరారైతే వాటిని పూర్తిస్థాయిలో రూపొందించేందుకు కనీసం సంవత్సరం పడుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పూర్తిస్థాయి డిజైన్లు ఎప్పటికి సిద్ధమవుతాయి? అసలు ఈ కాంప్లెక్స్ నిర్మాణం మొదలయ్యేది ఎప్పుడో అంతుబట్టడం లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు బ్రేక్ అమరావతిని బయటి ప్రపంచానికి అనుసంధానించే కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి టెండర్లు ఖరారైనా ఇంతవరకూ ప్రారంభం కాలేదు. ఐదో నంబరు జాతీయ రహదారిపై కనకదుర్గ వారధి నుంచి సీడ్ రాజధాని వరకూ 22 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన ఈ రోడ్డు మొదటి ప్యాకేజీ పనుల్ని రూ.250 కోట్లకు రెండు నెలల క్రితం ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. త్వరలో పనులు ప్రారంభమవుతాయనగా నాలుగు లైన్ల ఈ రహదారిని ఎనిమిది లైన్లుగా మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించడంతో ఈ ప్రాజెక్టుకు బ్రేకు పడింది. ఏడు రోడ్ల డిజైన్లూ అంతే.. కీలకమైన ఏడు రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని ఆరు నెలల నుంచి చెబుతున్నా అది ఆచరణలోకి రాలేదు. ఆ రోడ్ల డిజైన్లను తరచూ మారుస్తుండడంతో టెండర్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు సైతం అతీగతీ లేకుండా పోయాయి. కొండవీటి వాగు వరద నియంత్రణ, జల మార్గాల అభివృద్ధికి సంబంధించిన డిజైన్ల రూపకల్పన బాధ్యతను నెదర్లాండ్స్ కన్సల్టెన్సీకి అప్పగించినా అవి ఇంకా రాలేదు. కీలకమైన గ్రామాల్లో లేఔట్ల అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది. ప్లాట్ల పంపిణీ పేరుతో రైతులకు పత్రాలు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో భూమిని చదును చేసే పనే ఇంకా పూర్తి కాలేదు.


