ఇదీ సీడ్ యాక్సిస్ రోడ్డును ఎన్‌హెచ్–16తో అనుసంధానించే పనుల కాంట్రాక్టు తీరు
రూ.511.84 కోట్ల కాంట్రాక్టు విలువతో టెండర్ నోటిఫికేషన్ జారీ
పన్నుల రూపంలో రూ.98.66 కోట్లు రీయింబర్స్.. దీంతో కాంట్రాక్టు విలువ
రూ.610.5 కోట్లు.. 3.5 కి.మీ. పొడవునా 6 వరుసలతో రోడ్డు నిర్మాణం
2.464 కి.మీ. పొడవునా ఆర్వోబీ ఎలివేటెడ్ కారిడార్
కనకదుర్గ ఫ్లైఓవర్ ఆరు వరుసలతో 2.6 కి.మీ.. రూ.282.4 కోట్లతో నిర్మాణం
బెంజ్ సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ 2.35 కి.మీ.. రూ.80 కోట్లతో పూర్తి
రెండో ఫ్లైఓవర్ 2.47 కి.మీ.. రూ.88 కోట్లతో నిర్మాణం
వీటిని పరిగణనలోకి తీసుకుంటే సీడ్ యాక్సిస్ రోడ్డు కాంట్రాక్టు విలువ భారీగా పెంచేశారంటున్న ఇంజినీరింగ్ నిపుణులు
రోడ్డును తారు, కాంక్రీట్‌తో వేస్తున్నారా లేదంటే బంగారంతో వేస్తున్నారా? అని విస్మయం
పెంచిన అంచనా వ్యయాన్ని యథావిధిగా కాంట్రాక్టర్‌తో కలిసి ముఖ్య నేత పంచుకు తినడానికేనని ఆరోపణలు
సాక్షి, అమరావతి: అంచనా వ్యయం, కాంట్రాక్టు విలువలను అమాంతం పెంచేసి... రాజధానిలో భవనాలు, రోడ్ల నిర్మాణ పనుల్లో సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), ఏడీసీఎల్ (అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్–ఏడీసీఎల్) సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. దీన్నిచూసి భవనాలు, రోడ్లను బంగారంతో ఏమైనా నిరి్మస్తున్నారా? అంటూ ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీడ్ యాక్సిస్ (ఈ3) రోడ్డును ఎన్‌హెచ్–16 (కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారి)తో అనుసంధానించే మూడో దశ పనులకు ఏడీసీఎల్ కిలోమీటరుకు రూ.174.43 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించడంపై నివ్వెరపోతున్నారు. జాతీయ రహదారులు, అందులోభాగంగా నిరి్మంచే భారీ ఫ్లైఓవర్‌ల కాంట్రాక్టు విలువను ప్రస్తావిస్తూ సీడ్ యాక్సిస్ రోడ్డును తారు, కాంక్రీట్‌తో కాకుండా బంగారపు పూతతో వేస్తున్నారా? అంటూ చలోక్తులు విసురుతున్నారు.
⇒ సీడ్ యాక్సిస్ రోడ్డును ఎన్‌హెచ్–16తో అనుసంధానం చేసే పనుల్లో భాగంగా మూడో దశలో కొండవీటి వాగు నుంచి రైల్వే ట్రాక్‌పైన మణిపాల్ ఆస్పత్రి మీదుగా వారధి వరకు 3.5 కి.మీ. పొడవు (18.270 కి.మీ. నుంచి 21.770 కి.మీ. వరకు), 60 మీటర్ల వెడల్పుతో ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌ను నిరి్మంచడానికి రూ.511.84 కోట్ల కాంట్రాక్టు విలువతో సోమవారం ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. లంప్సమ్ విధానంలో రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని నిర్దేశించింది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.98.66 కోట్లను తిరిగి చెల్లిస్తామని (రీయింబర్స్) పేర్కొంది. అంటే, కాంట్రాక్టు విలువ రూ.610.5 కోట్లకు చేరుతుంది.
⇒ ఈ రహదారిలో 2.464 కి.మీ. పొడవునా ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) ఎలివేటెడ్ కారిడార్‌ను నిరి్మంచాలి. 99.6 మీటర్ల పొడవునా ఆర్వోబీ, రెండు అండర్‌పాస్‌లు, ఒక ఇంటర్‌చేంజ్ (ట్రంపెట్), ఒక మైనర్ బ్రిడ్జి కమ్ పప్, మూడు ర్యాంప్‌లు (విజయవాడ–అమరావతి 232 మీటర్లు, గుంటూరు–అమరావతి 280 మీటర్లు, విజయవాడ–అమరావతి 115 మీటర్లు పొడవు) నిర్మించాలి. ఈ లెక్కన కి.మీ. రోడ్డు, ఆర్వోబీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.174.43 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టినా..
దేశంలో జాతీయ రహదారులను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తోంది. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–65)లో అంతర్భాగంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేలా అత్యద్భుత డిజైన్‌తో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ను 2.6 కి.మీ. మేర ఆరు వరుసలు, రూ.282.4 కోట్లతో 2020లో పూర్తిచేసింది. కి.మీ.కు రూ.108.61 కోట్లు వ్యయం అయిందన్నమాట. కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారిలో అంతర్భాగంగా విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు బెంజ్ సర్కిల్ వద్ద 2020 నాటికి 2.35 కి.మీ. మేర మొదటి ఫ్లైఓవర్‌ను రూ.80 కోట్లతో నిరి్మంచింది. అంటే, కి.మీ.కు 34.04 కోట్లు వ్యయం. ఇక 2.47 కి.మీ. పొడవునా రెండో ఫ్లైఓవర్‌ను 2021లో రూ.88 కోట్లతో నిరి్మంచింది. ఇందులో కి.మీ.కు రూ.35.62 కోట్లు వ్యయమైంది. కాగా, అప్పటితో పోలిస్తే ఇప్పుడు స్టీల్, సిమెంట్, పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పులేదని ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.
నీకింత.. నాకింత పంచుకోవడానికే
జాతీయ రహదారులు.. విజయవాడలో కనకదుర్గమ్మ, బెంజ్ సర్కిల్ ప్లై ఓవర్‌ల నిర్మాణ వ్యయాలతో సీడ్ యాక్సిస్ రోడ్డును ఎన్‌హెచ్–16తో అనుసంధానం చేసే రహదారి పనుల కాంట్రాక్టు విలువను పోల్చిచూస్తూ ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు విలువను భారీగా పెంచేయడం వెనుక.. పెంచేసిన అంచనా వ్యయాన్ని కాంట్రాక్టరుతో కలిసి నీకింత నాకింత అంటూ ముఖ్య నేత పంచుకు తినడానికే అని ఆరోపిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు), కేఎఫ్‌డబ్ల్యూ (జర్మనీ), హడ్కో వంటి ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను దోచుకు తింటూ రాష్ట్ర ప్రజలపై తీవ్ర ఆరి్థక భారం మోపుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


