ఉండవల్లి, పెనుమాక రైతుల స్పష్టీకరణ
హైకోర్టును.. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం
ఈ ప్రభుత్వానికి రైతులంటే ఇష్టం లేదు..
సీఆర్‌డీఏ అధికారులు మమ్మల్ని అనేక రకాలుగా వేధిస్తున్నారు
మా బాధలు ఎవరు వింటారో వారిని కలుస్తాం.. తప్పేమిటి?
మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసి మా గోడు విన్నవించుకున్నాం..
మా కష్టాల గురించి తెలుసుకునేందుకే కమిటీ ఏర్పాటు చేశారు..
ఆ కమిటీ నాయకులు వస్తుంటే దాడి చేయడం దుర్మార్గం..
ఉండవల్లి, పెనుమాక భూ సేకరణ జాబితాలో లేవన్నారు..
భూములు ఇవ్వడం ఇష్టం లేని వారిని 9.2 పత్రాలిమ్మన్నారు..
తీరా ఇచ్చాక భూ సేకరణ నోటీసులిచ్చారు..
భూములివ్వడం లేదని రకరకాలుగా ఇబ్బందిపెడుతున్నారు..
భూసేకరణ బాధిత రైతులు ఆవేదన
తాడేపల్లి రూరల్: భూమిని కాపాడుకోవడం కోసం కలసికట్టుగా న్యాయపోరాటం చేస్తామని ఉండవల్లి, పెనమాక రైతులు స్పష్టంచేశారు. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. న్యాయపోరాటంతోపాటు కలసివచ్చే రాజకీయ పార్టీలతో కలసి పోరాటం చేస్తామని రైతులు తెలిపారు. మంగళవారం గుంటూరు జిల్లా ఉండవల్లి సెంటర్‌లోని ఓ రైస్‌మిల్లులో రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులు, భూసేకరణకు నోటీసులు వచ్చిన రైతులు సమావేశం నిర్వహించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. దేశ రక్షణకు సైనికులు ఎంత అవసరమో దేశంలో ప్రజల ఆకలి తీర్చడానికి రైతులు కూడా అంతే అవసరమని వారు పేర్కొన్నారు.
బాధల్లో ఉన్నప్పుడు తమను ఓదార్చే వారిని తప్పనిసరిగా కులాలు, మతాలతో సంబంధం లేకుండా కలుస్తామని, దానిలో భాగంగానే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశామని రైతులు వివరించారు. సీఆర్‌డీఏ పరిధిలో రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని తమ కష్టాలను వివరించామని, దానికి స్పందించిన ఆయన న్యాయ సలహా కమిటీ, సీఆర్‌డీఏ రైతుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారని, ఆ కమిటీ క్షేత్రస్థాయిలో రైతుల బాధలను తెలుసుకోవడానికి వస్తున్న సమయంలో ఉండవల్లి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో దాడులు జరగడం చాలా దురదృష్టకరమని ఉండవల్లి రైతులు పేర్కొన్నారు.
సీఆర్‌డీఏ అధికారులు, టీడీపీ పెద్దలు రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వాలని కోరినప్పుడు 95 శాతం మంది భూములు ఇచ్చారని తెలిపారు. మిగిలిన భూమిని వదిలివేస్తామని వారు హామీ ఇచ్చారని రైతులు వివరించారు. అయితే ఆ తర్వాత ఆ మాట తప్పి భూ సేకరణకు మూడు దఫాలుగా నోటీసులు అందజేశారని తెలిపారు. రోడ్లకు, కొండవీటి వాగుకు భూములు తీసుకుని మిగిలినవి వదిలివేస్తారా అని అధికారులను అడుగుతున్నా తమకు తెలియదంటున్నారని రైతులు పేర్కొన్నారు.
‘9.3 ఒప్పందం పత్రం ఇచ్చేదాకా ఒకలాగా మాట్లాడారు. ఇచ్చిన తరువాత మరోలా మాట్లాడుతున్నారు’ అని రైతులు వివరించారు. గతంలో ఉండవల్లి, పెనుమాక గ్రామాలు సేకరణలో లేవని, భూములు ఇవ్వడం ఇష్టంలేనివారు 9.2 పత్రాలు ఇవ్వాలని అధికారులు చెప్పారని, 9.2 ఇచ్చిన తరువాత భూ సేకరణ నోటీసులు ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కొందరు రైతులు ఏమన్నారంటే...
ఈ ప్రభుత్వానికి రైతులంటే ఇష్టం లేదు
కిసాన్ రైతు సంఘం గతంలో రాజధాని నిర్మాణానికి 5 వేల ఎకరాలు సరిపోతుందని స్పష్టం చేసింది. అలాంటిది ప్రభుత్వం 50 వేల ఎకరాలు సేకరించింది. నేను కూడా ఒక రైతునే. ఉండవల్లిలో అనేక రకాల పంటలు పండిస్తాం. 365 రోజులు పూలు, కూరగాయలు పండించి ఎవరిమీద ఆధారపడకుండా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఇలాంటి భూములను కాంక్రీట్ జంగిల్‌గా ఎలా చేస్తారు? రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం పూలింగ్, నాన్ పూలింగ్ అని ఇచ్చారు.
ఇవ్వని వాళ్లు 9.2 ఫారం ఇవ్వాలని అధికారులు కోరారు. రైతులందరం ఇచ్చాం. ఇప్పుడేమో భూములు ఇవ్వని రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ఉండవల్లి గ్రామాల్లో దాడిచేసే కల్చర్ ఎప్పుడూ లేదు. రైతులతో గొడవకు దిగిన ఏ ప్రభుత్వం నిలవబడదు. ఈ ప్రభుత్వానికి రైతులంటే ఇష్టం లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి ఇచ్చిన 9.3ని కూడా వెనక్కి తీసుకోవాలా, ఇవ్వాలా అని ఆలోచిస్తాం. – కొర్రప్రోలు ఈశ్వరరెడ్డి, కిసాన్ రైతు సంఘం అధ్యక్షులు
మేం ఆహ్వానిస్తేనే రైతు పరిరక్షణ కమిటీ వచ్చింది
రైతుల సమస్యలపై మాత్రమే జగన్‌ను కలిశాం. ఆయన్ను కలవకముందే అనేక రైతు సమస్యలపై సమావేశం నిర్వహించాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసినపుడు రహదారులకు భూములు ఇవ్వాలని చెప్పారు. మిగిలిన భూమిని వదిలేసే వరకు పార్టీ తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మా కోరిక మేరకే రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. సీఆర్‌డీఏ రైతుల పరిరక్షణ కమిటి పరిశీలనకు వస్తున్న సమయంలో ఇలాంటి దాడులు జరగడం చాలా బాధాకరం. ఒక రైతుగా ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. –దంటు బాలాజీరెడ్డి
ఆ ప్లాట్లు ఎక్కడో రైతులకు తెలియదు..
తొలి విడత పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు నేటికీ ప్లాట్లు కేటాయించలేదు. పేపర్ల మీద ఇచ్చినట్లు చూపిస్తున్నారు కానీ ఆ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో రైతులకు తెలియదు. మేము నష్టపోయినా, భూములు ఇచ్చిన రైతులు నష్టపోయినా ఒకటే. సీఆర్‌డీఏ అధికారులు భూములు ఇవ్వని రైతులపై ఒత్తిడి తీసుకువచ్చే ముందు భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు మా ఊర్లోనే ఉంటున్నారు. ఇప్పటి వరకు అభివృద్ధి చేయలేదు. ఎన్నో సంవత్సరాల నుండి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. 2012కి ముందే మా గ్రామంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు జరిగాయి. ఇప్పుడే జరగడం లేదు. రిజిస్ట్రేషన్లు కూడా కావడం లేదు. –మేకా శ్రీధర్‌రెడ్డి
మా భూములు కాపాడుకునేందుకు ఎవరినైనా కలుస్తాం
గ్రామాల్లో ఎన్ని పార్టీలు ఉన్నా, రైతులకు ఆ పార్టీలతో ఎటువంటి సంబంధం లేదు. కులమత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లా ఉంటున్నాం. దయచేసి గొడవలు పెట్టవద్దు. మా భూములు కాపాడుకునేందుకు ఎవరినైనా కలుస్తాం. అధికారులు ఇచ్చిన మాట తప్పి రైతులను మోసం చేస్తున్నారు. దానికి ఉదాహరణ నేనే. నాకు సీఆర్‌డీఏ అధికారులు ప్లాట్లు కేటాయించే దాకా నా పొలంలో అడుగు పెట్టడానికి వీలులేదంటూ, నా పొలం చదును చేయడానికి వీలులేదంటూ ఒప్పందం కుదుర్చుకున్నాను.
9.3 ఒప్పంద పత్రం ఇవ్వగానే ఉండవల్లిలో గ్రామసభ జరుగుతుండగా రోడ్డు కాంట్రాక్టర్ వచ్చి మోటారు పీకేందుకు ప్రయత్నించాడు. ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. ఇప్పటి వరకు ఏమీ ప్రయోజనం లేదు. పొలానికి రెండు వైపులా 5 అడుగుల మెరక తోలారు. వర్షం వస్తే పంట మునిగిపోతుంది. నా పరిస్థితి ఏమిటి? –అనంత శివరావు
ప్రభుత్వమే మోసం చేస్తే ఎలా..?
నాకు ఉండవల్లిలో లే అవుట్‌లో 7.5 సెంట్లు భూమి ఉంది. ల్యాండ్ ఫూలింగ్‌లో నా పేరు లేదు. భూమి అమ్మిన వారి పేరే ఉంది. ఇదేంటంటూ కమిషనర్‌ను కలిశాను. ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు. నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. కానీ భూ సేకరణ కింద పెట్టారు. నోటీసు రాకుండా అభ్యంతరాలను ఎలా చెప్పాలి? కలెక్టర్ ఆఫీసుకు వెళితే మా పేరు ఉందని నా అబ్జెక్షన్‌ను తీసుకున్నారు. ప్రభుత్వమే ఇలా మోసం చేస్తే రాజకీయ నాయకులను ఆశ్రయించడంలో తప్పేముంది? ఇలాంటి దాడులు జరగడం చాలా దురదృష్టకరం. –వీరారెడ్డి, ప్రభుత్వ ఉద్యోగి
పూలింగ్‌కు ఇచ్చాను, నాకు ప్లాట్ ఇవ్వలేదు
నేను మొదటి విడతలోనే పూలింగ్‌కు నా భూమి ఇచ్చాను. నేను 30 సెంట్ల భూమి ఇవ్వగా టీడీఆర్ బాండ్ ఇచ్చారు. మిగిలిన భూమి ఎక్కడ ఇచ్చారనేది చూపించడం లేదు. నేను ప్లాట్లు అడిగితే గుంటూరు వెళ్లమంటున్నారు. అక్కడకు వెళితే సీఆర్‌డీఏ కార్యాలయానికి వెళ్లమంటున్నారు. 821 మంది రైతులకు 5 విడతలుగా నోటీసులు ఇచ్చారు. ఇంతవరకు ఇచ్చిన రైతులకే న్యాయం చేయలేదు. కొత్తగా భూములు తీసుకుని ఏం చేస్తారు? సీఎం నివాసం పక్కనే ఉన్నా మాకు మౌలిక సదుపాయాల విషయంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. కొంతమందికి పెన్షన్లు నిలిపివేశారు. మా ప్రాంతంలో రోడ్లు, లైట్లు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. –కనకం కోటేశ్వరరావు


