సాక్షి, గుంటూరు: తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు భూములు వదులుకునే ప్రసక్తే లేదని రైతు గుంటక అనంత పద్మనాభరెడ్డి కుమారుడు ఉజ్వల్‌రెడ్డి అన్నారు. ఉండవల్లికి చెందిన రైతు అనంత పద్మనాభరెడ్డి.. రాజధాని పేరుతో వేధింపులకు గురై గుండెపోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు ఉజ్వల్ మాట్లాడుతూ.. 1951 నుంచి తమ కుటుంబానికి పొలం ఉందని.. మాకున్న భూమే మా ధైర్యం.. భరోసా.. అలాంటి ధైర్యంపైన కొడతామంటే చూస్తూ ఊరుకోమని ఆయన స్పష్టం చేశారు.
‘‘భూమిని కాపాడుకోవడానికి మా నాన్న గుంటూరు కలెక్టరేట్‌కు వెళ్ళారు. డయాలసిప్ చేయించుకోవడానికి కూడా వెళ్లలేదు. బలవంతపు సేకరణకు భూమి ఇవ్వనని అభ్యంతరాలు దాఖలు చేశారు. వారసత్వంగా వస్తున్న భూమిని ఎలా వదులుకుంటాం?. మా భూమిని ఇవ్వబోమని ఇప్పటికే ప్రభుత్వానికి తేల్చి చెప్పాం. మావి మూడు పంటలు పండే భూములు. బలవంతపు భూసేకరణ సరైంది కాదు. బలవంతంగా భూములు తీసుకుంటే మా సమాధానం కూడా అలానే ఉంటుంది’’ అని ఉజ్వల్‌రెడ్డి పేర్కొన్నారు.


