Fact Check: విశాఖపై రామోజీ ‘శోకం’  | FactCheck: Eenadu Ramoji Rao Fake News On YSRCP Govt About Visakha, Facts Inside - Sakshi
Sakshi News home page

Fact Check: విశాఖపై రామోజీ ‘శోకం’’ 

Published Mon, Jan 29 2024 4:35 AM

Eenadu Ramoji Rao Fake News On YSRCP Govt About Visakha - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఇన్నాళ్లూ వివక్షకు గురైన విశాఖ నగరం అభివృద్ధి పథంలో అగ్రగామిగా అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకోవటాన్ని చూసి ఎల్లో మీడియా ఓర్వలేకపోతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం వచ్చాక పాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖ కొత్త ప్రాజెక్టులు, శంకుస్థాపనలతో కళకళలా­డుతుంటే రామోజీ రగిలిపోతున్నారు. ఉత్తరాంధ్రలో విశిష్ట నగరంగా భాసిల్లుతున్న విశాఖపై ఏడుపు­గొట్టు రాతలతో మభ్యపుచ్చేందుకు ప్రయత్ని­స్తున్నారు.

నాలుగేళ్లలో నగరాభివృద్ధికి సీఎం జగన్‌ ప్రభుత్వం రూ.2,556 కోట్లు కేటాయించింది. దివంగత వైఎస్సార్‌ అనంతరం విశాఖలో ఐటీ అభివృద్ధికి బాటలు వేసిన ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికే నగరంలో అదానీ డేటా సెంటర్, ఒబెరాయ్‌ హోటల్‌కు భూమి పూజ నిర్వహించారు. నగరంలో ఎటు చూసినా అభివృద్ధి పలకరిస్తుంటే ఈనాడు మాత్రం ఏమీ జరగలేదంటూ శోకాలు పెడుతోంది. 

లూలూతో బాబు లాలూచీ..
వేల మందికి ఉపాధినిచ్చే లూలూని తరిమేశారంటూ ఎల్లో మీడియా బురద చల్లింది. దీని వెనుక ఉన్న కుంభకోణాన్ని పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం విశాఖ బీచ్‌ ఎదురుగా ఉన్న రూ.680 కోట్ల విలువైన 13.59 ఎక­రాల భూమిని నామమాత్రపు లీజుతో అంతర్జాతీ­య కన్వెన్షన్‌ సెంటర్‌ పేరుతో లూలూ గ్రూపునకు కట్టబెట్టింది. 2017లో లీజుకు తీసుకున్న లూలూ సంస్థ 2019 నవంబర్‌ వరకు ఒక్క రూపాయి లీజు కూడా చెల్లించలేదు. అన్ని విషయా­లు పరిశీలించిన తర్వాతే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఒప్పందాన్ని రద్దు చేసి రూ.వందల కోట్ల విలువైన భూమిని సీఎం జగన్‌ ప్రభుత్వం కాపాడింది.

బినామీ వ్యవహారాలు..
సెబీ రూ.5 కోట్లు జరిమానా విధించిన ఫ్రాంక్లిన్‌ టెం­పు­ల్టన్‌కు రూ.400 కోట్ల విలువ చేసే 40  ఎకరాల  భూమిని కేవలం రూ.13 కోట్లకు చంద్రబా­బు కట్టబెట్టారు. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపినా లెక్క చేయలేదు. ఫ్రాంక్లిన్‌తో భాగస్వామ్యం ఉన్న ఓ సంస్థ అధినేత చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం దీనికి కారణం.

లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన ఆ వ్యక్తికి చెందిన సంస్థ ప్రధాన కార్యాలయం శాన్‌ఫ్రాన్సిస్కోలో కేవలం పది ఎకరాల్లో ఉండగా ఇక్కడ మాత్రం 40 ఎకరాలు ఎందుకని ప్రశ్నించినా చంద్రబాబు పెడచెవిన పెట్టారు. అనంతరం ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఇండియా భారీ రుణాల కుంభకోణంలో ఇరుక్కోవడంతో సంస్థ వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. సుమారు రూ.29 వేల  కోట్ల విలువైన ఆరు డెట్‌ ఫండ్స్‌ను సెబీ నిషేధించడం, పెనాల్టీలు విధించడంతో భారత్‌లో విస్తరణ కార్యక్రమాలను నిలిపివేసింది. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ ఎల్లో మీడియా అబద్ధాలను ప్రచురిస్తోంది.

మెట్రోని అటకెక్కించింది బాబే.. 
విశాఖకు మెట్రో రైల్‌ తెస్తామంటూ హడావుడి చేసిన చంద్రబాబు ఎన్నికల ముందు డీపీఆర్‌ పేరుతో మభ్యపుచ్చారు. ఎలాంటి ట్రాఫిక్‌ సర్వే లేకుండా తూతూమంత్రంగా రూపొందించిన డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించలేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీ మెట్రో డీపీఆర్‌ తయారు చేసిన సంస్థకు పూర్తి బాధ్యతలు అప్పగించింది. 2047 వరకు ట్రాఫిక్‌పై సర్వే నిర్వహించి ఆ ప్రకారం సమగ్ర డీపీఆర్‌ తయారు చేశారు. ఇటీవలే రాష్ట్ర కేబినెట్‌ మెట్రోకి ఆమోదముద్ర వేయడంతో ప్రభుత్వం అధికారికంగా జీవోని విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ పంపించి 40 శాతం నిధులు ఇవ్వాలని కోరేందుకు సిద్ధమైంది. 

కనీస పరిజ్ఞానం లేకుండా..
విశాఖ నుంచి హెచ్‌ఎస్‌బీసీ వెళ్లిపోయిందంటూ ఈనాడు కథనాలు ప్రచురించింది. వాస్తవానికి 2017లో కంపెనీలో భారీగా అవకతవకలు జరగడంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు 2018లోనే హెచ్‌ఎస్‌బీసీ ప్రకటించింది. ఇందులో భాగంగా 3,500 మందితో నిర్వహిస్తున్న విశాఖతో పాటు చెన్నై, కోల్‌కతాలో సంస్థ కార్యాలయాలను మూసివేసింది. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తూ విషం చిమ్మడంపై ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇదే భవనంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ప్రపంచ స్థాయి బీపీఎం సంస్థ డబ్ల్యూఎన్‌ఎస్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ 3,500 మందితో కార్యకలాపాలను  ప్రారంభించింది. 

నాడు ఉత్తుత్తి భూమి పూజ
చంద్రబాబు హయాంలో భూ కేటాయింపుల జీవోలు ఇవ్వకుండా అదానీ డేటా సెంటర్‌కు ఉత్తుత్తి భూమి పూజ నిర్వహించారు. నాడు కాగితాల్లో ఉన్న అదానీ ప్రాజెక్టుకు సీఎం జగన్‌ ప్రభుత్వం కార్యరూ­పమిచ్చింది. ఒప్పందాలు, అధికారిక జీవోలు జారీ చేసి వారికి ఇవ్వాల్సిన రాయితీలు, ప్రభుత్వానికి రావాల్సిన వ్యవహారాలకు సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతే అదానీ డేటా సెంటర్‌కు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. 

ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌
దివంగత వైఎస్సార్‌ హయాంలో విశాఖ ఐటీ హబ్‌గా వెలుగొందగా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పాతాళానికి తొక్కేసింది. విశాఖను బీచ్‌ ఐటీ కారిడార్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీనిచ్చింది. ఫలితంగా ప్రధాన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ తన డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను విశాఖలో నెలకొల్పింది. ఇన్ఫోసిస్‌కు అవసరమైన స్థలాన్ని కేటాయించడంతో పాటు రోడ్లను అభివృద్ధి చేశారు.

టీడీపీ హయాంలో కాగితాల్లోనే ఐటీ కంపెనీలు ఉండగా వైఎస్సార్‌సీపీ వచ్చాక ఇన్ఫోసిస్, టెక్‌ మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, మేజాన్‌తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలన్నీ విశాఖవైపు అడుగులు వేశాయి. రుషికొండ ఐటీ సెజ్‌ హిల్‌ నెంబర్‌–2లో ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. తొలి విడతలో 1,000 మందితో ఇన్ఫోసిస్‌ ఐటీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దివంగత వైఎస్సార్‌ హయాంలో విశాఖ వైపు అడుగులు వేసిన విప్రో తన కార్యకలాపాలను విస్తరించింది. వీటితో పాటు మిగిలిన ప్రధాన ఐటీ కంపెనీలన్నీ విశాఖ తరలి వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

దక్షిణాదిలో అతిపెద్ద ఇనార్బిట్‌మాల్‌..
లూలూను వెళ్లగొట్టారంటూ విష ప్రచారం చేస్తున్న దుష్ట చతుష్టయానికి విశాఖలో నిర్మితమవుతున్న దక్షిణాదిలోనే అతి పెద్దదైన ఇనార్బిట్‌ మాల్‌ కనపడలేదా? రూ.600 కోట్లతో 13 ఎకరాల్లో విశాలంగా నిర్మిస్తున్న ఇనార్బిట్‌మాల్‌ ద్వారా 8 వేల మందికి ఉపాధి లభిస్తుంది. రెండో దశలో 3 వేల మంది పనిచేసే విధంగా 2.5 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో ఐటీ క్యాంపస్‌ని కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తారు. గతేడాది జూలైలో సీఎం జగన్‌ ఇనార్బిట్‌ మాల్‌కు శంకుస్థాపన చేశారు. ఇదే సమయంలో రహేజా గ్రూప్స్‌ ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రశంసిస్తూ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.

పార్కింగ్‌ కష్టాలకు విముక్తి 
వ్యాపార కూడలి జగదాంబ జంక్షన్‌లో పార్కింగ్‌ కష్టాల నుంచి వాహనదారుల్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం మల్టీలెవల్‌ కార్‌పార్కింగ్‌ ప్రాజెక్టుని పట్టాలెక్కించింది. రూ.11.45 కోట్లతో దేశంలోనే తొలి మెకనైజ్డ్‌ ఆటోమేటిక్‌ పార్కింగ్‌ నిర్మాణాన్ని పూర్తి చేసింది. మొత్తం 100 కార్లు పార్క్‌ చేసేలా సీఎం జగన్‌ 2022లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో మరో మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ కూడా సిద్ధమవుతోంది. వీఎంఆర్‌డీఏ ఉద్యోగ భవన్‌ ఎదురుగా ఎంఎల్‌సీపీతో పాటు వాణిజ్య సముదాయ భవన నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. రూ.67.57 కోట్లతో ఏడు ఫ్లోర్లలో ఈ బిల్డింగ్‌ నిర్మితమవుతోంది. మూడు సెల్లార్‌ పార్కింగ్‌లు, గ్రౌండ్‌ ఫ్లోర్‌ని వాణిజ్య అవసరాలకు వినియోగించనున్నారు. 

పర్యాటకం జోరు..
అందాల విశాఖలో పర్యాటకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. జిల్లా పర్యాటక సంస్థ నిధులను విశాఖ ఉత్సవ్‌ పేరుతో దోచేసింది. వైఎస్సార్‌ సీపీ వచ్చాక 2023లో పర్యాటకుల సంఖ్య కోటిన్నర దాటింది. ఒబెరాయ్, తాజ్, ఇనార్బిట్‌మాల్, టర్బో ఏవియేషన్‌ లాంటి వాటిని విశాఖ జిల్లాలో నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు మొగ్గు చూపారు. ఆ పనులు జోరుగా సాగుతున్నాయి. బీచ్‌ రోడ్డులో సమీకృత మ్యూజియంగా సీ హారియర్‌ని అందుబాటులోకి తెచ్చారు. కైలాసగిరిపై రూ.6 కోట్లతో అడ్వాన్స్‌డ్‌ సైన్స్, టెక్నాలజీ మ్యూజియం నిర్మాణానికి  శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు 11 బీచ్‌లలో మౌలిక సౌకర్యాలు కల్పించడంతో యారాడ నుంచి భీమిలి వరకూ బీచ్‌లన్నీ పర్యాటకులతో కళకళతలాడుతున్నాయి. 

రెట్టింపు అభివృద్ధి...
జీవీఎంసీ పరిధిలో టీడీపీ హయాంలో మొత్తం 4,450 పనులకుగానూ రూ.1,450 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి ఇప్పటివరకు 9,920 పనులను చేపట్టి రూ.2,490 కోట్ల మేర వ్యయం చేశారు. వీటితో పాటు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకుగానూ మరో రూ.66 కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారు. ఇలా గత నాలుగున్నరేళ్లలో జీవీఎంసీ పరిధిలో ఏకంగా రూ.2,556 కోట్ల మేర నిధులను ఖర్చు చేసి నగరంలో రోడ్లు, పార్కులు, జంక్షన్లు, డ్రైన్లు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. ఫలితంగా గత ఐదేళ్లలో నగర రూపురేఖలు మారిపోయాయి.  

Advertisement
Advertisement