దేశ భద్రతకు‘పంచ’ కవచాలు | Sakshi
Sakshi News home page

దేశ భద్రతకు‘పంచ’ కవచాలు

Published Sun, Aug 27 2023 4:16 AM

Defence Ministry inks Rs 19K crore contract with Hindustan Shipyard for 5 fleet support ships - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:  ఇప్పటి వరకు షిప్‌ రిపేర్‌ హబ్‌గా మాత్రమే కొనసాగుతున్న విశాఖపట్నం హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌.. త్వరలోనే షిప్‌ బిల్డింగ్‌ హబ్‌గా అత్యుత్తమ సేవలందించేందుకు అడుగులు ముందుకు వేస్తున్నది. దేశీయ నౌకల తయారీపై దృష్టి సారించిన షిప్‌యార్డ్‌ అందుకోసం భారత నౌకాదళంతో కీలక ఒప్పందాలపై సంతకం చేసింది.

ఈ క్రమంలో రూ.19,048 కోట్లతో 5 భారీ యుద్ధ నౌకల నిర్మాణ పనుల్ని దక్కించుకుంది. దేశ చరిత్రలో ఏ షిప్‌యార్డ్‌ నిర్మించని విధంగా ఏకంగా 44 వేల టన్నుల షిప్స్‌ని నిర్మించనున్న హెచ్‌ఎస్‌ఎల్‌... 2027 ఆగస్ట్‌లో తొలి యుద్ధనౌకని ఇండియన్‌ నేవీకి అప్పగించనుంది. యుద్ధ విన్యాసాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించేలా షిప్‌ డిజైన్లతో పాటు.. రక్షణ వ్యవస్థలోనే కాకుండా.. విపత్తు నిర్వహణకు వినియోగించేలా షిప్‌లను తయారు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.

సింధుకీర్తి సబ్‌మెరైన్‌ మరమ్మతుల విషయంలో హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ అపవాదు మూటకట్టుకుని.. తొమ్మిదేళ్లకు పూర్తి చేయడంతో షిప్‌యార్డ్డ్‌ పనైపోయిందని అంతా అనుకున్నారు. అయితే, ఐఎన్‌ఎస్‌ సింధువీర్‌ మరమ్మతుల్ని అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసి ఆ మరకని తుడిచేసుకున్న షిప్‌యార్డ్‌.. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు.

ఎలాంటి నౌకలు, సబ్‌మెరైన్ల మరమ్మతులైనా రికార్డు సమయంలో పూర్తి చేస్తూ.. ఆయా సంస్థలకు అప్పగిస్తున్న హెచ్‌ఎస్‌ఎల్‌.. ఇప్పుడు ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. ఐదేళ్ల కాలంలో ఏకంగా 14 ప్రాజెక్టుల్ని పూర్తి చేసి ఆర్డర్ల పెండెన్సీ గణనీయంగా తగ్గించుకుంది. 40 నౌకల రీఫిట్‌ పనుల్ని ఐదేళ్ల కాలంలో పూర్తి చేసి ఔరా అనిపించుకుంది. మొత్తంగా హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌  పనితీరుతో విశాఖ.. షిప్‌ బిల్డింగ్‌ కేంద్రంగా మారుతోంది. 

రూ.19 వేల కోట్లు.. 5 ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్స్‌..
2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,038 కోట్ల టర్నోవర్‌ సాధించిన షిప్‌యార్డ్‌ .. ఈ ఏడాది ఏకంగా రూ.19,048 కోట్ల పనులకు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేసింది. ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి సన్నద్ధమవుతోంది.

ఐదు ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్స్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌)ను భారత నౌకాదళం, కోస్ట్‌గార్డు కోసం తయారు చేసేందుకు శుక్రవారం భారత రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది.హైవాల్యూస్‌తో ఈ నౌకల నిర్మాణాలు చేపట్టనుంది. దేశంలోని ఏ షిప్‌యార్డ్‌లోనూ లేనివిధంగా ఏకంగా 44 మిలియన్‌ టన్నుల డిస్‌ప్లేస్‌మెంట్‌ సామర్థ్యమున్న నౌకల్ని తయారు చేయనుంది.

ఈ నౌకల నిర్మాణాలతో 2023–24 నుంచి హెచ్‌ఎస్‌ఎల్‌ వార్షిక టర్నోవర్‌ గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం రూ.1,038 కోట్ల వార్షిక టర్నోవర్‌ ఉన్న íషిప్‌యార్డ్‌ .. వచ్చే ఐదేళ్లలో రూ.1,500 నుంచి 2 వేల కోట్ల రూపాయలకు చేరుకోనుంది. 8 సంవత్సరాల కాల పరిమితితో ఈ షిప్స్‌ని తయారు చేయనుంది. తొలి షిప్‌ని 2027 ఆగస్ట్‌ 24న భారత నౌకాదళానికి అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకుంది. 

మూడేళ్లలో మరింత అభివృద్ధి..
పెరుగుతున్న ఒప్పందాలకు అనుగుణంగా.. షిప్‌యార్డ్‌ను ఆధునికీకరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రూ.1,000 కోట్లతో యార్డుని రానున్న మూడేళ్లలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం స్లిప్‌వేలు 190 మీటర్లుండగా వీటిని 230 మీటర్లకు పెంచనున్నారు. ఆర్డర్లు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్య కూడా పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా మరమ్మతులు, నౌకా నిర్మాణాలకు అనుగుణంగా రూ.5 వేల కోట్లతో మెటీరియల్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన 364 వెండార్‌ బేస్డ్‌ ఎంఎస్‌ఎంఈల సహకారం తీసుకుంటున్నారు.  

లక్షల మందికి ఉపాధి 
టెండర్లు దక్కించుకోవడంలో దూకుడు పెంచాం. తాజాగా 50 టన్స్‌ బొలార్డ్‌ పుల్‌ టగ్‌ బాల్‌రాజ్‌ మరమ్మతులు పూర్తి చేసి నేవల్‌ డాక్‌యార్డు (విశాఖపట్నం)కు అందించాం. అందుకే.. ఆర్డర్లు కూడా పెద్ద ఎత్తున సొంతం చేసుకుంటున్నాం. రక్షణ మంత్రిత్వ శాఖతో కుదుర్చుకున్న ఒప్పందం.. షిప్‌యార్డ్‌ భవిష్యత్తుని మార్చబోతోంది. ఈ ఎంవోయూ ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.

విశాఖ భవిష్యత్తు కూడా మారబోతుంది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా.. మేక్‌ ఇన్‌ ఇండియాని చాటిచెప్పేలా షిప్స్‌ తయారు చేస్తాం. దేశీయ నౌకల నిర్మాణంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలపైనా దృష్టి సారించాం. సబ్‌మెరైన్ల నిర్మాణం, రీఫిట్‌కు సంబంధించిన సామర్థ్యం, మౌలిక సదుపాయాల కల్పనతో మరింత ఆధునికీకరించుకునేందుకు రష్యాతోనూ సమగ్ర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం.
– కమోడోర్‌ హేమంత్‌ ఖత్రి, హిందుస్థాన్‌ షిప్‌యార్డు సీఎండీ

Advertisement
 
Advertisement