పేరుకే పాలనా సౌలభ్యం.. అంతా వసూళ్ల పర్వం! | Corruption in government departments Under Chandrababu Govt | Sakshi
Sakshi News home page

పేరుకే పాలనా సౌలభ్యం.. అంతా వసూళ్ల పర్వం!

Jun 15 2026 3:08 AM | Updated on Jun 15 2026 3:08 AM

Corruption in government departments Under Chandrababu Govt

సాధారణ బదిలీలపై నిషేధం ఉన్నా... ఔషధ నియంత్రణ విభాగంలో కదులుతున్న ఫైల్‌ 

3 ఏళ్లు సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారిని బదిలీ చేయడానికి రంగం సిద్ధం 

30 మంది డీఐలు, ఏడుగురు ఏడీల బదిలీకి సన్నాహాలు 

పరిపాలన సౌలభ్యం అంటూ ఉన్నతాధికారుల వాదన 

ప్రాంతాన్ని బట్టి పోస్టింగ్‌కు రేటు  

సాక్షి, అమరావతి: బాబు పాలనలో ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఉద్యోగులు, అధికారుల బదిలీల్లోనూ అవినీతి కంపు కొడుతోంది. ఈ పరంపరలో వైద్య, ఆరోగ్య శాఖలోని ఔషధ నియంత్రణ విభాగంలో బదిలీల పేరిట భారీ దందాకు తెరలేపారు. సాధారణ బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో కూడా పరిపాలన సౌలభ్యం ముసుగు తొడిగి ఏకంగా 30 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌లు(డీఐ), ఏడుగురు అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ)లకు స్థాన చలనం కల్పించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఒకే స్థానంలో మూడేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  

ప్రాంతాన్ని బట్టి రేటు 
మూడేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయడానికి రాష్ట్ర డ్రగ్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌ గత వారమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీఐల్లో 70 శాతం మందిని, ఏడీల్లో సగం మంది బదిలీ చేసేలా రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఫార్మా కార్యకలాపాలు ఎక్కువగా ఉండే ఉమ్మడి విశాఖ, తూర్పు గోదావరి, నెల్లూరు, గుంటూరు అదే విధంగా హోల్‌సేల్, రిటైల్‌ షాపులు అధికంగా ఉండే ప్రాంతాలను పలు కేటగిరీలుగా విభజించి వసూళ్ల దందా నడిచిందని ఆ విభాగంలో చర్చనడుస్తోంది.

స్థానాన్ని బట్టి ఒక్కో డీఐ నుంచి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు, ఏడీ నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మేర చేతులు మారేలా డీల్స్‌ నడిచాయని ఔషధ నియంత్రణ విభాగం వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా కీలక ఉన్నతాధికారి ఆకస్మిక బదిలీతో కోరుకున్న చోట పోస్టింగ్‌ దక్కుతుందా లేదోనని  ఇప్పటికే డీల్స్‌ కుదుర్చుకున్న డీఐలు, ఏడీలు ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది.  

అడ్డగోలు నిర్ణయాలు 
మరోవైపు కొద్ది నెలలుగా ఈ విభాగంలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నట్టు విమర్శలున్నాయి. ఏసీబీకి పట్టుబడిన ఒకరికి ని­బంధనలకు విరుద్ధంగా వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చా­రు. నిబంధనల ప్రకారం ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులకు తిరిగి పోస్టింగ్‌ ఇవ్వాలంటే విజిలెన్స్‌ కమిషన్‌ అనుమతి తీసుకోవాలి. అయితే ఈ ప్రక్రియ ఏమీ లేకుండానే నేరుగా ఓ అధికారికి పోస్టింగ్‌ ఇచ్చారు. దీనిపై ఏసీబీ అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు అవినీతి ఆరోపణలపై సస్పెండ్‌ అయిన డీఐను అనతికాలంలోనే కీలక స్థా­నంలో వర్క్‌ ఆర్డర్‌పై నియమించారు. ఇలా వర్క్‌ఆర్డర్‌ల రూపంలోనూ పెద్ద మొత్తంలో చేతులు మారినట్టు ప్రచారం సాగుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement