బరితెగించిన ‘భాష్యం’! | Sakshi
Sakshi News home page

బరితెగించిన ‘భాష్యం’!

Published Wed, Apr 10 2024 4:58 AM

Corporate schools harassment continues in Anantapur - Sakshi

విద్యార్థులను ఫీజుల కోసం వేధిస్తున్న యాజమాన్యం 

భాష్యం విద్యా సంస్థల అధినేత ప్రవీణ్‌ టీడీపీ తరఫున పోటీ

ఈ నేపథ్యంలో ఖర్చులు ఉన్నాయంటూ ఒత్తిళ్లు 

‘అనంత’లో రోజంతా ఓ గదిలో 50 మంది విద్యార్థుల నిర్బంధం 

విద్యా సంవత్సరం ముగిసేలోపు చెల్లిస్తామని తల్లిదండ్రులు చెప్పినా వినని వైనం  

ఫీజులు చెల్లిస్తేనే పిల్లలను బడికి పంపాలంటూ హుకుం 

ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన

అనంతపురం ఎడ్యుకేషన్‌: ‘భాష్యం’ విద్యా సంస్థలు బరితెగించాయి. ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భాష్యం విద్యా సంస్థలకు బ్రాంచ్‌­లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి భాష్యం విద్యా సంస్థల అధినేత ప్రవీణ్‌ టీడీపీ తరఫున పోటీ చేస్తు­న్నారు. దీంతో ఎన్నికల ఖర్చుల కోసమంటూ ఆ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను వేధిస్తున్నారు. విద్యా సంవత్సరం ముగిసేలోగా ఫీజులు చెల్లిస్తామని విద్యార్థుల తల్లిదండ్రు­లు చెబుతున్నా భాష్యం యాజమాన్యం పట్టించుకోవడం లేదు.

ఫీజులు చెల్లి­స్తేనే బడి­కి పంపాలంటూ హుకుం జారీ చేస్తోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో భాష్యం స్కూల్‌ ఉంది. అధినేత ఎన్నికల ఖర్చులకు డబ్బులు అవసరమని పై నుంచి ఆదేశాలు రావడంతో ఫీజుల కోసం సిబ్బంది విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఫీజు చెల్లిస్తేనే మీ పిల్లలను బడికి పంపండి.. లేకుంటే పంపొద్దు అని తల్లిదండ్రులకు కరాఖండీగా చెప్పేస్తున్నా­రు. ఈ నెల ఆరో తేదీన 1–9 తరగతుల విద్యార్థుల­కు వార్షిక పరీక్షలు ప్రారంభమ­య్యా­యి. ఈ పరీక్షల ప్రారంభానికి ముందు ఫీజు చెల్లించిన వారినే పరీక్షలకు అను­మతిస్తామని భాష్యం యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో చాలామంది తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఫీజు మొత్తాన్ని చెల్లించారు. ఉన్నట్టుండి ఒత్తిడి చేయడంతో మరికొంతమంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోజంతా పిల్లల నిర్బంధం 
పూర్తి ఫీజు చెల్లించలేదనే నెపంతో పది రోజుల క్రితం అనంతపురం భాష్యం స్కూల్‌లో దాదాపు 50 మంది విద్యార్థులను రోజంతా సిబ్బంది ఒక గదిలో నిర్బంధించారు.  తరగతుల్లో కూర్చోబెట్టకుండా వారందరినీ ఒక గదిలో కూర్చోబెట్టారు. అదికూడా బెంచీలపై కాకుండా నేలపై కూర్చోబెట్టి ఇబ్బందులకు గురి చేశారు. సాయంత్రం పాఠశాల సమయం ముగిశాక వారిని ఇళ్లకు పంపడంతో విద్యా­ర్థులు తమ తల్లిదండ్రులతో గోడు చెప్పుకున్నారు. దీంతో మరుసటి రోజు పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు.. ప్రిన్సి­పాల్, ఉపాధ్యాయులను నిలదీశారు.

పాఠ­శాల ఇన్‌చార్జ్‌ అనిల్‌కుమార్‌ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ యాజమాన్యం నుంచి తమకు తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉందని, తామేమీ చేయలేమని విద్యార్థుల తల్లిదండ్రులకు తేలి్చచెప్పారు. ఎవరితోనైనా చెప్పుకోండి.. ముందు ఫీజు కట్టండని చెప్పడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు తిరగబడ్డా­రు. సమస్య పెద్దదయ్యే పరిస్థితి కనిపించడంతో కాస్త వెనక్కి తగ్గి ఈ నెల 12లోపు అందరూ ఫీజు చెల్లించాలని తల్లిదండ్రులకు పాఠశాల ప్రిన్సిపాల్‌ సూచించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలు­గు­చూసింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపడితే భాష్యం పాఠశాలల యాజమాన్యం చేస్తున్న అరాచకా­లు మరిన్ని వెలుగులోకి వస్తాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement