వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే | CM YS Jagan Aerial Survey In Flood Affected Areas | Sakshi
Sakshi News home page

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

Nov 20 2021 9:59 AM | Updated on Nov 20 2021 5:01 PM

CM YS Jagan Aerial Survey In Flood Affected Areas - Sakshi

వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, ఆ తర్వాత వరదలకు గురైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

సాక్షి, కడప-తిరుపతి: వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, ఆ తర్వాత వరదలకు గురైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన  నేవీ సిబ్బందిని కలుసుకున్నారు. జిల్లాలో వరద పరిస్థితులపై స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లతో మాట్లాడారు. తర్వాత హెలికాప్టర్‌ ద్వారా బుగ్గవంక వాగు కారణంగా కడపలో ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌ సర్వే చేశారు.

చదవండి: ఏపీకి జాతీయ స్థాయిలో అవార్డుల పంట‌


భారీ వర్షాలతో పొంగి పొర్లుతున్న పాపాఘ్ని, పెన్నా నదుల కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌సర్వే నిర్వహించారు.  ఆ తర్వాత వెలిగల్లు, తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు. ముంపునకు గురైన గ్రామాల్లో ఏరియల్‌ సర్వే చేశారు. పింఛ ప్రాజెక్టుతో పాటు, చెయ్యేరు నది కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను, ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌ సర్వే చేశారు. తర్వాత రేణిగుంట, తిరుపతి టౌన్, పేరూరు ప్రాజెక్టు, స్వర్ణముఖీ నదీ ప్రాంతాల్లోను సీఎం ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. తర్వాత రేణిగుంట ఎయిర్‌పోర్టులో అధికారులతోనూ, ప్రజా ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా తిరుపతి టౌన్‌లో వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వివిధ మున్సిపాల్టీల నుంచి ఇప్పటికే 500 మంది సిబ్బందిని రప్పించామని అధికారులు వివరించారు. 

వీధుల్లో, డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. తిరుపతిలో డ్రైనేజి వ్యవస్థపై మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద నీరు తగ్గగానే పంట నష్టంపై అంచనాలు వెంటనే రూపొందించి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక శిబిరాలకు రాకున్నా.. ముంపునకు గురైన ఇళ్లకు వెంటనే ఆర్థిక సహాయం చేయాలని, వాళ్లు తిరిగి ఇంటికి వెళ్లే సందర్భంలో అధికారులు, యంత్రాంగం వారికి తోడుగా నిలవాలని సీఎం ఆదేశించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement