స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏపీకి అవార్డుల పంట

Ap Receives National Level Swachh Bharat Award By President - Sakshi

దేశంలోని టాప్‌–10 పరిశుభ్ర నగరాల్లో విజయవాడ, విశాఖ

దక్షిణాదిలో ఏకైక రాష్ట్రంగా ఏపీ ఘనత 

చెత్తరహిత నగరాల విభాగంలో విజయవాడకు 

5 స్టార్, విశాఖకు 3 స్టార్‌ రేటింగ్‌

సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో ఏపీ మరోసారి సత్తా చాటింది. స్వచ్ఛ సర్వేక్షన్‌–2021 వివిధ విభాగాల్లో రాష్ట్రానికి 11 అవార్డులు దక్కాయి. పట్టణ, నగర ప్రాంత ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంలో భాగంగా పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’ (క్లాప్‌) వంటి కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ నేపథ్యంలో గత ఏడాది స్వచ్ఛ సర్వేక్షన్‌ కింద రాష్టానికి ఆరు అవార్డులు వస్తే ఈసారి ఆ సంఖ్య 11కు పెరిగింది.  అలాగే, ఈ అంశంలో గత ఏడాది రాష్ట్రం 6వ స్థానంలో ఉంటే ఈ ఏడాది 5వ స్థానంలో నిలిచింది.

ఇక ఈ ఏడాది దేశంలోని పరిశుభ్ర నగరాల ర్యాంకింగ్‌లో విజయవాడకు 3వ ర్యాంక్, విశాఖపట్నానికి 9వ ర్యాంకు దక్కాయి. తొలిస్థానంలో ఇండోర్, రెండో స్థానంలో సూరత్‌ నిలిచాయి. ఈ విభాగంలో టాప్‌–10లో నిలిచిన దక్షిణాదికి చెందిన ఏకైక రాష్ట్రంగా కూడా ఏపీ ఘనత సాధించింది. అలాగే, చెత్త రహిత నగరాల విభాగంలో విజయవాడకు 5స్టార్‌ రేటింగ్, విశాఖకు 3స్టార్‌ రేటింగ్‌లు దక్కాయి. 1–3 లక్షల జనాభా విభాగంలో కడప నగరానికి 3స్టార్‌ రేటింగ్‌ వచ్చింది.  

ఏపీకి ప్రత్యేక గుర్తింపు
వాటర్‌ ప్లస్‌ (వ్యర్థ జలాల రీసైక్లింగ్‌) సిటీ విభాగాన్ని ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాలు ఈ గుర్తింపు పొందాయి. ఇలా ఒక రాష్ట్రం నుంచి ఒకటి కంటే ఎక్కువ నగరాలు ఈ గుర్తింపు దక్కించుకున్న ఏపీ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. 

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు
దేశంలోనే 3వ పరిశుభ్ర నగరంగా విజయవాడ గుర్తింపు పొందడంతో ఇందుకు సంబంధించిన అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం ఢిల్లీలో  ప్రదానం చేశారు. విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి. సంపత్‌కుమార్, విజయవాడ కమిషనర్‌ ప్రసన్న వెంకటేశ్, సీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జి. గీతాబాయి రాష్ట్రపతి నుంచి ఈ అవార్డు అందుకున్నారు. 

రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాలకు అందిన అవార్డులు..
► సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్‌లో 1–10 లక్షల జనాభా విభాగంలో నెల్లూరు కార్పొరేషన్‌కు మొదటి ర్యాంక్‌ లభించింది. 
► 1–3 లక్షల విభాగంలో తిరుపతికి 3వ ర్యాంక్‌ వచ్చింది.
► పుంగనూరు, తాడేపల్లి, పలమనేరు పట్టణాలను చెత్త రహిత నగరాల్లో 1 స్టార్‌ రేటింగ్‌ పొందాయి. 
► సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ 10–40 లక్షల విభాగంలో విశాఖపట్నంకు, 1–3 లక్షల జనాభా విభాగంలో తిరుపతికి ఉత్తమ నగరాల అవార్డు లభించింది.
► సౌత్‌జోన్‌లో సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ 50వేల నుంచి ఒక లక్ష జనాభా విభాగంలో పుంగనూరు పట్టణానికి అవార్డు వచ్చింది. 
► సౌత్‌జోన్‌లో ఇన్నోవేషన్‌ అండ్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ 50వేల నుంచి ఒక లక్ష విభాగంలో పిఠాపురం మున్సిపాలిటీకి అవార్డు దక్కింది. 
► మంత్రిత్వ శాఖ కొత్తగా ప్రారంభించిన ప్రేరక్‌ దౌర్‌లో తిరుపతికి ప్లాటినం, విజయవాడ, రాజమండ్రిలకు స్వర్ణం, కడప, కర్నూలు, మదనపల్లికి రజతం.. విశాఖ, కాకినాడ, కందుకూరు, సత్తెనపల్లి మున్సిపాలిటీలకు కాంస్యం అవార్డులు దక్కాయి.  

చదవండి: ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. ‘స్మార్ట్‌’ బిల్లు నెలకు 194 కోట్లు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top