మదనపల్లె ఫైల్స్‌ దగ్ధం కేసులో సీఐడీకి చుక్కెదురు | CID court rejects Madhav Reddy remand | Sakshi
Sakshi News home page

మదనపల్లె ఫైల్స్‌ దగ్ధం కేసులో సీఐడీకి చుక్కెదురు

Apr 26 2025 4:24 AM | Updated on Apr 26 2025 1:33 PM

CID court rejects Madhav Reddy remand

మాధవరెడ్డి రిమాండ్‌ను తిరస్కరించిన సీఐడీ కోర్టు

సరైన సపోర్టింగ్‌ డాక్యుమెంట్లు కావాలన్న న్యాయస్థానం

హైకోర్టు తొందరపాటు చర్యలొద్దన్నా పోలీసుల అత్యుత్సాహం

ఎలాగైనా సరే రిమాండ్‌కు పంపడానికి మళ్లీ కసరత్తు

చిత్తూరు అర్బన్‌: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను పూర్తి రాజకీయ కక్షపూరిత కేసుగా మార్చిన సీఐడీ పోలీసులకు శుక్రవారం చుక్కెదురైంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త మాధవరెడ్డిని గురువారం రాత్రి అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు..జు్యడీషియల్‌ రిమాండ్‌ కోసం శుక్రవారం చిత్తూరు నగరంలోని సీఐడీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా కోర్టు అంగీకరించలేదు. 

డిఫెన్స్‌ న్యాయవాదులు లోకనాథరెడ్డి, సురేష్‌రెడ్డి, ప్రకాష్‌ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గత ఏడాది జూలై 21న అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడం.. దీన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఆపాదిస్తూ కార్యాలయాన్ని కాల్చేశారంటూ కూటమి ప్రభుత్వం కుట్ర పన్ని కక్ష సాధింపు చర్యలకు దిగడం తెలిసిందే. పారిశ్రామికవేత్త మాధవరెడ్డిపై పలు సెక్షన్ల కింద అక్రమ కేసులు నమోదు చేశారు. తనకు ఈ కేసుతో సంబంధం లేదని ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. తొందరపాటు చర్యలు వద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 

అయితే గురువారం రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లులో ఉన్న మాధవరెడ్డిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారు. శుక్రవారం సాయంత్రం చిత్తూరు నగరంలోని సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టి.. జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ఆదేశించాలని న్యాయమూర్తిని కోరారు. హైకోర్టు తొందరపాటు చర్యలు వద్దని చెప్పినప్పుడు మాధవరెడ్డిపై సీఐడీ పోలీసులు ఏడేళ్ల లోపు శిక్షపడే సెక్షన్లు నమోదు చేశారని, తాజాగా జీవిత ఖైదు పడే సెక్షన్‌ 338తో పాటు బీఎస్‌ఎన్‌–111 సెక్షన్‌ను సైతం ఉద్దేశ పూర్వకంగా పెట్టారని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. 

ఇది హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని చెప్పారు. కొత్తగా నమోదు చేసిన సెక్షన్లు మాధవరెడ్డికి వర్తిస్తాయని సీఐడీ పోలీసులు చెప్పడంతో, అందుకు సంబంధించిన సపోర్టింగ్‌ డాక్యుమెంట్లు న్యాయస్థానం ఎదుట ఉంచాలని మేజిస్ట్రేట్‌ బాబాజాన్‌ తెలిపారు. సరైన ఆధారాలు లేకుండా రిమాండ్‌కు ఆదేశించలేమని స్పష్టం చేశారు. దీంతో ఏం చేయాలో తెలియని సీఐడీ పోలీసులు, మాధవరెడ్డిని కోర్టు నుంచి తీసుకెళ్లిపోయారు. కాగా, రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేసి తీరాల్సిందేనన్న కూటమి నేతల ఆదేశాలతో రాత్రికి రాత్రే కొన్ని పత్రాలు సిద్ధం చేసి.. తిరిగి కోర్టులో ప్రవేశపెట్టే పనిలో సీఐడీ పోలీసులు ఉన్నట్లు తెలిసింది.  

Advertisement
 
Advertisement
Advertisement