● మున్సిపల్ ఎన్నికల వేళ ‘వార్డుల’ హడావుడి!
● మదనపల్లె, పుంగనూరు వార్డుల పునర్విభజనకు ప్రభుత్వం ఆమోదం
సాక్షి మదనపల్లె : జిల్లాలో స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే ప్రక్రి యలో వేగం పెరగడంతో పుర రాజకీయం ఒక్కసారిగా హీటెక్కుతోంది. ఈ ఏడాది అక్టోబర్ లోగా మున్సిపల్ చైర్మన్లకు ‘ప్రత్యక్ష ఎన్నికలు’ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆశావహులు ముందస్తు వ్యూహాల్లో మునిగిపోయారు. గత జనవరిలో సర్పంచ్‌లు, మార్చిలో మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్ల పదవీ కాలం ముగియడంతో ప్రస్తు తం ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు మొదలుకావడంతో జిల్లా మున్సిపాలిటీల్లో తాజా సమీకరణలు ఊపందుకున్నాయి.
‘ప్రత్యక్షం’తో రసవత్తరం.. మారనున్న సమీకరణలు
2005 నుంచి మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ పరోక్ష పద్ధతిలో సాగుతూ వచ్చింది. కౌన్సిలర్లు అంతా కలిసి చైర్మన్‌ను ఎన్నుకునే విధానం అమలైంది. అయితే ఇప్పుడు తిరిగి పాత పద్ధతిలో ‘ప్రత్యక్ష ఎన్నిక’ (ప్రజలే నేరుగా చైర్మన్‌ను ఎన్నుకోవడం) విధానంపై స్పష్టత రావడంతో పుర రాజకీయం మరింత రసవత్తరం కానుంది. ఇకపై వార్డు కౌన్సిలర్ అభ్యర్థితో పాటు, చైర్మన్ అభ్యర్థులు కూడా నేరుగా ప్రజల్లోకి వెళ్లి తీవ్ర స్థాయిలో శ్రమించాల్సి ఉంటుంది. అభ్యర్థి వ్యక్తిగత సమర్థత, విద్య, ప్రజల్లో ఉన్న ప్రజాదరణ గెలుపోటములను శాసించనున్నాయి. ఇలా ప్రత్యక్ష పద్ధతిలో గెలిచిన చైర్మన్లకు అవిశ్వాస తీర్మానం లాంటి బెడద ఉండదు కాబట్టి మున్సిపాలిటీల్లో ఐదేళ్ల పాటు స్థిరమైన పాలన సాధ్యమవుతుంది.
కౌన్సిలర్ అభ్యర్థులకు కష్టాలు
మున్సిపాలిటీల్లో కౌన్సిల్ పదవులకు పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నడూ ఊహించని సరికొత్త కష్టాలు ఎదురుకానున్నాయి. వార్డుల పునర్విభజన తీవ్ర గందరగోళానికి దారితీయడమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో ఉన్న వార్డుల పరిధి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మున్సిపాలిటీ విస్తీర్ణంలో ఉత్తర వైపు నుంచి ప్రారంభించి తూర్పు, దక్షిణ, పశ్చిమ దిశలుగా సాగుతూ ఒకటి నుంచి చివరి వార్డు దాకా సరికొత్తగా సరిహద్దులను ఏర్పాటు చేశారు. దీని ఫలితంగా ఎవరి ఓటు ఏ వార్డులో ఉందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏ వార్డు ఓటరు ఏ ప్రాంతంలో ఉన్నాడో గుర్తించి, వారి ఇళ్లను వెతికి పట్టుకుని ప్రచారం చేసుకోవడం కౌన్సిలర్ అభ్యర్థులకు కత్తిమీద సాములా మారింది. మున్సిపాలిటీ పరిధి అంతా ఒకే స్థానంగా పరిగణిస్తారు కాబట్టి చైర్మన్ అభ్యర్థులకు ఈ సమస్య లేదు. వచ్చిన చిక్కల్లా కౌన్సిలర్ అభ్యర్థులకే.
మదనపల్లె, పుంగనూరుకు ఆమోదం.. రాయచోటికి బ్రేక్
మున్సిపాలిటీల్లో గత ఎన్నికల్లో ఉన్న వార్డుల సంఖ్యను జనాభా ప్రాతిపదికన పెంచుతూ ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీల విభజన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
మదనపల్లె మున్సిపాలిటీ : గతంలో 35 వార్డులు ఉండగా, పునర్విభజనతో అవి 48 వార్డులకు పెరిగాయి.
పుంగనూరు మున్సిపాలిటీ:గతంలో 31 వార్డులు ఉండగా, ప్రస్తుతం 36 వార్డులకు పెరిగాయి.
రాయచోటి మున్సిపాలిటీ :
పునర్విభజన ద్వారా ఇక్కడ వార్డుల సంఖ్య 34 నుంచి 44 వార్డులకు చేరింది. అయితే, ఈ వార్డుల విభజనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించడంతో ఇక్కడి ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపకుండా బ్రేక్ వేసింది.
బి.కొత్తకోట నగర పంచాయతీ : దీని ఏర్పాటుపైనే స్థానికులు హైకోర్టును ఆశ్రయించడంతో సుదీర్ఘకాలంగా వాజ్యం నడుస్తోంది. మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు ఇక్కడ 18 వార్డులు ఉండగా, నగర పంచాయతీ అయ్యాక పునర్విభజనతో 20 వార్డులు ఏర్పడ్డాయి. కోర్టు కేసుల కారణంగా తాజాగా పునర్విభజన ప్రక్రియ జరగలేదు. బి.కొత్తకోట నగర పంచాయతీకి సంబంధించిన కేసు విచారణ సెప్టెంబర్ 1న హైకోర్టులో జరగనుంది. ఈ విచారణలో కోర్టు కేసు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.


