‘సీమ’ వెలవెల..
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తాగునీటి ముసుగులో విద్యుత్ ఉత్పాదన ద్వారా శ్రీశైలం నీటిని నాగార్జున సాగర్‌కు తరలిస్తుండటం పట్ల రాయలసీమ వాసులు, రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎల్‌నినో కారణంగా ఈ యేడు తీవ్ర అనావృష్టి పరిస్థితులు ఏర్పడి, ఖరీఫ్ సాధారణ పంటల సాగు దారుణంగా పడిపోయింది. రిజర్వాయర్ల నీటిమట్టాలు వేగంగా అడుగంటుతుండగా, భూగర్భ జలాలు పాతాళానికి చేరువయ్యాయి. ఇప్పటికే సీమలోని వందలాది గ్రామాలు దాహార్తితో అలమటిస్తున్నాయి. ఈ తరుణంలో ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున వరద ప్రవాహం రావడంతో రాయలసీమ ప్రజల్లో ఆశలు చిగురించాయి. అయితే, ఖరీఫ్ పంటల సాగుకు నీరివ్వలేమని కూటమి ప్రభుత్వం ముందే చేతులెత్తేసింది. కేవలం తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌కు 32 టీఎంసీలు, రాయలసీమ రిజర్వాయర్లకు 20 టీఎంసీలు, చైన్నెకి 10 టీఎంసీలు ఇస్తామని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబరు, నవంబరు మాసాల్లో వచ్చే వర్షాలను బట్టి పరిస్థితులు సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
చెప్పింది ఒకటి.. చేస్తోంది మరొకటి!
రాష్ట్ర జలవనరుల మంత్రి చేసిన అధికారిక ప్రకటనకు విరుద్ధంగా, ఇప్పటికే క్షేత్రస్థాయిలో భారీగా నీటి దోపిడీ జరిగిందని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. గత పది రోజుల పైబడి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన ద్వారా ఇప్పటికే సుమారు 40 టీఎంసీల వరకు నాగార్జున సాగర్‌కు తరలించినట్లు తెలుస్తోంది. సాగర్‌లో ఇప్పటికే తగిన నీటి నిల్వ ఉండడంతో అక్కడ తాగునీటి సమస్య ఉత్పన్నమయ్యే ప్రశ్నే లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ, దిగువ ప్రాంతాలకు ’తాగునీటి మిష’తో శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్నారు. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం జూరాల నుంచి నెట్టెంపాడు, భీమా–1, 2 పథకాలకు ఐదు వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తోంది. తాగునీటి కోసం అంటూ సాగర్‌కు కేటాయించిన నీటిలో దీన్ని లెక్కించడం లేదు. అంటే చెప్పిన దానికన్నా ఆచరణలో అత్యధికంగా నీటిని దిగువకు తోడేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అవుట్‌ఫ్లో పరిశీలిస్తే, మొత్తం 62,848 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఇందులో 51,848 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పాదన పేరిట నాగార్జున సాగర్‌కు వెళుతున్నాయి. జూరాల నుంచి వెళుతున్న ఐదు వేల క్యూసెక్కులు కలిపితే కోస్తా, తెలంగాణ ప్రాంతాలకు ఏకంగా 56,848 క్యూసెక్కుల కృష్ణా నీరు తరలిపోతోంది.
రాయలసీమకు మొండిచేయి..
వట్టిపోతున్న జలాశయాలు
కోస్తా, తెలంగాణ ప్రాంతాలకు ఐదో వంతు కంటే ఎక్కువ నీరు తరలిపోతుంటే, రాయలసీమ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం ఘోరమైన వివక్ష చూపుతోంది. మల్లేల లిఫ్ట్ నుంచి హంద్రీ–నీవా ద్వారా కర్నూలు జిల్లా ఎగువ ప్రాంతాలైన పత్తికొండ, అనంతపురం జిల్లాలకు కేవలం 3 వేల క్యూసెక్కులు మాత్రమే ఇస్తున్నారు. ఇక పోతిరెడ్డిపాడు ద్వారా 8 వేల క్యూసెక్కులు ఇస్తున్నారు. వెరసి రాయలసీమ మొత్తానికి కలిపి కేవలం 11 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలవుతోంది. దీనివల్ల రాయలసీమ రిజర్వాయర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. శ్రీశైలానికి ఇన్‌ఫ్లో పూర్తిగా ఆగిపోయిన ప్రస్తుత స్థితిలో, కనీస నీటిమట్టాన్ని సైతం నిర్వహించకుండా ఉన్న నీటినంతా తోడేస్తే ఇక్కడి తాగు, సాగునీటి అవసరాల మాటేమిటని రాయలసీమ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఈ ప్రాంతానికి చెందిన కూటమి ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు నోరు మెదపకపోవడం పట్ల స్థానిక ప్రజలు, రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న నీరంతా తోడేయకుండా రాయలసీమ తాగునీటి అవసరాలతో పాటు, రాబోయే రబీలో కనీసం ఒక ఆరుతడి పంటకై నా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాగునీటి ముసుగులో శ్రీశైలం ఖాళీ
కూటమి ప్రభుత్వంపై భగ్గుమంటున్న సీమ రైతాంగం
శ్రీశైలంలో తక్షణమే విద్యుత్ ఉత్పాదన ఆపాలని డిమాండ్
875 అడుగుల కనీస నీటిమట్టం నిర్వహించాల్సిందే
అడుగంటిన రాయలసీమ రిజర్వాయర్లు
తాగునీటి ముసుగులో శ్రీశైలం ఖాళీ
కూటమి ప్రభుత్వంపై భగ్గుమంటున్న సీమ రైతాంగం
శ్రీశైలంలో తక్షణమే విద్యుత్ ఉత్పాదన ఆపాలని డిమాండ్
875 అడుగుల కనీస నీటిమట్టం నిర్వహించాల్సిందే
అడుగంటిన రాయలసీమ రిజర్వాయర్లు
అన్ని ప్రాజెక్టులకు తాగు, సాగునీరు విడుదల చేయాలి
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తక్షణమే తాగునీటితో పాటు పంటలకు సాగునీరు విడుదల చేయాలి. ఎల్‌నినో వల్ల ఖరీఫ్ పంటల సాగు దాదాపు పడిపోయింది. రిజర్వాయర్లలో నీటిమట్టాలు అడుగంటిపోతుండటం రాయలసీమ భవిష్యత్తుకు ఆందోళన కలిగిస్తోంది. ఈ కరవు పరిస్థితుల్లో రాయలసీమ రైతులను ఆదుకునేందుకు తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్‌కు తక్షణమే నీటి విడుదల చేసి సీమను ఆదుకోవాలి. – నారుపల్లె జగన్‌మోహన్‌రెడ్డి,
రాష్ట్ర అధ్యక్షులు, అఖిల భారత రెడ్డిసంఘం, దువ్వూరు
శ్రీశైలంలో తక్షణమే విద్యుత్ ఉత్పాదన ఆపాలి
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన చేపట్టి తాగునీటిని తరలిస్తున్నారంటూ చెబుతున్న కూటమి ప్రభుత్వం, ప్రకటించిన కేటాయింపులకు అదనంగా నాగార్జున సాగర్‌కు పంపుతోంది. తెలంగాణ ప్రభుత్వం జూరాల నుంచి ఐదు వేల క్యూసెక్కు లు నీటిని భీమా, నెట్టెంపాడులకు తరలిస్తున్నప్పటికీ మన ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం విచారకరం. శ్రీశైలంలో తక్షణమే విద్యుత్ ఉత్పాదన ఆపి 875 అడుగుల కనీస నీటి మట్టాన్ని నిర్వహించాలి. సీమకు తాగునీటితోపాటు కనీసం రబీలో ఆరుతడి పంటకు నీరిచ్చేందుకు చర్యలు చేపట్టాలి.
– దేవగుడి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, కేసీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్, కడప


