● కేసీ కాలువ కింద నీరొస్తుందనే ఆశతో ముమ్మరంగా నారుమడుల సాగు
● అధికారుల మౌనంతో 81 వేల ఎకరాల ఆయకట్టు రైతుల్లో గుబులు
కడప అగ్రికల్చర్ : కేసీ కెనాల్ (కర్నూలు–కడప కాలువ) పరిధిలో సాగు నీటిపైనే ఆధారపడి దాదాపు 81,232.99 ఎకరాల భారీ ఆయకట్టు విస్తరించి ఉంది. జిల్లాలోని దువ్వూరు, మైదుకూరు, చాపాడు, ఖాజీపేట, కొండపేట, రాజుపాలెం, ప్రొద్దుటూరు, చెన్నూరు, వల్లూరు, కడప, సి.కె.దిన్నె మండలాల పరిధిలోని గ్రామాలు ఈ కాలువ పరిధిలోకి వస్తాయి. ఇటీవల కురిసిన వర్షాలను ఆసరాగా చేసుకుని, చాలా మంది రైతులు తమకున్న బోరు బావుల కింద ముందస్తుగానే ఆరుతడి పంటలైన పసుపు, పత్తి, మొక్కజొన్న, సజ్జ పంటలను సాగు చేశారు. మరికొందరు రైతులు వరి సాగు కోసం నారుమడులను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా మళ్లీ వర్షాలు ముఖం చాటేయడంతో బోర్లలో నీటిమట్టాలు పడిపోతాయేమోనని, వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతింటాయేమోనని ఈ 11 మండలాల అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేసీ కాలువకు నీరు వస్తేనే తమ పంటలు చేతికందుతాయని ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు.


