రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసగిస్తున్న చంద్రబాబు
50 శాతం మించరాదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా మొక్కుబడి డ్రామాలు
చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి చట్టబద్ధత కోసం ప్రయత్నించాలిగా..
బీసీలకు 34శాతం రిజర్వేషన్‌పై జగన్ జీవో ఇచ్చినా అడ్డుపడింది చంద్రబాబే
టీడీపీ నాయకుడితో కోర్టులో కేసు వేయించి బీసీలకు వెన్నుపోటు..
అయినా జగన్ బీసీల తరఫునే ఉండి.. బ్యాక్‌బోన్ క్లాస్‌గా నిలబెట్టారు..
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం కంటే అధికంగా ప్రాతినిధ్యం కల్పించారు
25 మంది మంత్రివర్గంలో 11 మంది బీసీలకు స్థానమిచ్చారు
బీసీ వర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడు, ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం పదవులు
రాజ్యసభకు నలుగురు బీసీలను పంపిన జగన్.. నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం
56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు
సంక్షేమ పథకాల ద్వారా బీసీలకు మొత్తం రూ.1,82,750.71 కోట్ల లబ్ధి
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం 2019లోనే పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ప్రైవేట్ బిల్లు
చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే 2014–19 మధ్య ఒక్క బీసీకైనా రాజ్యసభ అవకాశం ఇచ్చేవారేగా..
మంత్రివర్గంలో, రాజ్యసభకు, ఎమ్మెల్సీ స్థానాలకు బీసీలు పనికిరారా బాబూ..?
చివరకు మేనిఫెస్టో హామీల్లోనూ బీసీలకు చంద్రబాబు వెన్నుపోటే
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి బీసీ రిజర్వేషన్లపై కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఒకవైపు బీసీల ఎదుగుదలను అడ్డుకునే రాజకీయాలు చేస్తూనే వారికోసం తానే అంతా చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం ఆయనకు ‘వెన్నుపోటు’తో పెట్టిన విద్య. బీసీలకు 34శాతం రిజర్వేషన్ కల్పించేస్తున్నామని, అది ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరి నుంచీ రిజర్వేషన్లను లాక్కోవడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాలకు ఇచ్చే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాల హైకోర్టులు కూడా ఇదే విధమైన తీర్పులిస్తున్నాయి. ఈ మధ్యే తెలంగాణ హైకోర్టు కూడా 50శాతం రిజర్వేషన్ దాటరాదంటూ తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే.. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే పార్లమెంటులో చట్టబద్ధత తీసుకురావడమొక్కటే మార్గమని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఇపుడు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వం ఉన్నప్పటికీ అలాంటి చట్టబద్ధత కోసం ప్రయత్నించకుండా తూతూమంత్రంలా 34శాతం రిజర్వేషన్ ప్రకటన చేసేసి చేతులుదులుపుకుంటే ప్రయోజనమేమిటి..? ఇది బీసీలను మరోసారి మోసం చేయడం కాదా? బీసీలను వంచించడంలో పీహెచ్‌డీ చేసిన చంద్రబాబు అందుకోసం ఎంత కష్టపడి చదివారో చూస్తే ఆశ్చర్యపోవలసిందే.. ఏపీ హైకోర్టు కూడా 50శాతం రిజర్వేషన్ దాటకూడదంటూ గతంలో తీర్పు ఇచ్చింది. దానికి కారకుడు చంద్రబాబే.. తమ పార్టీ నాయకుడితో కేసు వేయించి బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబే ఇప్పుడు బీసీల ఉద్ధారకుడిగా మాట్లాడుతుండడం గమనార్హం... కోర్టు కేసుతో అడ్డుకున్నా వైఎస్ జగన్ బీసీల తరఫున నిలబడ్డారు. వారిని బ్యాక్‌బోన్ క్లాస్‌గా నిలబెట్టారు. మంత్రి పదవులు, రాజ్యసభ స్థానాలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు.. ఇలా అన్నింటిలోనూ బీసీలకు గణనీయమైన ప్రాతినిద్యం కల్పించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ జీవోను అడ్డుకున్నా అంతకుమించి గరిష్ట సంఖ్యలో బీసీలకు పాతినిధ్యం కల్పించి రాజకీయ సాధికారతకు కొత్త అర్థం చెప్పారు..
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై జగన్ జీవో ఇస్తే అడ్డుకున్నది చంద్రబాబే..
2020–21 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2019 డిసెంబరు 28వ తేదీనే జీవో నెంబరు 176 జారీ చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 58.95 శాతం రిజర్వేషన్ల అమలుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటుతున్నాయంటూ చంద్రబాబు కోర్టులో కేసు వేయించారు. బిర్రు ప్రతాప్‌రెడ్డి అనే టీడీపీ నాయకుడితో చంద్రబాబు ఈ నాటకం ఆడించారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ప్రతాప్‌రెడ్డి ఓ నామినేటెడ్ పదవి కూడా అనుభవించారు. చంద్రబాబు వేయించిన కేసు నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50శాతం మించరాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పుడు కోర్టులో ఎందుకు అడ్డుకున్నారు చంద్రబాబూ..? బీసీలకు 34శాతం రిజర్వేషన్ వస్తుంటే మీకు కడుపు మంట ఎందుకు అని సొంత పార్టీలోనే కొందరు నాయకులు విమర్శించడం నిజం కాదా..?
మేనిఫెస్టోలోనూ మోసమే..
స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ల అంశం న్యాయపరమైన చిక్కుల మధ్య ఉన్నా 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు 34శాతం రిజర్వేషన్ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇది అమలు జరగాలంటే మొక్కుబడి ప్రకటనలు సరిపోవని, పార్లమెంటులో చట్టబద్ధత అవసరమని తెలిసినా చంద్రబాబు మోసగించారు. కేంద్రంలో తమపై పూర్తిగా ఆధారపడిన ప్రభుత్వమే కొనసాగుతున్పప్పటికీ రెండేళ్లగా ఆ దిశగా చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. బీసీల విషయంలో చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులంటున్నారు. బీసీలకు స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్, చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు.. కేంద్రానికి ఓ వినతిపత్రం కూడా పంపలేదు. బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు రూ.4వేల చొప్పున పెన్షన్ అందిస్తామన్నారు. ధోకా ఇచ్చారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామన్నారు.. ధోకా.. బీసీలకు సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామన్నారు.. మూడు బడ్జెట్‌లలో బీసీలకు సబ్‌ప్లాన్ ఉందా.. వీటిని బట్టి అర్థం కావడంలేదూ వెన్నుపోటులో చంద్రబాబు గోల్డ్‌మెడల్ హోల్డరని... 
బీసీలకు మేలు జరిగింది జగన్ హయాంలోనే..
బీసీలు అంటే బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కాదు.. బీసీలు అంటే రాష్ట్రానికి బ్యాక్‌బోన్ క్లాసెస్ అని వైఎస్ జగన్ నమ్మారు.. నమ్మిన మాటను చేతల్లో చేసి చూపించారు. బీసీలకు అధికారం దక్కకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు వెనుక నుంచి రాజకీయాలు చేస్తే.. జగన్ మాత్రం బీసీలను రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 2019లో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. ఆ నిర్ణయాన్ని 50 శాతం రిజర్వేషన్ పరిమితిని సాకుగా చూపుతూ కోర్టు ద్వారా అడ్డుకునే ప్రయత్నం జరిగినా.. జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ, డిప్యూటీ సీఎం, కేబినెట్ పదవుల నుంచి బీసీ కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవుల వరకు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారు. ఎంపీపీలు, జిల్లాపరిషత్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్ల వంటి కీలక పదవుల్లో 34 శాతానికి మించి బీసీలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ రాజకీయ సాధికారతకు కొత్త నిర్వచనం ఇచ్చారు.
రాజ్యాధికారంలో బీసీలకు సమున్నత వాటా ఇచ్చిన జగన్
మంత్రివర్గంలో 25 మంది సభ్యులుండగా ఏకంగా 11 మంది బీసీలకు జగన్ స్థానం కల్పించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడు, ధర్మాన కృష్ణదాస్‌ను డిప్యూటీ సీఎంలుగా నియమించారు. విద్య, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యారోగ్యం లాంటి కీలక శాఖలను బీసీలకే అప్పగించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంకు అవకాశం కల్పించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర కోటాలో ఖాళీ అయిన 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా నలుగురు బీసీలను జగన్ రాజ్యసభకు పంపారు. అంతకు ముందు టీడీపీ హయాంలో చంద్రబాబు, ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. అలాగే శాసన మండలిలో జగన్ 28 పదవులు.. అంటే 48 శాతం పదవులు బీసీలకు ఇచ్చారు.
పథకాల రూపంలో రూ.1.83 లక్షల కోట్లు లబ్ధి
వివిధ సంక్షేమ పథకాల ద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డీబీటీ రూపంలో ఒక్క బీసీల ఖాతాల్లోనే జమ చేసిన మొత్తం రూ.1,29,866.54 కోట్లు కాగా, నాన్ డీబీటీ రూపంలో బీసీలకు అందించిన లబ్ధి విలువ మరో రూ.52,884.18 కోట్లు. అంటే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీసీలకు చేసిన వ్యయం రూ.1,82,750.71 కోట్లు. ఈ స్థాయిలో గతంలో ఏనాడైనా, చంద్రబాబు తాను పదవిలో ఉన్నప్పుడు అప్పుడైనా, ఇప్పుడైనా బీసీలకు ప్రయోజనాలు అందించారా? 
కోర్టులో కేసు వేసిన బిర్రు ప్రతాప్‌రెడ్డితో చంద్రబాబు (ఫైల్)
చట్టం చేసి మరీ ‘నామినేటెడ్’
దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వు చేస్తూ జగన్ ఏకంగా చట్టం తెచ్చారు. రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్‌లలో 137 చైర్మన్ పదవుల్లో 53 బీసీలకే ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి ఆ వర్గాల వారికే అవకాశం కల్పించారు. 137 కార్పొరేషన్‌లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకే (42 శాతం) ఇచ్చారు.
స్థానిక సంస్థల్లోనూ బీసీలకు జగన్ పెద్దపీట
స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలుచేయడానికి కోర్టు తీర్పు అడ్డం వచ్చినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన జగన్, దాన్ని ఆచరించి చూపారు. బీసీలకు పదవులు ఇచ్చారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంటే ఒక్క బీసీలకే 6 జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవులు (46 శాతం) కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో 636 మండలపరిషత్ అధ్యక్ష పదవుల్లో 239 పదవులను బీసీలకు అంటే.. 38 శాతం పదవులను బీసీ వర్గాలకే ఇచ్చారు. 13 కార్పొరేషన్‌లలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేయగా తొమ్మిది చోట్ల మేయర్ పదవులు (69 శాతం) బీసీలకు ఇచ్చారు. 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైఎస్సార్‌సీపీ కైవశం చేసుకోగా చైర్‌పర్సన్ పదవులు బీసీలకు 44 (53 శాతం) ఇచ్చారు.
చట్టసభల్లో 50శాతం సీట్లపై పార్లమెంటులో వైఎస్సార్‌సీపీ బిల్లు
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం దశాబ్దాల తరబడి ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. చట్టసభల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలంటూ పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు పెట్టించి జగన్ చరిత్ర సష్టించారు. 2019 మార్చిలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని కోరుతూ పార్లమెంట్‌లో బిల్లు ప్రతిపాదించారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కూడా జగన్ కేంద్రాన్ని కోరారు. కుల గణన కోసం బీసీ సంఘాలు జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో, బీసీల కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ జగన్ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి పంపించారు.


