విద్యుత్‌ సదుపాయం జీవించే హక్కులో భాగం | AP High Court Clarification on Conduct of Electricity Officials | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సదుపాయం జీవించే హక్కులో భాగం

Aug 18 2026 5:17 AM | Updated on Aug 18 2026 5:17 AM

AP High Court Clarification on Conduct of Electricity Officials

దీనికి భంగం వాటిల్లితే ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగినట్లే

హైకోర్టు స్పష్టీకరణ విద్యుత్‌ అధికారుల తీరుపై ఆక్షేపణ

సాక్షి, అమరావతి: విద్యుత్‌ సరఫరా కనెక్షన్ల విషయంలో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న విద్యు­త్‌ అధికారుల తీరును హై­కోర్టు తప్పుపట్టింది. విద్యు­త్‌ సదుపాయం రాజ్యాంగంలో అధికరణæ 21 ప్రకారం జీవించే హక్కులో ఒక అవిభాజ్య అంతర్భాగమని స్పష్టం చేసింది. ఒకవేళ దీనికి భంగం వాటిల్లితే, అది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించడమే అవుతుందని పేర్కొంది.  విద్యుత్‌ సరఫరా కనెక్షన్ల వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు వీలుగా ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. 

ప్రజల దైనందిన జీవితంలో విద్యుత్‌కు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, చట్టబద్ధమైన నిబంధనలను ఎటువంటి మినహాయింపు లేకుండా అమలు చేయడానికి తగిన సమగ్రమైన, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత కేసులో పిటిషనర్‌ విద్యుత్‌ కనెక్షన్‌ కోసం పెట్టుకున్న దరఖాస్తును శాశ్వతంగా తిరస్కరిస్తూ ఈపీడీసీఎల్‌ చైర్మన్‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది. అలాగే పిటిషనర్‌ పెట్టుకున్న దరఖాస్తును తిరిగి పరిగణనలోకి తీసుకుని రెండు వారాల్లో చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు ఇటీవల తీర్పు వెలువరించారు.  

విసిగి వేసారి హైకోర్టులో పిటిషన్‌
శ్రీకాకుళం జిల్లా, పరంపేటకు చెందిన కడగల శ్రీనివాసరావు తన ఇంట్లో జీవనోపాధి కోసం చిన్న పిండి మిల్లు ఏర్పాటు చేయాలనుకున్నారు. దీనికి సంబంధించి గ్రామ పంచాయతీ కార్యదర్శి నుండి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) కూడా పొందారు. ఫీజు చెల్లించి, కేటగిరి 2 కింద కొత్త విద్యుత్‌ కనెక్షన్‌ కోసం 2025 సెప్టెంబర్‌ 20న దరఖాస్తు చేసుకున్నారు. లైన్‌మెన్‌ విద్యుత్‌ సిబ్బంది కనెక్షన్‌ ఇవ్వడానికి ప్రయత్నించగా, స్థానికుల జోక్యం కారణంగా మీటర్‌ బిగించకుండానే వెళ్లిపోయారు. ఎందుకు కనెక్షన్‌ ఇవ్వలేదో కూడా శ్రీనివాసరావుకు చెప్పలేదు. పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఆన్‌లైన్‌ పోర్టల్‌లో చూడగా, దరఖాస్తును శాశ్వతంగా తిరస్కరించినట్లు అని చూపించారు. దీంతో శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement