నా ప్రాణాలకు ముప్పు | CI Nagaraju asks not to be given to police custody | Sakshi
Sakshi News home page

నా ప్రాణాలకు ముప్పు

Jul 2 2026 5:45 AM | Updated on Jul 2 2026 5:45 AM

CI Nagaraju asks not to be given to police custody

తనను పోలీసు కస్టడీకి ఇవ్వొద్దన్న సీఐ నాగరాజు

ఇప్పటికే అన్ని వివరాలు చెప్పానని న్యాయమూర్తి ఎదుట స్పష్టీకరణ

పెద్దల పేర్లు బయటకు రాకుండా అడ్డు తొలగించే కుట్ర 

ఈ క్రమంలోనే విచారణకు సహకరించడం లేదంటున్న సిట్‌.. పరస్పర విరుద్ధ విషయాలతో సర్కారు, పోలీస్‌ పెద్దల కుతంత్రం బట్టబయలు

టీడీపీ పెద్దల భూదందా నేపథ్యంలోనే సాయికృష్ణ లాకప్‌ హత్య

ఇందుకు ప్రత్యక్ష సాక్షి, పాత్రధారి సీఐ నాగరాజే 

ఆయన నోరు విప్పితే ఇక్కట్లేనని నోరు మూయించే పన్నాగం

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ :  ‘నా ప్రాణాలకు ముప్పుంది.. నన్ను పోలీస్‌ కస్టడీకి ఇస్తే నాకు ప్రాణహాని ఉంది’ అని లాకప్‌ నుంచి కనుమరుగైన సాయికృష్ణ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు బుధవారం ఏకంగా న్యాయస్థానంలో ఆందోళన వ్యక్తం చేయడం కలకలం రేపుతోంది. ఈ వ్యాఖ్యలు ఈ కేసు వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని  స్పష్టం చేస్తున్నాయి. పోలీసు అధికారి అయిన నాగరాజే పోలీసు కస్టడీలో ప్రాణాలకు భరోసా లేదని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే రాష్ట్రంలో పోలీసు స్టేషన్లలో వ్యక్తుల ప్రాణాలకు రక్షణ లేదని ఆయన తేల్చి చెప్పేశారు. సీఐ నాగరాజును పోలీస్‌ కస్టడీలోనే అంతం చేసేందుకు కుట్ర సాగుతోందన్నది బట్టబయలైంది. 

అంతటి తెగింపు ఎవరికి సాధ్యం? ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్న వారికే సాధ్యమన్నది బహిరంగ రహస్యమే. అంటే సాయికృష్ణను లాకప్‌లో అంతం చేయడం వెనుక సూత్రధారులుగా ఉన్న ప్రభుత్వ పెద్దలే ప్రస్తుతం నాగరాజును అడ్డు తొలగించుకోవాలని భావిస్తున్నారని తేటతెల్లమవుతోంది. దాంతో ఈ కేసులో కీలక విషయాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడైన సీఐ నాగరాజు విచారణకు సహకరించడం లేదని సిట్‌ చెబుతుంటే.. ఇప్పటికే తాను మొత్తం సమాచారం ఇచ్చినట్లుగా సీఐ నాగరాజు బుధవారం కోర్టు ఎదుట చెప్పడం సిట్‌ బండారాన్ని బయట పెట్టింది. బుధవారం కస్టడీ పిటీషన్‌పై విచారణలో సమయంలో సీఐ నాగరాజును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. 

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ, సిట్‌ తీరుపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నేరం ఒప్పుకునేలా తనపై ఒత్తిడి తెస్తున్నారని, అకారణంగా కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఐ.. న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. సిట్‌ దర్యాప్తునకు పూర్తిగా సహకరించానని, తన వద్ద ఉన్న సమాచారం అంతా అందించానని చెప్పారు. కస్టడీలో తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అభ్యంతరాలను, ఆరోపణలను లిఖిత పూర్వకంగా సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. సిట్‌ బృందం మాత్రం ఇందుకు భిన్నంగా రిమాండ్‌ రిపోర్టులో దర్యాప్తునకు సహకరించడం లేదని చెప్పడం గమనార్హం.  

పెద్దల కుట్రలో పాత్రధారే సీఐ నాగరాజు  
టీడీపీ ప్రజాప్రతినిధి భారీ భూదందా, ఆర్థిక అక్రమాల పంచాయితీతోనే గాదె సాయికృష్ణను లాకప్‌లో అదృశ్యం చేశారన్నది ఇప్పటికే స్పష్టమైంది. చినబాబుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన విజయవాడ ప్రజాప్రతినిధి జగ్గయ్యపేట వద్ద ఓ భూ దందా సాగించారు. ఆ పంచాయితీలో ప్రజాప్రతినిధి వ్యతిరేక వర్గం కూడా గట్టిగా నిలబడింది. ప్రజాప్రతినిధి వ్యతిరేక వర్గం తరఫున సాయికృష్ణ కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. దాంతోనే సాయికృష్ణను పోలీసుల సహకారంతో లాకప్‌లోనే అదృశ్యం చేశారని పోలీసువర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో విజయవాడ పోలీస్‌ బాస్, బిగ్‌బాస్‌ సూత్రధారులుగా సాగిన ఈ కుతంత్రంలో సీఐ నాగరాజు పాత్రధారిగా వ్యవహరించారు. గుట్టుచప్పుడు కాకుండా సాయికృష్ణను లాకప్‌లోనే అదృశ్యం చేశారు. కానీ ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో వ్యవహారం బట్టబయలైంది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ బాధిత కుటుంబానికి అండగా నిలబడింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో సీఐ నాగరాజును నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. సిట్‌ను నియమించారు. కానీ సాయికృష్ణను మాయం చేయడానికి ప్రధాన కారణమైన భూ దందాను కప్పిపుచ్చడం ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలకు సవాల్‌గా మారింది.  

కుట్రకు ప్రత్యక్ష సాక్షి నాగరాజే కాబట్టి.. 
సాయికృష్ణను లాకప్‌లోనే అంతం చేసిన కుట్రలో ప్రధాన పాత్రధారి సీఐ నాగరాజే కాబట్టి, న్యాయ విచారణలో ఆయన వాస్తవాలు వెల్లడిస్తే ప్రభుత్వ పెద్దల బండారం మొత్తం బయటపడుతుంది. అందుకే ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇస్తామని ప్రభుత్వ పెద్దలు ఆశ చూపించారు. ప్రస్తుతం ఈ కేసును తప్పుదారి పట్టించేంత వరకు తమకు సహకరించాలని సూచించారు. కాగా ఈ కేసు న్యాయస్థానం పర్యవేక్షణలో సాగుతుండటం.. మరోవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ రంగ ప్రవేశం చేయడంతో సీఐ నాగరాజుకు పరిస్థితి క్రమంగా అర్థమవుతోంది.

తన మెడకు ఉచ్చు బిగుసుకుంటోందని ఆయన గుర్తించారు. దాంతో ఈ కేసులో వాస్తవాలను న్యాయస్థానంలో వెల్లడించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో సాయికృష్ణను లాకప్‌లోనే అంతం చేయాలని తనను ఆదేశించిన ప్రభుత్వ, పోలీసు పెద్దల పేర్లను ఆయన బయటపెట్టే అవకాశముంది. ఇలా జరగకుండా సాయికృష్ణను మాయం చేసినట్టే.. సీఐ నాగరాజును కూడా అడ్డు తొలగించుకోవాలని ప్రభుత్వ పెద్దలు కుతంత్రం పన్నుతున్నారనేది విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని నాగరాజు కూడా గుర్తించారు. 

ఈ నేపథ్యంలోనే నాగరాజును మరింతగా విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. దాంతో నాగరాజుకు భవిష్యత్‌ పరిణామాలు ఎలా ఉండే అవకాశముందన్నది పూర్తిగా స్పష్టమైంది. తాను పోలీసుల కస్టడీలోకి వెళితే.. ఇక తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయో, ఉండవోనని ఆయన ఆందోళన చెందారు. అందుకే తనను కస్టడీకి ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని కోరారు. పోలీసు కస్టడీలో తన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా కుండబద్దలు కొట్టారు. 

అంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పోలీసు స్టేషన్లు, పోలీసు కస్టడీలో ప్రాణాలకు ఏమాత్రం భద్రత లేదని స్వయంగా ఓ సీఐనే తేల్చి చెప్పారు.  భూదందాలు, ఆర్థిక అక్రమాల కోసం తమ ప్రత్యర్థి వర్గీయులనే కాదు.. సాక్షాత్తు పోలీసు అధికారులను కూడా లాకప్‌లు, పోలీసు కస్టడీలోనే అంతం చేసేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు బరితెగిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా సాగిస్తున్న జంగిల్‌ రాజ్‌ దారుణాలను బట్టబయలు చేస్తోంది.    

నిజాలు దాస్తున్న సిట్‌  
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసును పది రోజులుగా సిట్‌ బృందం దర్యాప్తు చేస్తున్నా ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. పక్కా ప్రణాళికతో నిజాలను దాస్తూ కేసును నీరుగార్చేలా నడిపిస్తోంది. సీఐ నాగరాజును అరెస్టు చేసిన సమయంలో, ఆ తర్వాత కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులతో ఈ విషయం తేటతెల్లమైంది. సిట్‌ బృందం ఇప్పటి వరకు కోర్టుకు సమర్పించిన మూడు రిమాండ్‌ రిపోర్టుల్లో ‘విచారణలో నిందితులు సహకరించలేదు. ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. మౌనం వహించారు’ అనే సమాధానాలనే పొందు పరిచింది. 

మరోపక్క సీఐ నాగరాజు అరెస్టు సమయంలోనే కానిస్టేబుళ్లను కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నా సిట్‌ ఆ పని చేయలేదు. వారు పరారీలో ఉన్నట్లు, వారి కోసం ప్రత్యేక బృందాలు వెదుకుతున్నట్లు కాల యాపన చేశారు. ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు అశోక్, నాని లొంగిపోతున్నట్లు లీకులు ఇచ్చారు. చివరకు సినిమాలో మాదిరి ఇద్దరూ ఆటోలో వచ్చి, ఏసీపీ ఎదుట లొంగిపోయినట్లు కథ నడిపారు. వీరిద్దరి రిమాండ్‌ రిపోర్టులో సైతం పాత కథే చెప్పారు. ఈ కేసులో సీఐకి సహకరించి, కీలకంగా వ్యవహరించిన అతని సన్నిహితుడి పాత్ర ఏమిటన్నది వెల్లడించలేదు. 

ఈ కేసులో మరో ఇద్దరు క్రైమ్‌ కానిస్టేబుళ్లు బాబూరావు, సాంబశివరావును మంగళవారం అదుపులోకి తీసుకుని, బుధవారం విజయవాడ రెండో ఏసీఎం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. వీరిద్దరి రిమాండ్‌ రిపోర్టులోనూ సిట్‌ దాదాపు పాత కథనే చెప్పింది. ఇదిలా ఉండగా సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసి ప్రాణాలు విడిచిన క్రాంతికుమార్‌ ఉదంతంలో దర్యాప్తుపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది. స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ ఒకే కోణంలో కేసు దర్యాప్తు సాగుతుండటమే ఇందుకు నిదర్శనం. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement