కరుణ రథం.. సేవ అమోఘం

A charity is a beacon of light in the darkness - Sakshi

అంధకారంలో వెలుగురేఖలా స్వచ్ఛంద సంస్థ

అనాథ వృద్ధుల ఇంటికే భోజనం సరఫరా

దాతల సాయంతో రెండు పూటలా క్యారియర్లు అందజేత

నాగాయలంకలోని తలగడదీవిలో వినూత్న సేవ

సమాజంలో కొందరు మానవతావాదులు అందిస్తున్న సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. తోటి మనుషులు పడుతున్న బాధలను చూసి చలించిపోయి చేతనైన మేర సాయం అందిస్తూ గొప్ప మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఏ ఆసరా లేని అనాథ వృద్ధుల ఆకలి తీరుస్తూ అండగా ఉంటున్నారు. ఎదుటి మనిషి కన్నీరు తుడవడానికి ఏ బంధమూ ఉండనక్కర్లేదని.. స్పందించే హృదయం ఉంటే చాలని నిరూపిస్తున్నారు. అంధకారమయమైన వారి జీవితాల్లో వెలుగురేఖలా నిలుస్తున్నారు కృష్ణాజిల్లా నాగాయలంక మండలం తలగడదీవి గ్రామంలోని కరుణ రథం హోమ్‌ నిర్వాహకులు. - కృష్ణ డెస్క్ 

కుటుంబ సభ్యుల ఆసరా లేని అనేక మది వృద్ధులను ఆదుకోవాలనే తలంపు, జ­న్మభూమి రుణం తీర్చుకోవాలనే భావనతో తెలుగు లోగిలి అనే ఓ స్వచ్ఛంద సేవా సంస్థ కరుణ రథం హోమ్‌ ఏర్పాటు చేసి అందిస్తున్న సేవలు చూసి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద అనాథ వృద్ధుల ఇంటి వద్దకే నేరుగా ఆహారం పంపిస్తున్నారు. నిత్య భోజన క్యారియర్‌ల సేవా పథకం గత ఆరేళ్లుగా కొనసాగిస్తూ సంస్థ ముందుకు సాగుతోంది. నాగాయలంక మండలంలోని తలగడదీవి గ్రామంలో గాంధీజీ జయంతి నేపథ్యంలో 2017 అక్టోబర్‌లో కరుణ రథం హోమ్‌ ఆవిర్భవించింది. 

ముందుకొచ్చిన దాతలు..
సామాజిక సేవా తత్పరత కలిగిన భోగాది శ్రీరామలక్ష్మి వృద్ధులకు సేవలు అందించాలనే ఆలోచనతో స్ఫూర్తి పొందిన రియల్టర్‌ (హైదరాబాద్‌), సేవా సంస్థల నిర్వాహకుడు పేర్ల శ్రీనివాసరావు (పీఎస్‌ రావు) దాతగా ముందుకు వచ్చారు. జన్మనిచ్చిన తన గ్రామం రుణం తీర్చుకుంటానని ఆసరాలేని అనాథ వృద్ధులకు నిత్యం వారి ఇళ్లకే భోజనం పంపించి ఆదరిస్తాననే ప్రతిపాదన చేయడంతో గ్రామ ప్రముఖుడైన గణపేశ్వరాలయం ధర్మకర్త మండల రాంబాబు వంటశాల నిర్మాణానికి స్థలం ఇస్తానని ముందుకొచ్చారు. అందుకు అనుగుణంగా కరుణ రథం హోమ్‌ ఆవిర్భవించింది.

న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ ప్రోత్సాహం..
అప్పటి ఉభయ తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ ఈ వినూత్న ఆశ్రమ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తనకు జన్మనిచ్చిన తలగడదీవి గ్రామంలో నిరుపేద, ఆసరా లేని అనాథ వృద్ధులు భోజనానికి ఎలాంటి ఇబ్బందులు పడరాదని భావించారు. ఆ ఉద్దేశంతో ప్రత్యేకంగా నిర్మించిన భోజనశాలలో వంటచేసి భోజనాలను క్యారియర్‌ల ద్వారా ఇళ్లకు పంపించే ఏర్పాటు చేశారు. పూర్తి నిర్వహణ, పంపిణీ బాధ్యతను సేవానిరతి కలిగిన భోగాది రామలక్ష్మికి అప్పగించినట్లు తెలుగు లోగిలి సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ పేర్ల శ్రీనివాసరావు (పీఎస్‌రావు) వివరించారు.

ఆరేళ్లుగా ముగ్గురు మహిళలు..
ఆరేళ్లుగా నిరంతరాయంగా వృద్ధులకు భోజన సేవలు అందిస్తున్నట్లు రామలక్ష్మి పేర్కొన్నారు. ఈ అరుదైన సేవలకు ముగ్గురు మహిళలు నిర్వహణ భారం వహిస్తున్నారని తెలిపారు. మొదట్లో 40 మంది వృద్ధులకు భోజన క్యారియర్‌లు రెండు పూటలా పంపేవారమని చెప్పారు. కొందరు చనిపోవడం ఇతర కారణాలతో ప్రస్తుతం ఆ సంఖ్య 25 మందికి చేరిందన్నారు.

ఒక్కొక్కరికీ రెండు క్యారియర్‌లు కేటాయించారు (ఒకటి ఇచ్చి ఒకటి తెస్తారు). ఉదయం, సాయంత్రం రెండు సార్లు భోజనం అందిస్తారు. వంటశాలలో వంట చేయడానికి ఒక బేబి అనే మహిళ , భోజన క్యారియర్‌ చేర్చడం, తీసుకురావడానికి కోటేశ్వరమ్మ అనే మరో మహిళ సేవా కోణంలోనే నామమాత్రపు వేతనంపై పని చేస్తున్నారు. ఉదయం వేళలో 200 గ్రాముల వైట్‌ రైస్, కూర, పచ్చడి, మజ్జిగతో, సాయంత్రం ఒక కూరతో భోజన క్యారియర్‌లు పంపిస్తున్నారు. 

మనిషి జన్మకు సంతృప్తి..
మనిషిగా పుట్టిన ప్రతి­ఒక్క­రూ తమ జన్మకు సంతృప్తి, స్వాంతన చేకూరాలంటే ఇలాం­టి సేవలే ఊతమి­స్తాయి. వృద్ధులకు సాయం లాంటి సామాజిక సేవ చేయాలనే తలంపు ఉన్నప్పటికీ సాధ్యం కాదు. పీఎస్‌రావు లాంటి సేవామూర్తులు ముందుకు రావడంతోనే ఈ భోజన క్యారియర్‌లు అందించగలుగుతున్నాం.
– భోగాది రామలక్ష్మి, హోమ్‌ పర్యవేక్షణ, భోజన సేవల నిర్వాహకురాలు.

హోమ్‌ ఆదరణ మాటలతో చెప్పలేం
ప్రతి రోజు రెండు పూటలా భో­జనం క్యారియర్‌లను ఇంటికి తెచ్చి ఇస్తారు. ఎవరి ఆ­స­రా లేకుండా ఒంటరిగా ఉంటున్న నాకు కరుణ రథం హోమ్‌ అందించే భోజన సేవలు ఎంతగా­నో ఆదుకుంటున్నాయి. పీఎస్‌ రావు, రామలక్ష్మి లాంటి వారి సేవలకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. 
–దోవారి శశిరేఖ, ఒంటరి వృద్ధురాలు, గుజ్జల రవీంద్రనగర్‌ ఎస్సీ కాలనీ

మాకు జవసత్వాలు కలిగిస్తున్నారు
గ్రామంలో గొప్ప కార్య­క్రమం చేపట్టి ఒంటరిగా జీవిస్తున్న మాలాంటి వారికి భోజనం పెట్టి జవసత్వాలు కలిగిస్తున్నారు. రెండు పూటలా క్యారియర్‌లతో మాకు భోజనం అందించడం సామాన్య విషయం కాదు. ఈ వయస్సులో మాకు ఆసరాగా నిలిచిన దాత, సేవకులకు చేతులెత్తి మొక్కాల్సిందే.
–నాదెళ్ల భాస్కరరావు, వృద్ధుడు, ఎస్సీ కాలనీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top