కర్షకుడిని మోసం చేసిన బాబు సర్కారు
ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయమంటూ సూపర్ సిక్స్‌లో హామీ తొలి ఏడాది పైసా కూడా ఇవ్వకుండా నిస్సిగ్గుగా ఎగ్గొట్టిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం దుఃఖీభవగా మారింది. కర్షకులను చంద్రబాబు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ పథకం ద్వారా రెండేళ్లలో తమకు ఇవ్వాల్సిన బకాయిలు ఎప్పుడిస్తావు అంటూ రైతులు, రైతుసంఘాలు సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. మాయమాటలతో 18 నెలలుగా తమను మోసగిస్తూనే ఉన్నారంటూ మండిపడుతున్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు బృందం గద్దెనెక్కగానే తానిచ్చిన హామిని తుంగలో తొక్కిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలి ఏడాది ఏ ఒక్కరికి పైసా కూడా విదల్చకుండా నిస్సిగ్గుగా పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కార్ ఈ ఏడాది అడ్డగోలుగా కోతలతో మోసగిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సూపర్ సిక్స్ హామీకి తూట్లు పొడుస్తూ..
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తొలి ఏడాది అన్ని పథకాల మాదిరిగా ఈ పథకాన్ని కూడా పూర్తిగా ఎగనామం పెట్టింది. రెండో ఏడాది అమలు చేసినా, ఆంక్షల పేరిట కోతలు పెడుతూ ఏకంగా ఏడు లక్షల మందికి ఎగ్గొట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ, అమలు తీరుపై వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిస్తే ఏస్థాయిలో అన్నదాతలను నిలువునా మోసగిస్తున్నారో ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది.
2018–19 మాదిరిగానే మరోసారి అన్నదాత సుఖీభవ పేరిట రైతుల నెత్తిన టోపీ పెడుతోంది. మరొక పక్క రెండేళ్లుగా కౌలు రైతులను ఏ స్థాయిలో మోసగిస్తున్నారో చెప్పడానికి ఈ పథకమే ఉదాహరణగా చెప్పొచ్చు. ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా చూస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినట్లు 53,58,366 మంది రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున రెండేళ్లలో ప్రతి రైతుకు రూ.40 వేల పెట్టుబడి సాయం చేయాల్సి ఉంది. ఆ మేరకు ఇప్పటి వరకు 21,433.46 కోట్లు రైతులకు పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సి ఉంది.
రూ.16,748 కోట్లు ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం
ఈ 18 నెలల్లో ఇచ్చింది ఎంతో తెలుసా? తొలి విడతలో అన్నదాతల సంఖ్యలో కోతలు వేసి 46,85,838 మంది రైతులకు తొలి విడతగా రూ.5 వేలు, ఇప్పుడు మరో రూ.5 వేలు.. అంటే రూ.10 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చినట్టుగా చెబుతోంది. ఆ మేరకు లెక్కిస్తే రెండు విడతల్లో కలిపి ఇచ్చింది కేవలం రూ.4,685.54 కోట్ల మాత్రమే. అంటే రైతులకు ఎగ్గొట్టింది అక్షరాలా రూ.16,748 కోట్లు.
పైగా పీఎం కిసాన్ కింద కేంద్రం ఇస్తున్న సాయాన్ని తన ఖాతాలో వేసుకొని రెండు విడతల్లో రూ.14వేల చొప్పున ఇచ్చామని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటోంది. పైగా కౌలు రైతులకు 18 నెలల్లో పైసా కూడా విదిల్చిన పాపాన పోలేదు. ఇలా వాస్తవాలకు ముసుగేసి తామేదో రైతులను ఉద్దరిస్తున్నట్టుగా గొప్పగా ప్రచారం చేసుకోవడం పట్ల మండిపడుతున్నారు. ఎన్నికల్లో హామీ మేరకు రూ.20వేలలో తమకు రావాల్సిన బాకీ సొమ్ములు ఎప్పుడిస్తావంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.
రైతు సంక్షేమ పథకాలకు మంగళం
మరొక వైపు ఉచిత పంటల బీమాను సీఎం చంద్రబాబు అటకెక్కించారు. సున్నా వడ్డీ పంట రుణ పథకానికి సున్నా చుట్టేశారు. కనీస మద్దతు ధర కల్పన కోసం ధరల స్థిరీకరణ నిధికి మంగళం పాడేశారు. ఈ–క్రాప్ విధానాన్ని నిరీ్వర్యం చేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ అందకుండా ఎగ్గొడుతున్నారు. ఇలా అన్నదాత సుఖీభవతో మొదలుకొని సున్నా వడ్డీ వరకు రైతు సంక్షేమ పథకాలకు మంగళం పాడిన బాబు ప్రభుత్వం రైతుల పాలిట పెనుశాపంలా మారింది. 18 నెలల్లో ఏ ఒక్క పంటకు మద్దతు ధర కూడా దక్కకపోయినా ఒక్క రైతును కూడా ఆదుకున్నది లేదు. ఇలా అన్ని వర్గాల వారిని మోసం చేసినట్లుగానే, రైతులకూ బాబు ప్రభుత్వం దారుణంగా దగా చేస్తోందంటూ రైతులు మండిపడుతున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో హామీ కంటే మిన్నగా సహాయం
అధికారంలోకి రాగానే అర్హత కలిగిన ప్రతీ రైతు కుటుంబానికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తామంటూ 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ కంటే మిన్నగా నభూతో న భవిష్యతి అన్నట్టుగా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయం అందించి వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. పైగా పగ్గాలు చేపట్టిన తొలి ఏడాది నుంచే పెట్టుబడి సాయం పంపిణీకి శ్రీకారం చుట్టారు.
ఖరీఫ్ సీజన్‌కు ముందు ప్రతీ ఏటా మే/జూన్‌లలో రూ.7,500, రబీ సీజన్‌కు ముందు అక్టోబర్‌లో రూ.4 వేలు, రబీ పంట చేతికొచ్చే సమయంలో జనవరిలో 2 వేలు చొప్పున క్రమం తప్పకుండా జమ చేసేవారు. వెబ్‌ల్యాండ్ లేని భూయజమానులు, చనిపోయిన రైతుల వారసులతోపాటు అటవీ, దేవాదాయ భూములు సాగు చేస్తున్న వారు,.సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు ఈ ఐదేళ్లూ జగన్ ప్రభుత్వమే సొంతంగా రూ13,500 చొప్పున పెట్టుబడి సాయం జమ చేసింది. ఇలా 53.58 లక్షల మందికి ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.34,378.16 కోట్లు జమ చేసి రైతులకు అండగా నిలిచింది.


