అధికారంలోకి రాగానే 'క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ ఉష్‌' | Chandrababu Naidu govt neglects QR Code Scan for liquor sales | Sakshi
Sakshi News home page

అధికారంలోకి రాగానే 'క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ ఉష్‌'

Oct 16 2025 5:35 AM | Updated on Oct 16 2025 7:08 AM

Chandrababu Naidu govt neglects QR Code Scan for liquor sales

నకిలీ మద్యం ఆరోపణలు వెల్లువెత్తడంతో విధిలేని పరిస్థితిలో మళ్లీ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ 

ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం

16 నెలలుగా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ లేకుండా మద్యం అమ్మకాలు జరిపినట్లు ప్రభుత్వం ఒప్పుకోలు 

టీడీపీ సిండికేట్‌ ఆధ్వర్యంలోని మద్యం షాపుల్లో యజమానులు ఈ విధానాన్ని అమలు చేస్తారా? 

ప్రజలు, మద్యం ప్రియుల్లో సందేహాలు 

పల్లెల్లో పుట్టగొడుగుల్లా విస్తరించిన బెల్ట్‌ షాపుల్లో అమ్మకాలపై ప్రభుత్వం మౌనం 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి మద్యం బాటిల్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి విక్రయం 

ఈ విధానాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న  

సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వ నకిలీ మద్యం బండారం అధికారికంగా బట్ట­బయలైంది. 2024 జూన్‌ నుంచి ఇప్ప­టివరకు రాష్ట్రంలో అమ్ముతున్న మద్యం నాణ్యతపై ఎటువంటి భరోసా లేదని తేటతెల్లమైంది. మద్యం సీసాలపై క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయకుండానే ఇన్నాళ్లూ విక్ర­యాలు సాగించినట్టు ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది. ఏడాదిన్నరలో వేల కోట్ల రూపాయల మద్యం విక్రయించడం ద్వారా నకిలీ మద్యం అమ్మకాలకు రాచబాట పరిచిందనీ స్పష్టమైంది. 

తీరా నకిలీ బాగోతం బట్టబయలు కావడం.. ప్రభుత్వ ముఖ్య నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతుండటం.. అన్ని వేళ్లూ టీడీపీ వైపే చూపుతుండటంతో గత్యంతరం లేక.. గత ప్రభుత్వంలో అమలైన తరహాలో బాటిల్‌పై ఉన్న క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి విక్రయించే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. తద్వారా నకిలీ మద్యం దందాను కప్పిపుచ్చేందుకు పన్నాగం పన్నింది. 

అయితే క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయకపోతే ఏం చేస్తారనే విషయమై స్పష్టత లేదు. అలాగే వీధి వీధిన ఏర్పాటైన బెల్ట్‌ షాపుల్లో ఈ విధానాన్ని ఏ విధంగా అమలు చేస్తుందనే విషయాన్ని వెల్లడించ లేదు. తద్వారా బెల్ట్‌ షాపుల ద్వారా ఈ రాకెట్‌ నడుపుకోవచ్చనే సంకేతాలు ఇస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని ప­రిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏడాదిన్నరగా విక్ర­యించిన మద్యంలో ఎంత మేర నకిలీ ఉందోనని ఇన్నాళ్లూ తాగిన వారు ఆందోళన చెందుతున్నారు.

గత ప్రభుత్వ హయాంలోనే క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ విధానం 
దశల వారీ మద్య నియంత్రణ, నాణ్యమైన మద్యం అమ్మకాల కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ విధానాన్ని తొలిసారిగా ప్రవేశ పెట్టింది. అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించే ప్రతి మద్యం సీసాపై ఉన్న క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే చాలు.. మద్యాని­కి సంబంధించిన పూర్తి సమాచారం వె­ల్లడవుతుంది. అది ప్రభుత్వం అధికారికంగా ఆమోదించి సరఫరా చేస్తున్న నాణ్యమై­న మద్యమేనా.. మద్యం ఏ డిస్టిలరీలో తయా­రైంది.. ఎప్పుడు తయారైంది..బ్యాచ్‌ నంబరు..ఇ­లాంటి వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. 

తద్వారా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మద్యం ఉండేలా పటిష్ట విధానాన్ని అమలులోకి తెచ్చింది. మద్యం నకిలీ/కల్తీ చేసేందుకు అవకాశం లేకుండా కట్టడి చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019–24 వరకు ఈ విధానాన్ని పటిష్టంగా నిర్వహించింది. అప్పట్లో ప్రతి ప్రభుత్వ మ­ద్యం దుకాణంలో వినియోగదారులకు వారి ముందే బాటిల్‌ను క్యూర్‌ కోడ్‌ స్కాన్‌ చేసిన తర్వాతే విక్రయించే వారు. 2024లో రాష్టంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం సీసాలపై క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ విధానాన్ని తొలగించింది. ఎటువంటి ఉత్తర్వులు లేకుండానే ఆ విధానం అమలును నిలిపి వేసింది. అపై టీడీపీ సిండికేట్‌ మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశ పెట్టింది.   


క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ అమలు చేయాలని ఇప్పుడు ఉత్తర్వులు 
రాష్ట్రంలో నకిలీ మద్యం మాఫియా దోపిడీ బయట పడటంతో కూటమి ప్రభుత్వ బాగోతం బట్టబయలైంది. దాంతో తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు హడావుడిగా బుధవారం ప్రభుత్వం ఎక్సైజ్‌ శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం సీసాలపై క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ విధానాన్ని అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 45 రోజుల్లో ఈ విధానం అమలు చేసేలా రాష్ట్రంలోని 3,336 వైన్‌ షాపుల్లో, 540 బార్లలో, (త్వరలో రానున్న మరో 300 బార్లలో కూడా) ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అంటే ఏడాదిన్నరపాటు క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ లేకుండానే సాగిన మద్యం అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడినట్టు సమ్మతించినట్టేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. సర్కారు రెండు నాల్కల విధానంపై విస్తుపోతున్నారు.

నకిలీ మద్యానికి రాచబాటే
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా రాష్ట్రంలో క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ లేకుండానే మద్యం విక్రయాలు సాగించింది. ఏడాదిన్నరగా వేల కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనే ప్రభుత్వం  వెల్లడించింది. తద్వారా క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ లేకుండానే ఇంత భారీగా మద్యాన్ని విక్రయించినట్టు ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో కేవలం టీడీపీ సిండికేట్‌ దుకాణాల ద్వారా నకిలీ మద్యం విక్రయాలను అడ్డూ అదుపు లేకుండా చేసేందుకే క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ను తొలగించారని ఎక్సైజ్‌ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో భారీ స్థాయిలో నకిలీ మద్యం రాకెట్‌ బయట పడటం గమనార్హం. ఏడాదిన్నరలో విక్రయించిన మద్యంలో నకిలీ ఎంత ఉంటుందన్నది అంచనాలకు అందడం లేదు.

ఇదీ సంగతి! 
క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ విధానం అమలు చేయాలని ఇప్పుడు చెప్పడం ద్వారా ఏడాదిన్నరగా రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయాలు జరిగాయన్నది ప్రభుత్వమే ఒప్పుకుంది. 
⇒ రాష్ట్రంలోని మద్యం షాపుల్లో ఏడాదిన్నరగా క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ అన్నదే లేదని తేల్చింది. 
⇒ ప్రస్తుతం మద్యం షాపులన్నీ ప్రైవేట్‌ సిండికేట్‌ పరిధిలో ఉన్నాయి. వాటిలో క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ విధానాన్ని అమలు చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది?  
⇒ ఊరూరా.. వీధి వీధిన ఉన్న బెల్ట్‌ షాపుల్లో క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ను ఎలా అమలు చేయిస్తుంది? 
⇒ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా పారదర్శకంగా నాణ్యమైన మద్యం విక్రయాలు జరిగాయని ఒప్పుకున్నట్టే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement