అబద్ధపు వాంగ్మూలాలతో కుతంత్రం
అజయ్ కుమార్ సుగంథ్ రిమాండ్ నివేదికే తార్కాణం
ఎల్లో మీడియాలో రాద్ధాంతం.. కుట్రలను బలపరుస్తూ మంత్రి లోకేశ్ ట్వీట్
సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా బాబు సర్కారు బరి తెగింపు
సాక్షి అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకొచ్చే కుట్రలకు చంద్రబాబు ప్రభుత్వం మరింత పదును పెట్టింది. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు బరి తెగించింది. అందుకోసం పరస్పర విరుద్ధ ఆరోపణలు, అవాస్తవాలు, అభూత కల్పనలు జోడించి న్యాయస్థానాలను బురిడీ కొట్టించేందుకు కూడా తెగబడుతుండటం తీవ్ర విభ్రాంతి కలిగిస్తోంది. టీటీడీ నెయ్యి వివాదంలో సిట్ తాజాగా అరెస్టు చేసిన సుగంథ్ ఆయిల్ కంపెనీ ప్రతినిధి అజయ్ కుమార్ సుగంథ్ రిమాండ్ నివేదికే అందుకు తాజా తార్కాణం.
ఆ రిమాండ్ నివేదికలోని అంశాలను ఎల్లో మీడియాతోపాటు వివిధ మీడియా సంస్థలకు ముందుగానే లీక్ చేసి రాద్ధాంతం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం తన కుట్రలను నిస్సిగ్గుగా బయట పెట్టుకుంది. ఆ దుష్ప్రచార కథనాలను మంత్రి నారా లోకేష్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేయడం గమనార్హం. అంటే పక్కా కుతంత్రంతోనే ఈ దుష్ప్రచార కుట్రలకు ప్రభుత్వం బరి తెగించిందన్నది స్పష్టమవుతోంది. తిరుపతి పోలీసులు అరెస్టు చేసిన అజయ్ కుమార్ సుగంథ్‌ను నెల్లూరు ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచగా ఈ నెల 21 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్ నివేదిక సాక్షిగా బయటపడిన ప్రభుత్వ కుట్ర ఇలా ఉంది..
జంతువుల కొవ్వు అన్నారు.. కాదు కాదు పామాయిల్ అంటున్నారు!
తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి దుష్ప్రచారానికి పాల్పడిందన్నది ఈ రిమాండ్ నివేదిక బయటపెట్టింది. గత ఐదేళ్లలో లడ్డూ ప్రసాదానికి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. అదే నిరాధార ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎల్లో మీడియా పదేపదే ఉద్ఘాటించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన విషయం తెలిసిందే. కాగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని ఎన్‌డీడీబీ ల్యాబ్ నివేదిక స్పష్టం చేయడంతో ప్రభుత్వ కుట్ర బెడిసికొట్టింది.
సీఎం చంద్రబాబు ఆరోపణలను ఖండిస్తూ అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు కూడా కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని స్పష్టం చేయడం గమనార్హం. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈవోపై ఒత్తిడి తెచ్చి ఆయన మౌనం దాల్చేలా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరో కుతంత్రానికి ఈ రిమాండ్ నివేదిక ద్వారా కుట్ర పన్నింది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో పామాయిల్, ఈస్ట్, ఇతర రసాయనాలు కలిపారని తాజాగా పేర్కొంది. జంతువుల కొవ్వు ఆరోపణలు బెడిసికొట్టడంతో నెయ్యిపై దుష్ప్రచారం చేసేందుకు పామాయిల్, రిఫైన్డ్ ఆయిల్ కలిపారనే వాదనను తెరపైకి తెచ్చినట్లు స్పష్టమవుతోంది.
అందుకోసం దర్యాప్తు పేరుతో సాక్షులను వివిధ డెయిరీ సంస్థల ప్రతినిధులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు చెప్పినట్లుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వకపోతే అక్రమ కేసులో ఇరికిస్తారనే భయంతోనే డెయిరీ ప్రతినిధులు వారి ఒత్తిడికి తలొగ్గినట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి.
భోలే బాబా డెయిరీపై భిన్న వాదనలు..
లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం భోలే బాబా డెయిరీపై పరస్పర విరుద్ధ ఆరోపణలతో తన కుట్రలను బయటపెట్టుకుంటోంది. ఏపీ భవన్ ఉద్యోగి చిన్న అప్పన్నను పోలీసులు వైవీ సుబ్బారెడ్డి పీఏగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఆయన భోలే బాబా డెయిరీని బెదిరించి రూ.50 లక్షలు లంచం అడిగారని ఆరోపించారు. అందుకు ఆ డెయిరీ నిరాకరించడంతో టీటీడీ జీఎంపై ఒత్తిడి తెచ్చి బ్లాక్ లిస్టులో పెట్టించారని పేర్కొన్నారు. మరో రెండు కంపెనీలకు భోలేబాబా డెయిరీ ఎల్ 1గా వచ్చినప్పటికీ ఆ డెయిరీని కాదని మరో రెండు డెయిరీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇప్పించినట్లు ఆరోపణలు చేశారు. ఆయన వ్యక్తిగత బ్యాంకు లావాదేవీలను వక్రీకరిస్తూ వాటిని ఆధారంగా చూపించేందుకు తాపత్రయపడ్డారు.
కానీ అదే సమయంలో చిన్న అప్పన్న గతంలో ప్రస్తుత టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వద్ద పీఏగా పని చేశారన్న వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. పోలీసులు భోలేబాబా డెయిరీని టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టిందని పేర్కొనడం గమనార్హం. అంటే భోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సరఫరాను వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే టీటీడీ నిలిపివేసిందని స్పష్టమవుతోంది. భోలే బాబా డెయిరీ రైతుల నుంచి ఒక్క చుక్క కూడా పాలు సేకరించలేదని సిట్ పేర్కొంది. కానీ అదే డెయిరీ యూపీలో 60 వేల మంది పాడి రైతుల నుంచి పాలు సేకరించి పాల ఉత్పత్తులు తయారు చేస్తోందని అదే సిట్ పూర్తి భిన్నమైన వాదన వినిపించింది.

భోలే బాబా డెయిరీ పేరుతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో అజయ్ కుమార్ సుగంథ్ రిమాండ్ రిపోర్టులో సిట్ కొత్త కట్టుకథను వినిపించింది. భోలే బాబా డెయిరీ సుగంథ్ ఆయిల్ ప్రొడక్ట్స్ ద్వారా కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు కొత్త కట్టుకథ సృష్టించింది. అందులో వివిధ ప్రైవేట్ డెయిరీల పాత్ర ఉన్నట్లు కూడా పేర్కొంది. ఆ మేరకు హర్‡్ష ట్రేడింగ్ కంపెనీ, హర్‡్ష డెయిరీ ప్రొడక్ట్స్ తదితర పేర్లను పేర్కొంది. అంటే ఆ కంపెనీ ప్రతినిధులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు పక్కాగా పన్నాగం పన్నినట్లు స్పష్టమవుతోంది.
సుప్రీం తీర్పునూ బేఖాతర్ చేస్తూ...
రాజకీయాల్లోకి కనీసం భగవంతుడినైనా దూరంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం చంద్రబాబు బేఖాతర్ చేస్తోంది. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఈ కేసులో, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎల్లో మీడియా ద్వారా రాద్ధాంతం చేస్తోంది. అజయ్‌కుమార్ సుగంథ్ రిమాండ్ రిపోర్టును న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకముందే ఎల్లో మీడియాకు చేరడం అందుకు నిదర్శనం. ఎల్లో మీడియా, కొన్ని ఇంగ్లీషు పత్రికలు, వెబ్‌సైట్లలో దుష్ప్రచార కథనాలను సోమవారమే వైరల్ చేయడం విభ్రాంతి కలిగిస్తోంది.
టీటీడీ లడ్డూ ప్రసాదానికి కళంకం ఆపాదించేలా మీడియా చానళ్లలో చర్చా గోష్టి నిర్వహించింది. ఆ దుష్ప్రచార కథనాలను మంత్రి నారా లోకేష్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేయడం గమనార్హం. అంటే పక్కా పన్నాగంతోనే ప్రభుత్వం, ఎల్లో మీడియా లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి తెగబడినట్లు స్పష్టమవుతోంది. ఈ అంశంపై న్యాయస్థానం విచారణ, తీర్పుతో నిమిత్తం లేకుండా ప్రజలను తప్పుదారి పట్టించడమే చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యమన్నది తేటతెల్లమవుతోంది.


