ఆర్టీసీపై పీపీపీ పిడుగు | Chandrababu Govt stage is set for public-private partnership of bus stations | Sakshi
Sakshi News home page

ఆర్టీసీపై పీపీపీ పిడుగు

Jun 14 2026 5:04 AM | Updated on Jun 14 2026 5:05 AM

Chandrababu Govt stage is set for public-private partnership of bus stations

బస్‌ స్టేషన్లను ప్రైవేటుకు ధారాదత్తం చేయడానికి రంగం సిద్ధం

రూ.5 వేల కోట్ల భూములు అస్మదీయులకు కట్టబెట్టేలా కుతంత్రం

నిర్వీర్యం చేసే కుట్రలో మరో అడుగు ముందుకు వేసిన చంద్రబాబు సర్కారు

12 ఎకరాల్లోని విశాఖ మద్దిలపాలెం బస్‌ స్టేషన్‌ విలువ రూ.2,400 కోట్లు

దీన్ని రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థకు కట్టబెట్టేలా డీపీఆర్‌ 

ఏకంగా 99 ఏళ్ల లీజు రూపంలో అంటే శాశ్వతంగా ధారాదత్తం చేయడమే

ఇదే రీతిలో తిరుపతి, విజయవాడ ఆటోనగర్, గుంటూరులో తక్కువ పెట్టుబడి పెట్టే వారికి అప్పగించేందుకు సన్నాహాలు  

కర్నూలు, అనంతపురం, కడప, ఒంగోలు,  రాజమహేంద్రవరం, ఏలూరు బస్‌ స్టేషన్లూ గుర్తింపు 

చంద్రబాబు సర్కారు నిర్ణయంపై రగిలిపోతున్న ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)పై ప్రై‘వేటు’కు చంద్ర­బాబు కూటమి ప్రభుత్వం మరింత పదును పెడు­తోంది. దాదాపు 50 వేల మంది ఉద్యోగులతో ప్రధాన పబ్లిక్‌ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీని ప్రైవే­టీకరించే కుట్రలో ఒక్కో అంకాన్ని వేగవంతం చేస్తోంది. అందుకోసం ఆర్టీసీ ఆర్థిక మూలా­లను దెబ్బ­­తీస్తూ ఆర్టీసీని దివాలా తీయించేందుకు సిద్ధ­పడు­తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో అత్యంత విలువైన ఆర్టీసీ బస్‌ స్టేషన్ల భూములను అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. ఆర్టీసీకి సొంత బస్సులు లేకుండా చేసి, సొంత ఆస్తులను అన్యా­క్రాంతం చేసి.. అనంతరం ఆర్టీసీ గొంతు నొక్కాలన్న కుతంత్రానికి ప్రభుత్వం బరితెగిస్తోంది. రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ బస్‌ స్టేషన్లు, బస్‌ డిపోలే ఆర్టీసీకి ప్రాణాధారం. 

ఆ ఆయువుపట్టుపై చంద్రబాబు ప్రభుత్వం దెబ్బ కొడుతోంది. ఇప్పటికే ఇ–బస్సుల విధానం ముసుగులో రూ.6,600 కోట్ల విలువైన 12 ఆర్టీసీ డిపోల భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన ప్రభుత్వం.. ఆ కుతంత్రంలో రెండో అంకానికి తెరతీసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రధాన ఆర్టీసీ బస్‌ స్టేషన్ల భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే కార్యాచరణకు ఉపక్రమించింది. పబ్లిక్‌ –ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) ముసుగులో అందుకు సిద్ధపడింది. ప్రభుత్వ పెద్దల అత్యంత ముఖ్యులకే బినామీ పేర్లతో, బినామీ సంస్థల ముసుగులో కట్టబెట్టేందుకు ఇప్పటికే మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. అందుకోసం మొదటి దశలో విశాఖపట్నంలోని మద్దెలపాలెం, విజయవాడ ఆటోనగర్, తిరుపతి, గుంటూరు, కడప, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, రాజమండ్రి, ఏలూరు బస్‌ స్టేషన్లను గుర్తించింది.

రూ.వేల కోట్ల భూములను కారు చౌకగా కట్టబెట్టే కుట్ర 
అత్యంత విలువైన ఆర్టీసీ బస్‌ స్టేషన్లను పీపీపీ విధానంలో కారు చౌకగా తమ అస్మదీయులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. ఏకంగా 99 ఏళ్ల లీజు రూపంలో కట్టబెట్టాలని ఎత్తుగడ వేశారు. విశాఖపట్నంలోని మద్దిలపాలెం ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ 12 ఎకరాల్లో విస్తరించి ఉంది. అత్యంత విలువైన ఆ ప్రాంతంలో మార్కెట్‌ ధర ఎకరం రూ.200 కోట్ల పైమాటే. ఆ ప్రకారం ఆ 12 ఎకరాల మార్కెట్‌ విలువ రూ.2,400 కోట్లు పలుకుతుంది. కానీ ఆ బస్‌ స్టేషన్‌ను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసేందుకు రూ.500 కోట్ల పెట్టుబడి పెడుతుందని డీపీఆర్‌ను ప్రతిపాదించడం గమనార్హం. అంటే రూ.500 కోట్ల పెట్టుబడి పెడతామనే ఓ ప్రైవేటు సంస్థకు రూ.2,400 కోట్ల విలువైన భూములు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం తెగబడుతోందన్నది స్పష్టమవుతోంది. 

⇒ అదే రీతిలో ఇతర బస్‌ స్టేషన్లను పీపీపీ విధానంలో కట్టబెట్టేందుకు ప్రైవేటు సంస్థల పెట్టుబడి కోసం డీపీఆర్‌ను అడ్డగోలుగా రూపొందించడం గమనార్హం. తిరుపతి బస్‌ స్టేషన్‌కు రూ.300 కోట్లు, విజయవాడ ఆటోనగర్‌ బస్‌ స్టేషన్‌కు రూ.150 కోట్లు, గుంటూరు బస్‌ స్టేషన్‌కు రూ.60 కోట్లు పెట్టుబడి పెడతారనే పేరుతో తమ అస్మదీయ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. 

విజయవాడలోని ఆటోనగర్‌ బస్టాండ్‌ 

⇒ కర్నూలు, అనంతపురం, కడప, ఒంగోలు, ఏలూరు, రాజమహేంద్రవరం బస్‌ స్టేషన్ల భూములను కూడా ప్రైవేటుపరం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేవలం నామమాత్రపు లీజుతో ఈ భూములను ధారదత్తం చేసేందుకు ప్రతిపాదనలు ఖరారు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆర్టీసీ ఉన్నతాధికారులకు మౌఖికంగా ఆదేశించినట్టు తెలుస్తోంది. 

⇒ మొత్తం మీద దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా ప్రైవేటు  సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ ఆందోళనలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం బరితెగిస్తోందని మండిపడుతున్నాయి.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement